సాక్షి, రాజోళి (జోగులాంబ గద్వాల్): జిల్లాలోని రాజోళిలో ఓ ఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించాడు. కర్నూలుకు చెందిన ఇద్దరు వ్యక్తులపై తోటి సిబ్బందితో కలిసి విచక్షణా రహితంగా దాడి చేయించాడు. లక్ష్మణ్ అనే వ్యక్తి మరో యువకుడితో కలిసి రాజోళిలోని నిర్మానుష్య ప్రదేశంలో పార్టీ చేసుకుంటుండగా ఎస్సై లెనిన్ వారితో దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా యువకుడి తలను ఇన్నోవా కారు అద్దానికేసి బలంగా కొట్టాడు. ఆ తరువాత ఇద్దరు యువకులే మద్యం సేవించి కారు అద్దాలు పగలగొట్టినట్లు ప్రచారం చేయించారు.
ఈ ఘటనపై ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ రంగస్వామి, శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు సోమవారం రాజోళి లో విచారణ చేపట్టారు. ఎల్లమ్మ గుడి వద్ద జరిగిన సంఘటన, లక్ష్మణ్‌పై పోలీసులు దాడి చేసేందుకు గల కారణాలను అక్కడి రైతులతో అడిగి తెలుకున్నారు. మద్యం తాగుతున్న సమయంలో తమతో లక్ష్మణ్ గొడవ పెట్టుకున్నాడని వారు పేర్కొన్నారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వచ్చిన వారితోనూ అతను వాగ్వాదానికి దిగాడన్నారు. ప్రతిఘటించే సమయంలో ఎస్‌ఐ లెనిన్ దాడి చేశారని తమ విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు.
వీడియో వైరల్..
ఆదివారం జరిగిన దానికి పోలీసులు చెప్పిన దానికి అంతా సరిపోయిందనుకునేలో గానే సోమవారం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. అందులో లక్ష్మణ్ కిందపడగా ఎస్‌ఐ లెనిన్ బూటు కాలుతో దాడి చేస్తుండగా.. మరో కానిస్టేబుల్ సహకరించాడు. దీని ఆధారంగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు బాధితుడు లక్ష్మణ్ తరఫున బీసీ కమిషన్, హెచ్‌ఆర్‌సీలను ఆశ్రయించారు.
కంగుతిన్న పోలీసులు
తమపై దాడికి యత్నించినందుకే కర్నూలుకు చెందిన లక్ష్మణ్‌పై కేసు నమోదు చేశామని, ఈ క్రమంలో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయని ఆదివారం చెప్పిన పోలీసులు, సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో కంగుతిన్నారు.
Comments
Please login to add a commentAdd a comment