సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో పరిస్థితి రోజురోజుకు చేయి దాటిపోతోంది. ఆ జిల్లాలో కరాళనృత్యం చేస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. ఈ ప్రాణాంతక వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ప్రతి రోజు పెరుగుతోన్న కేసులతో అధికారులు, ప్రజలే కాదూ రాష్ట్ర ప్రభుత్వమూ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా గురువారం మరో పది పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. దీంతో ఆ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 45కు చేరింది. గురువారం నమోదైన కేసుల్లో మోమిన్‌మహళ్లకు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. వీరిలో 30 ఏళ్ల మహిళతో పాటు ఆమె తొమ్మిది, పన్నెండేళ్ల కుమారులు ఇద్దరు, ఆరేళ్ల కూతురున్నారు. సదరు మహిళ భర్తకు ఇది వరకే కరోనా పాజిటివ్ రాగా.. ప్రస్తుతం అతను గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ద్వారా వీరికి వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానంతో మూడు రోజుల క్రితమే నిర్ధారణ పరీక్షలు చేయగా వీరికీ పాజిటివ్ అని గురువారం తేలింది. దీంతో ఆ కుటుంబంలో కరోనా బాధితుల సంఖ్య ఐదుకు చేరింది.
వైద్యవర్గాల్లో కలవరం..
గద్వాల ఏరియా ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్‌లో విధులు నిర్వర్తిస్తోన్న ల్యాబ్ టెక్నిషియన్‌కూ పాజిటివ్ అని తేలింది. దీంతో అతనితో కలిసి ఆ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బంది అందరూ ఉలికిపడ్డారు. సదరు ల్యాబ్ టెక్నిషియన్ కరోనా అనుమానితుల గొంతు, ముక్కు నుంచి నమూనాలు సేకరించేవాడు. వారితో ఇతనికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. సదరు టెక్నిషియన్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించిన అధికారులు అతని కుటుంబ సభ్యులతో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. సహాయకులుగా సేవలందించే సిబ్బందికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఇది వరకే ఆదేశించింది.
ఆందోళనలో అధికార యంత్రాంగం
రోజు రోజుకు పెరుగుతోన్న పాజిటివ్ కేసులను ఎలా కట్టడి చేయాలో తోచని స్థితిలో జిల్లా యంత్రాంగం కొట్టిమిట్టాడుతోంది. ఇప్పటికే మర్కజ్ లింకుతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోన్న క్రమంలో మరోవైపు కర్నూలులో వైద్య సేవలు పొందిన గద్వాల జిల్లా వాసులకు వైరస్ సోకడం ఆందోళనకు గురి చేస్తోంది. గద్వాలలో పరిస్థితిని అదుపులోకి తేవాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్యారోగ్య ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ మహేందర్‌రెడ్డి గద్వాలకు వచ్చి కలెక్టర్ శృతి ఓఝా, ఇన్‌చార్జ్ ఎస్పీ అపూర్వరావు, ఇతర జిల్లా అధికారులను దిశానిర్దేశం చేశారు. వారి పర్యటన మరుసటి రోజే ఏకంగా పది కేసులు నమోదు కావడం.. ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశాలుండడంతో వాటిని కట్టడి చేయడం అధికార యంత్రాంగానికి సవాలుగా మారింది. కాగా.. గురువారం 60 మంది నమూనాలకు సంబంధించిన ఫలితాలు రాగా, పది నిర్ధారణ అయ్యాయి.
కలకలం రేపిన బార్బర్ పాజిటివ్ కేసు..
గద్వాల రాంనగర్‌కు చెందిన ఓ బార్బర్‌కి పాజిటివ్ వచ్చింది. మర్కజ్ వెళ్లి వచ్చిన వారికి కటింగ్, గడ్డం చేయడంతోనే వారి ద్వారా ఇతనికి వైరస్ సోకినట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత నెల ఢిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వారితో పాటు వారి కుటుంబసభ్యులు, సన్నిహితులు 40 మందికి లాక్‌డౌన్ కంటే ముందే కటింగ్ చేసినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఇటీవల మర్కజ్ కేసుల సంఖ్య పెరగడంతో వారికి కటింగ్ చేసిన సదరు బార్బర్‌ని గుర్తించిన అధికారులు నాలుగు రోజుల క్రితమే అతడిని క్వారంటైన్‌కు తరలించారు. ఇతనికి కరోనా లక్షణాలు లేకున్నా.. ముందస్తు జాగ్రత్త నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఇతనికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఇతని వద్ద కటింగ్ చేయించుకున్న ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా.. బార్బర్ కుటుంబ సభ్యులనూ అధికారులు ముందస్తు జాగ్రత్తగా జిల్లాకేంద్రంలోని క్వారంటైన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment