తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పులు తీర్చే దారిలేక అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడడంతో.. ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి.
నల్గొండ: అప్పుల బాధ భరించలేక రైతు తన చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం నామాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండెబోయిన యాదయ్య(42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పత్తి సాగు కోసం చేసిన అప్పులు భారీగా పెరిగిపోయాయి. అంతేకాకుండా ఈ ఏడాది కూడా పంట ఆశించిన స్థాయిలో దిగుబడి ఇవ్వకపోవడంతో.. అప్పులు తీర్చే దారి కానరాక పంటచేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఆదిలాబాద్: ఆస్తి అమ్ముకున్నా అప్పులు తీరకపోవడంతో చేసేదిలేక అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం రేవోజిపేట గ్రామానికి చెందిన లింగిని రాజుమల్లు(40) తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు ఎక్కువవడంతో.. రెండు ఎకరాల భూమి అమ్మేశాడు. అయినా చేసిన అప్పుతీరకపోయేసరికి మనస్తాపానికి గురై ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటాన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆగని రైతన్నల ఆత్మహత్యలు
Published Sun, Nov 1 2015 11:30 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement