rajoli
-
'గజేంద్ర మోక్షం' ఆధారంగా ఆలయం!
పురాతన ఆలయం, చెక్కు చెదరని శిల్పకళా సౌందర్యం, ఆహ్లాదకరమైన తుంగభద్ర (Tungabhadra) నదీతీరం.. వెరసి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే రాజోలి (Rajoli) వైకుంఠ నారాయణస్వామి నిలయం. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కల్యాణి చాళుక్య రాజు త్రిభువన మల్ల సోమేశ్వరుడు నిర్మించారని ఆధారాలు చెబుతున్నాయి. వైకుంఠ నారాయణస్వామి ఆలయం ముందు భాగంలో గరుత్మంతుని గుడి ఉంది. గుడికి ఎడమ భాగాన ధ్వజపీఠం, ఆ వెనుక బలిపీఠాలు ఉన్నాయి. వైకుంఠంలో వెలసిన శ్రీమన్నారాయణుడే రాజోలిలో కొలువైనట్లు భక్తుల విశ్వాసం. ఇక్కడున్న శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడు. మూడున్నర అడుగుల దివ్య మంగళుడు. అన్నిచోట్లా దర్శనమిస్తున్నట్టు కాకుండా.. ఇక్కడ చక్ర హస్తంలో గధ, గధ హస్తంలో చక్రం ధరించి ఉంటాడు. ఇలాంటి స్వామివారి దర్శనం ఎక్కడా ప్రాచుర్యంలో లేదు. నారాయణుడికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామి నెలకొన్న పీఠం రెండు అడుగుల ఎత్తు, అడుగున్నర వెడల్పు ఉంది. ఒకటిన్నర ఎత్తు ఉన్న అమ్మవారి విగ్రహాలు అందంగా, కళాత్మకంగా ఉన్నాయి. పక్కగుడిలోని అమ్మవారు కూర్చున్న పీఠం అడుగు కాగా, ఆమె మూర్తి ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉంది. దేవాలయం బయట పురాణ, మాయణ, గవత, వైష్ణవ పురాణగాథలు, జలభూభాగాల్లోని జంతు జాలాలను అద్భుత శిల్ప కళానైపుణ్యం ఉట్టి పడేలా మలిచారు. ఈ శిల్ప కళను చూడాలంటే రెండు కళ్లు చాలవు.ఇప్పటి రాజోలి.. ఒకప్పుడు అడవి గజేంద్ర మోక్షం(Gajendra Moksham) ఆధారంగా ఆలయ నిర్మాణం జరిగిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ప్రస్తుతం రాజోలి గ్రామం ఉన్న ప్రదేశమంతా అడవి. దీనికి కొద్ది దూరంలో రాంపాడు అనే గ్రామం ఉండేది. ఈ అడవిలో ఏనుగులు విపరీతంగా సంచరిస్తుండేవి. వేసవి కాలంలో ఏనుగులు తాగునీటికి చాలా ఇబ్బంది ఉండేవి. అక్కడికి కొద్దిదూరంలో అంటే.. ప్రస్తుతం తూర్పు గార్లపాడు గ్రామం దగ్గర దేవమ్మ మడుగు ఉండేది. ఏనుగులు అక్కడికి వెళ్లి దాహం తీర్చుకునేవి. ఒకరోజు ఏనుగులు దాహం తీర్చుకోవడానికి వెళ్లగా ఆ మందకు పెద్దదిక్కైన ఒక ఏనుగును మడుగులో ఉన్న మొసలి పట్టుకుంది. ఎంతకూ అది వదలకపోవడంతో ఆ ఏనుగు నారాయణుడిని ప్రార్థించిందని.. ఆ మొర విన్న స్వామి వైకుంఠం నుంచి ఏనుగును కాపాడేందుకు వచ్చారని భక్తుల నమ్మకం. శరణు వేడుకున్న వారిని కాపాడాలనే తొందరలో శంఖు, చక్ర, గధ, పద్మధరుడైన మహా విష్ణువు, చక్ర హస్తంలో గధ, గధ హస్తంలో చక్రం ధరించి వచ్చారంటారు. ఆ విషయం అమ్మవార్లు చెప్పాక స్వామివారు గమనించారని.. శరణు కోరిన ఏనుగును చక్రంతో కాపాడారని.. దాని ఆధారంగా ఇక్కడ గుడి నిర్మాణం జరిగిందని స్థానికులు చెబుతారు.తిరుమల వెంకన్నను దర్శించినంత ఫలితం అప్పట్లో కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతీయులు, వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలకు వెళ్లారు. వారిని అక్కడివారు ఎక్కడినుంచి వచ్చారని పలకరించగా.. తాము తుంగభద్ర నదీతీరంలోని రాజోలి ప్రాంతం వారిమని సమాధానమిచ్చారు. అందుకు వారు ఆశ్చర్యానికి లోనై.. సాక్షాత్తు వైకుంఠ నారాయణస్వామి కొలువైన ఆ దేవాలయాన్ని వదిలి ఇంత దూరం వచ్చారా? ఇక్కడి శ్రీనివాసుడే అక్కడి వైకుంఠ నారాయణుడని, అది సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి సన్నిధిని.. కలియుగ వైకుంఠమని స్పష్టం చేసినట్టు ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే తుంగభద్ర నదిలో రాంపాటి ఈశ్వరాలయం ఉంది.శ్రీమదలం పురీక్షేత్ర మహత్మ్యమ్ (స్థల పురాణం)లో ఒక శ్లోకం ఉంది. అందులో ‘తుంగా నారాయణస్సాక్షాత్ భద్రాదేవోమహేశ్వరః ఉభయోసంగమే యత్ర ముక్తిస్త్రత నసంశయః’.. అంటే తుంగ, భద్ర అనే రెండు నదులు పశ్చిమ కనుమల్లో వేర్వేరు చోట్ల ద్వారా ఒకచోట రెండు కలుస్తాయి. ఉంగానది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కాగా భద్రా నది పరమేశ్వరుడిగా చెబుతారు. ఈ నదులు ఎక్కడ ప్రవహిస్తాయో.. అక్కడ స్నానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. అంతటి పవిత్రమైన వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది రాజోలి. ఇక్కడ వైకుంఠనారాయణ ఆలయంతో పాటు ఎడమవైపు శ్రీలక్ష్మి ఆలయం, వాయవ్య దిశలో అంజనేయ స్వామి, వేణుగోపాలస్వామి ఆలయం, నవగ్రహాలయం, ఈశ్వరాలయం, భువనేంద్రస్వామి ఆలయం ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది.ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ వైకుంఠ నారాయణస్వామి ఆలయం నిరాదరణకు గురవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖలో విలీనమైనా.. ఆలయానికి మాన్యాలున్నా అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయాన్ని వెలుగులోకి తెస్తే ముక్కోటి ఏకాదశి రోజు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తిరుపతి దాకా వెళ్లనవసరం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆలయం ఒక్క రాజోలికే కాక తెలంగాణకు, దేశానికే తలమానికమని వారు స్పష్టం చేస్తున్నారు. చదవండి: ఆ గుడిలో దేవుడు లేడు.. అయినా జనాల క్యూ!ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోకపోయినా.. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఆలయాన్ని అభివృద్ధిలోకి తెచ్చి చరిత్రను కాపాడాలని కోరుతున్నారు. ఇప్పటికే ముక్కోటి ఏకాదశికి జిల్లా నలుమూలలతో పాటు, కర్నూల్ జిల్లా నుంచి భక్తులు వస్తుంటారు. అమావాస్య రోజు, వైకుంఠ ఏకాదశి రోజు స్థానికులు దాతల సహాయంతో వేలాది మంది భక్తులకు అన్నదానం, అల్పాహారం, తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు. పుష్కరాల సమయాల్లో తుంగభద్ర నదీ పరీవాహక గ్రామాల్లో ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే ఆలయం మరింత అభివృద్ధిలోకి నోచుకుంటుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక దృష్టి పెట్టాలి రాజోలిలోని వైకుంఠ నారాయణస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ప్రభుత్వం ఈ ఆలయంపై శ్రద్ధ పెట్టాలి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఇది చాలా మందికి తెలియక ఎన్నో వ్యయ ప్రయాసలతో దూరాన ఉన్న క్షేత్రాలకు వెళ్తున్నారు. ఈ ఆలయం విశిష్టత తెలిసినట్లయితే భక్తులు ఎక్కువగా దర్శించుకుని, ఆలయాభివృద్ధి జరిగే అవకాశముంది. – సురేశ్, శాంతినగర్ చరిత్ర కలిగిన ఆలయం గజేంద్ర మోక్షం ఆధారంగా నిర్మించిన వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో ప్రతి ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. చరిత్ర కలిగిన ఈ ఆలయం వివక్షకు గురవుతోంది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఆలయం ప్రాచుర్యంలోకి తీసుకురావాలని స్థానికంగా ఎంతో కృషి చేస్తున్నాం. ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాలు, భజనలు చేస్తూ ఆధ్యాత్మికత భావనను పెంచుతున్నాం. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. – అంజి, రాజోలి -
జోగులాంబ గద్వాల్లో ఎస్సై వీరంగం.. వీడియో వైరల్
సాక్షి, రాజోళి (జోగులాంబ గద్వాల్): జిల్లాలోని రాజోళిలో ఓ ఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించాడు. కర్నూలుకు చెందిన ఇద్దరు వ్యక్తులపై తోటి సిబ్బందితో కలిసి విచక్షణా రహితంగా దాడి చేయించాడు. లక్ష్మణ్ అనే వ్యక్తి మరో యువకుడితో కలిసి రాజోళిలోని నిర్మానుష్య ప్రదేశంలో పార్టీ చేసుకుంటుండగా ఎస్సై లెనిన్ వారితో దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా యువకుడి తలను ఇన్నోవా కారు అద్దానికేసి బలంగా కొట్టాడు. ఆ తరువాత ఇద్దరు యువకులే మద్యం సేవించి కారు అద్దాలు పగలగొట్టినట్లు ప్రచారం చేయించారు. ఈ ఘటనపై ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ రంగస్వామి, శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు సోమవారం రాజోళి లో విచారణ చేపట్టారు. ఎల్లమ్మ గుడి వద్ద జరిగిన సంఘటన, లక్ష్మణ్‌పై పోలీసులు దాడి చేసేందుకు గల కారణాలను అక్కడి రైతులతో అడిగి తెలుకున్నారు. మద్యం తాగుతున్న సమయంలో తమతో లక్ష్మణ్ గొడవ పెట్టుకున్నాడని వారు పేర్కొన్నారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వచ్చిన వారితోనూ అతను వాగ్వాదానికి దిగాడన్నారు. ప్రతిఘటించే సమయంలో ఎస్ఐ లెనిన్ దాడి చేశారని తమ విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. వీడియో వైరల్.. ఆదివారం జరిగిన దానికి పోలీసులు చెప్పిన దానికి అంతా సరిపోయిందనుకునేలో గానే సోమవారం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. అందులో లక్ష్మణ్ కిందపడగా ఎస్ఐ లెనిన్ బూటు కాలుతో దాడి చేస్తుండగా.. మరో కానిస్టేబుల్ సహకరించాడు. దీని ఆధారంగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు బాధితుడు లక్ష్మణ్ తరఫున బీసీ కమిషన్, హెచ్‌ఆర్‌సీలను ఆశ్రయించారు. కంగుతిన్న పోలీసులు తమపై దాడికి యత్నించినందుకే కర్నూలుకు చెందిన లక్ష్మణ్‌పై కేసు నమోదు చేశామని, ఈ క్రమంలో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయని ఆదివారం చెప్పిన పోలీసులు, సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో కంగుతిన్నారు. -
జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోళిలో ఓ ఎస్సై అరాచకం
-
వాగు.. వంక ఎండిపోయే..
► గ్రామాల్లో అలుముకున్న కరువుఛాయలు ► పశువుల తాగునీటికి తప్పని తిప్పలు ► ఎండిన పంటలు.. ఆందోళనలో రైతన్నలు రాజోళి : గ్రామాల్లో ఉండే వాగులు, వంకలు అప్పుడే ఎండిపోయాయి. ఒకప్పుడు పశువులకు తాగునీరు అందించి, పశుగ్రాసం పండేందుకు అనుకూలంగా ఉన్న ఆయా గ్రామాల వాగులు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. మండల కేంద్రమైన రాజోళితోపాటు మాన్‌దొడ్డి, పచ్చర్ల తదిదర గ్రామాల వాగులు గతంలో వేసవి కాలం లోనూ పశువులకు నీరందించడమే కాక, గ్రామ ప్రజలకు ఆయా అవసరాలు తీర్చేవి. ప్రస్తుతం ఆ వాగులన్నీ పూర్తిగా ఎండిపోవడంతో గ్రామాల్లో పశువులకు తాగునీరు దొరకక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోయిన పంటలు: ఆయా వాగుల ద్వారా ప్రతి సంవత్సరం పంటలు పండించేవారు. ఈసారి కూడా ఎప్పటిలాగే వరి సాగుచేసినప్పటికీ సరైన వర్షాలు లేక, ఆర్డీఎస్కు నీరు రాక గ్రామాల్లోని వాగులన్నీ ఎండిపోయా యి. ఆ వాగుల కింద సాగుచేసిన పంటలు కూడా ఏమాత్రం చేతికి రాలేదు. దీంతో పశువులకు గ్రాసం కూడా కరువై పాడి రైతులు పశువులను అమ్ముకునే పరిస్థితి ఎదురైంది. పెద్దవాగులకే దిక్కులేదు: మండలంలో ఇప్పటికే కరువుఛాయలు అలుముకున్నాయి. రాజోళి, మాన్‌దొడ్డిలో పెద్ద వాగులుగా పేరున్నాయి. మాన్‌దొడ్డి వాగు కింద నీటి లభ్యత ఉన్న సమయంలో వరి పంటతో పాటు ఇతర పశుగ్రాసం, మరికొందరు కూరగాయలు సాగు చేసుకునేవారు. ప్రస్తుతం భిన్న పరిస్థితి నెలకొంది. వాగు మొత్తం ఎండిపోయి ఎడారిని తలపిస్తుంది. ఈ వాగులు ఎండిపోవడంతో అటు పశువులకు తాగునీరు, గ్రాసం కూడా దొరకడం లేదు. వీటితోపాటు గ్రామంలోని రజకులు దుస్తులు ఉతకడానికి, ఇతర అవసరాలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
కుందూలో వ్యక్తి గల్లంతు
చాగలమర్రి/ రాజుపాళెం: కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలోని రాజోలి ఆకనట్ట వద్ద కుందూనదిలో మంగళవారం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పొద్దుటూరుకు చెందిన ఈశ్వరయ్య, బాలరోసిలు రాజోలి ఆనకట్ట వద్ద చేపలు పట్టేందుకు వచ్చారు. రాజోలి ఆనకట్ట పైభాగం నుంచి ఈశ్వరయ్య ప్రమాదవశాత్తు కూందూనదిలో పడిపోయాడు. నీటి ఉధృతి అధికంగా ఉండటంతో క్షణాల్లో గల్లంతయ్యాడు. అతని మిత్రుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ మోహన్‌రెడ్డి రాజోలి ఆనకట్ట వద్దకు చేరుకొన్నారు. గజ ఈత గాళ్లతో ఈశ్వరయ్య ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
రాజోలి ఆనకట్ట నుంచి కేసీకి నీరు విడుదల
చాగలమర్రి: మండల పరిధిలోని రాజోలి ఆనకట్ట నుంచి కే సీ కాలువకు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి శనివారం నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాజోలి ఆనకట్ట నుంచి∙500 క్యూసెక్కుల నీటిని కేసీకి విడుదల చేశామన్నారు. కాలువకు నాలుగు రోజుల ముందే నీటిని విడుదల చేయాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యంతో జాప్యం జరిగిందన్నారు. ఏదిఏమైనా కాలువకు నీటి విడుదలతో రైతులు వరి నాట్లు వేసుకోవచ్చని, చివరి ఆయకట్టుకు నీరు అందేలా తన వంతుగా చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో కేసీ కాలువ ఈఈ కొండారెడ్ది, డీఈ జిలాన్, ఏఈ మస్తాన్, దువ్వూరు ఎంపీపీ చంద్రావతి, రైతులు శివశంకర్‌రెడ్డి, మునిరెడ్డి, నరసింహారెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజోలిలో దారుణహత్య
శాంతినగర్: వడ్డేపల్లి మండలం రాజోలిలో ఓ యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే మటన్ వ్యాపారి అమీర్ (30)ను ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో నరికి పారిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాజోలికి చెందిన కటిక అమీర్ (30)మటన్ వ్యాపారం చేసేవాడు. ఏడాది క్రితం అమీర్‌కు వివాహమైంది. 2008లో జరిగిన ఇనుప సామాన్ల వ్యాపారి బాబుమియా హత్యకేసులో ప్రధాన నిందితుడు. అలాగే మరో కేసులోనూ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజులుగా గ్రామానికి చెందిన కొందరితో పేకాటకు సంబంధించిన డబ్బుల వ్యవహారంలో అమీర్ గొడవపడుతున్నాడని సమాచారం. ఈక్రమంలో గురువారం రాత్రి అతడు తన మటన్‌షాపు సమీపంలో నిలబడి ఉండగా, ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి అమీర్ తల నరకడంతో పాటు ఎడమ చేయి మణికట్టు వరకు కోసి, పరారయ్యాడు. హఠాత్తుగా జరిగిన సంఘటనతో మటన్ మార్కెట్ పరిసరాల్లో ఉన్న జనం భయపడ్డారు. విషయం తెలుసుకున్న మృతుడి తల్లి, భార్య సంఘటన స్థలానికి చేరుకుని అమీర్ మృతదేహంపై పడి బోరున విలపించారు. సంఘటన స్థలాన్ని శాంతినగర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు పరిశీలించి పంచనామా నిర్వహించారు. గతంలో జరిగిన హత్యల నేపథ్యంలో హత్య చేశారా లేక పేకాట గొడవల వల్ల హత్యకు గురయ్యాడా అనే విషయంపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. అమీర్‌ను హత్య చేసిన నిందితుడు నేరుగా వెళ్లి రాజోలి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. -
వైద్యం వికటించి అసువులు బాసిన సోదరులు
శాంతినగర్(మహబూబ్‌నగర్): మద్యం మాన్పించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. నాటువైద్యం వికటించి సోదరులు వరుసయ్యే ఇద్దరు చనిపోయారు. ఈ విషాదకర సంఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మండలం రాజోలి గ్రామంలో జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం రాజోలి గ్రామానికి చెందిన నాగన్న(30) మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతనికి వరుసకు తమ్ముడైన ఇటిక్యాల మండలం మునుగాల గ్రామానికి చెందిన భాస్కర్(28) అలియాస్ రాజుతో కలసి తరుచూ మద్యం తాగేవాడు. మద్యం వ్యసనం నుంచి దూరం చేయాలని సంకల్పించిన బావమరిది సుధాకర్ వారిద్దరినీ కర్నూలు జిల్లా సోముల గూడూరులో ఉన్న నాటువైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ చెట్టుపసరు తాగిన అనంతరం తిరిగి ఆటోలో గ్రామాలకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం నాగన్న, భాస్కర్ అపస్మారక స్థితికి చేరుకున్నారు. వైద్యుడికి చూపించగా అప్పటికే ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.