నడిగడ్డను దోచుకున్నారు.. | Minister Srinivas Goud Attended the Pension Distribution Program in Gadwal | Sakshi
Sakshi News home page

నడిగడ్డను దోచుకున్నారు..

Published Sun, Jul 21 2019 8:55 AM | Last Updated on Sun, Jul 21 2019 8:56 AM

Minister Srinivas Goud Attended the Pension Distribution Program in Gadwal - Sakshi

కల్యాణలక్ష్మి చెక్కులను అందజేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు

గద్వాల అర్బన్‌: గడిచిన 70 ఏళ్లలో నడిగడ్డ అన్నిరంగాల్లో దోపిడీకి గురైందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఇక్కడి పాలకులు ఏసీ కార్లలో తిరుగుతుండగా ప్రజలు వలస పోతున్నారన్నారు. ప్రభుత్వం పెంచిన ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరై మాట్లాడారు. మా పూర్వీకులు అలంపూర్‌ వాసులని, నడిగడ్డతో నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయని వివరించారు. రెండు జీవ నదుల మధ్య ఉన్న ఇక్కడి ప్రజలు ఇంకా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడానికి గత పాలకుల దోపిడీనే కారమణ్నారు. సీఎం కేసీఆర్‌ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం శరవేగంగా పూర్తి చేసి అలంపూర్‌ ప్రజలకు తాగు, సాగునీరు అందిస్తున్నామన్నారు. అలాగే గట్టు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశామని, వచ్చే ఐదేళ్లలో నిర్మాణం పూర్తి చేసి కోనసీమను తలపించేలా ఈ ప్రాంతం పచ్చని పైర్లతో కళకళలాడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

వృద్ధులను ఆదరిస్తున్నారు.. 
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులు, వితంతులకు రూ.2 వేలు, వికలాంగులకు రూ.3 వేల ఆసరా పింఛన్లు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇన్నాళ్లు నిరాధారణకు గురైన వృద్ధులను ఆసరా పింఛన్లతో ప్రతి ఇంట్లో కొడుకులు, మనువళ్లు ఆదరిస్తున్నారన్నారు. గతంలో బోర్లు ఉంటే కరెంట్‌ ఉండేది కాదని, కరెంట్‌ ఉంటే ఎరువులు, విత్తనాలు ఉండేవి కావన్నారు. వ్యవసాయం దండగ అని భావించి వ్యవసాయాన్ని వదిలేస్తున్న సమయంలో సీఎం కేసీఆర్‌ రైతు పెట్టుబడి సాయం పథకం అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతు సగర్వంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడని చెప్పారు. అలాగే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలతో బీడు భూములకు నీళ్లు మళ్లించే ఉద్యమం కేసీఆర్‌ నాయకత్వంలో అడుగులు పడుతున్నాయన్నారు. నూతన మున్సిపల్‌ చట్టంతో సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయన్నారు. గద్వాలను పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.

 గద్వాల– మాచర్ల రైల్వేలైన్‌కు కృషి 
గద్వాల– మాచర్ల రైల్వేలైన్‌ నిర్మాణానికి శాయశక్తులా కృషిచేస్తానని ఎంపీ రాములు అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ అంశంపై ప్రస్తావించానని గుర్తు చేశారు. ఏ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తు న్నారన్నారు. అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలబెట్టేందుకు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో పనిచేస్తానన్నారు.

 ఓటు బ్యాంకుగానే చూశారు.. 
గత పాలకులు ఇక్కడి ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి విమర్శించారు. 40 ఏళ్లు ఒకే కుటుంబం పాలించి వారి ఆస్తులు పెంచుకున్నారని, కానీ ప్రజల కష్టాలు తీర్చలేదన్నారు. సుమారు 10 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో చిన్నతరహా, కుటీర పరిశ్రమలు స్థాపిస్తానని, అందుకు అడుగులు ప్రారంభమయ్యాయని చెప్పారు. త్వరలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించి కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రాములు చేతుల మీదుగా అందజేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పౌర సన్మానం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, కలెక్టర్‌ శశాంక, ఆర్డీఓ రాములు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కేశవ్, జెడ్పీ మాజీ చైర్మన్‌ భాస్కర్, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ, ఎంపీపీలు నజీమా ఉన్నీసాబేగం, మనోహరమ్మ, తిరుమల్‌రెడ్డి, రాజారెడ్డి, విజయ్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యులు పద్మ, శ్యామల, రాజశేఖర్, ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌  జ్యోతి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement