రూ.9 వేల కోట్ల నెట్‌వర్త్‌తో దేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరు కోచౌసెఫ్ చిట్టిలపిల్లి. రూ. 1 లక్షతో చిన్న కంపెనీని ప్రారంభించిన ఆయన రూ. 11వేల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్‌తో వి-గార్డ్ ఇండస్ట్రీస్, దాదాపు రూ. 2,500 కోట్లతో వండర్లా హాలిడేస్ వంటి కంపెనీలను స్థాపించి అభివృద్ధి చేశారు. వ్యాపారపరంగా ఇంత ఎత్తుకు ఎదిగిన కోచౌసెఫ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది దశాబ్దం ఆయన క్రితం చేసిన నిస్వార్థ చర్య.
కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన కోచౌసెఫ్ 61 ఏళ్ల వయసులో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది తన కిడ్నీని దానం చేయడం. అది కూడా అపరిచితుడైన ఒక పేద ట్రక్కు డ్రైవర్‌కు. ఇందుకు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. వైద్యులు వారించినా లెక్క చేయలేదు. తాను ఇలా చేసింది.. శరీరం ఫిట్‌గా ఉంటే కిడ్నీలో ఒకదానిని దానం చేసినా ఫర్వాలేదని చాటి చెప్పడానికేనని తర్వాత ఓ ప్రముఖ దినపత్రికతో తెలిపారు.
ఎవరీ కోచౌస్ఫ్ కోచౌసెఫ్ చిట్టిలపిల్లి?
కేరళలోని త్రిస్సూర్ శివారులో 1950లో జన్మించారు కోచౌసెఫ్ చిట్టిలపిల్లి. స్థానిక చర్చి పాఠశాలలో చదువుకున్నారు. తరువాత త్రిసూర్‌లోని సెయింట్ థామస్ కళాశాల నుంచి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1973లో తిరువనంతపురంలోని ఎలక్ట్రానిక్స్ కంపెనీలో వోల్టేజ్ స్టెబిలైజర్లు, ఎమర్జెన్సీ ల్యాంప్‌లను తయారు చేయడం ప్రారంభించారు.
మూడేళ్లపాటు అక్కడ సూపర్‌వైజర్‌గా పనిచేసిన కోచౌసెఫ్ ఉద్యోగం వదిలేసి రూ. 1 లక్ష మూలధనంతో 1977లో వి-గార్డ్ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. కేవలం ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన వి-గార్డ్ నేడు దేశంలోనే అతిపెద్ద స్టెబిలైజర్ బ్రాండ్. తన వ్యాపారాన్ని విస్తృతం చేస్తూ కోచౌసెఫ్ 2000 సంవత్సరంలో కేరళలో మొట్టమొదటి వాటర్ థీమ్ పార్క్‌ను ప్రారంభించారు. అలాగే బెంగళూరులో వండర్లా పార్కును ఏర్పాటు చేసింది కూడా ఈయనే.
ఇక సేవా కార్యక్రమాల విషయానికి వస్తే.. కె. చిట్టిలపిల్లి ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వెయ్యి నిరుపేద కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇచ్చారు. స్ట్రే డాగ్ ఫ్రీ ఉద్యమానికి అధ్యక్షత వహించారు. అత్యధిక పన్ను చెల్లింపుదారులలో ఒకరిగా భారత ప్రభుత్వం నుంచి రాష్ట్రీయ సమ్మాన్ అవార్డుతో సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. ప్రాక్టికల్ విజ్డమ్ సిరీస్, తన ఆత్మకథ ‘ఒర్‌మక్కిలివాథిల్’తో సహా పలు పుస్తకాలను రచించారు. కోచౌసెఫ్ సతీమణి పేరు షీలా. వీరికి అరుణ్, మిథున్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు వి-గార్డ్, వండర్లా వ్యాపారాలను చూసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment