సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లో క్రమబద్ధీకరణకు సంబంధించి లెక్కా పత్రం లేక అయోమయం నెలకొంది. ఎల్‌ఆర్‌ఎస్ కింద 65,669, బీపీఎస్ కింద 8676 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 7,656 ఎల్‌ఆర్‌ఎస్, 382 బీపీఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సిబ్బంది అధికారుల దృష్టికి తెచ్చారు. వాస్తవానికి బీపీఎస్ దరఖాస్తులు 520, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు సుమారు 10వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అనుమతి కోరుతూ లేఖ రాయాలని నిర్ణయించారు. అందులో భాగంగా అధికారులు ఇప్పుడు ఆగమేఘాలపై ఆ వివరాలను తెప్పించేం దుకు 4 జోనల్ కార్యాలయాలపై ఒత్తిడి పెంచారు. ఈ నెల 11లోగా ఎల్‌ఆర్‌ఎస్ పెండింగ్ దరఖాస్తుల వివరాలు కేంద్ర కార్యాలయానికి పంపాలని హుకుం జారీ చేశారు. ఆ తర్వాత నాలుగు రోజుల్లో ఆయా వివరాలను స్థిరీకరించి ఈ నెల 15 తర్వాత ప్రభుత్వానికి నివేదించాలని కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ప్లానింగ్ విభాగం అధికారులకు గడువు నిర్దేశించారు. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ పెండింగ్ దరఖాస్తుల లెక్క తేల్చే పనిలో ప్లానింగ్ విభాగం సిబ్బంది బిజీ అయ్యారు. ప్రధానంగా ఘట్‌కేసర్, మేడ్చల్ జోనల్ కార్యాలయాల నుంచి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల వివరాలు అధికంగా రావాల్సి ఉందని సమాచారం.
గడువు ముగిసినా...
నిర్ణీత గడువులోగా అపరాధ రుసుం చెల్లించిన వారికి సైతం అధికారులు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2008లో మొదలైన ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ ప్రక్రియ 2013 మే 31వరకు పలు దఫాలుగా గడువు పెంపుతో కొనసాగింది. బీపీఎస్ కథ ముగియగా... ఎల్‌ఆర్‌ఎస్ గడువు ముగిసినప్పటికీ దరఖాస్తుల పరిశీలన, ఉత్తర్వుల జారీకి 2013 నవంబర్ 30వరకు అవకాశమిచ్చారు. గడువు ముగిసే చివరి రోజున హడావుడి చేసిన అధికారులు సుమారు 200లకు పైగా దరఖాస్తులను పరిష్కరించినా వీటికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను ఇవ్వలేకపోయారు. ఫీజు చెల్లించిన వారికి కూడా క్రమబద్ధీకరణ ఉత్తర్వులు అందని పరిస్థితి ఏర్పడింది. ఆలాగే బీపీఎస్‌కు సంబంధించి వివాదం నేటికీ ఓ కొలిక్కి రాలేదు. గడువులోగా అపరాధ రుసుంతో చెల్లించినప్పటికీ అధికారులు, సిబ్బంది నిర్లిప్త వైఖరి వల్ల బీపీఎస్ దరఖాస్తుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది.
ఆదిలోనే నిర్లక్ష్యం ...
ఆరంభంలో ఎల్‌ఆర్‌ఎస్/బీపీఎస్ దరఖాస్తుల వివరాలను కంప్యూటరీకరించక పోవడంతో ఇప్పుడు లెక్కలు తేలని దయనీయ పరిస్థితి ఏర్పడింది. కొందరు అక్రమార్కులు తమ బండారం బయటపడకుండా ఏ వివరాలనూ కంప్యూటరీకరించకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో అక్రమార్కుల జేబులు నిండాయే తప్ప హెచ్‌ఎండీఏ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడింది. క్రమబద్ధీకరణ ముసుగులో నియమ నిబంధనలకు తిలోదకాలిచ్చి భారీగా దండుకొన్న కొందరు అక్రమార్కులు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా చేసేందుకు ఏకంగా ఫైళ్లనే తగులబెట్టిన సంఘటన శంకర్‌పల్లి జోనల్ కార్యాలయంలో చోటు చేసుకొంది. దీనిపై నిజా నిజాలు నిగ్గు తేల్చేం దుకు విచారణ చేపట్టిన సిబిసిఐడీ కూడా జాప్యం చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇంకా తేలని లెక్క !
Published Sun, Jan 5 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement