వంతెనల నిర్మాణాలు పూర్తయ్యేనా! | Unfinished Bridge In Mahabubnagar | Sakshi
Sakshi News home page

వంతెనల నిర్మాణాలు పూర్తయ్యేనా!

Published Tue, Nov 13 2018 12:16 PM | Last Updated on Wed, Mar 6 2019 6:19 PM

 Unfinished Bridge In Mahabubnagar - Sakshi


సాక్షి, అలంపూర్‌: ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న ప్రభుత్వ పనులు ఏళ్ల తరబడిగా కొనసాగుతున్నాయి. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో వాటితో కలిగే ప్రయోజనాలు ఏమో కానీ వాహనదారులు మాత్రం రోజూ నరకయాతన అనుభవిస్తున్నారు. నిర్మాణాలకు నిర్ధేశించిన గడువు ఉన్నప్పటికీ పనులు చేపడుతున్న సంస్థలు పట్టించుకోవడం లేదు.

   దీంతో నిర్మాణాలు ఏళ్ల తరబడిగా కొనసాగుతున్నాయి. అలంపూర్‌ రోడ్డు మార్గంలోని నిర్మిస్తున్న రెండు ప్రధాన బ్రిడ్జిలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు నత్తనడకన సాగుతుండటంతో ఈ మార్గంలో రోజు రాకపోకలు సాగిస్తున్న వాహనదారులతో పాటు అలంపూర్‌ క్షేత్రానికి వచ్చే యాత్రికులకు కష్టాలు తప్పడం లేదు.

 
మూడేళ్లుగా నిర్మాణంలోనే..
అలంపూర్‌–అలంపూర్‌ చౌరస్తా ప్రధాన రోడ్డు మార్గంలో రెండు బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. వాగుపై నిర్మించిన కల్వర్టులు రోడ్డు కంటే తక్కువ ఎత్తుకు చేరడంతో వాహనదారులకు ఇబ్బంది కలిగించేవి. దీనికి తోడు వర్షాకాలం వస్తే కల్వర్టుల వద్ద వర్షపు వరద నీరు రోడ్డుపైకి చేరి వాహనరాకపోకలను నియంత్రించే పరిస్థితి ఉండింది. దీంతో భైరాపురం స్టేజీ సమీపంలోని కల్వర్టును తొలగించి రూ. కోటి నిధులతో నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. అదేవిధంగా ఇమాంపురం గ్రామం వద్ద ఉన్న కల్వర్టును తొలగించి రూ.2.75 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం కొనసాగిస్తున్నారు. వీటిలో బైరాపురం వద్ద మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. ఇమాంపురం వద్ద రెండేళ్లుగా పనులు కొనసాగుతున్నాయి. 


డైవర్షన్‌ రోడ్లతో..
కల్వర్టుల స్థానంలో వంతెనల నిర్మాణం చేపడుతుండటంతో వాహనరాకపోకలకు పక్కనే తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేశారు. పనులు ఏళ్ల తరబడిగా సాగుతుండటంతో తాత్కలికంగా వేసిన రోడ్డు గుంతలమయంగా మారింది. వాహనాలు వచ్చి వెళ్లే క్రమంలో దుమ్మ అధికమైంది. అలం పూర్‌ పుణ్యక్షేత్రం కావడంతో ఈ మార్గం గుండా రోజుకు వందల మంది భక్తులు రాకపోకలు సాగిస్తారు. నియోజకవర్గ కేంద్రం కావడంతో వివిధ గ్రామాల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర పనులు చక్కబెట్టుకోవడానికి వస్తూ.. ఉంటారు. కానీ ఈ మార్గంలోని రెండు బ్రిడ్జిల వద్ద పనులు ఏళ్లతరబడిగా కొనసాగుతుండటం తో కష్టాలు పడుతున్నారు. అధికారులు స్పం దించి సకాలంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.


ఇబ్బందులు పడుతున్నాం
అలంపూర్‌ నుంచి ప్రతి నిత్యం వివిధ పనుల కో సం ఈ మార్గం ద్వారానే ప్రయాణం సాగిస్తున్నాం. కానీ మూడేళ్లుగా బ్రిడ్జి పనులు కొనసాగుతుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. డైవర్షన్‌ రోడ్డు అధ్వానంగా మారడంతో వాహనదారులు ప్రమాదాలకు గురువుతున్నారు. 
– బంగారు లక్ష్మణ్, అలంపూర్‌


నిర్లక్ష్యం వీడాలి 
అలంపూర్‌ ప్రఖ్యాతి గాంచిన పుణ్య క్షేత్రం. దేశంలోని వివిధ ప్రాం తాల నుంచి భక్తులు వస్తుంటారు. కానీ ఈ మార్గంలో మాత్రం బ్రిడ్జిల నిర్మాణం ఏళ్ల తరబడిగా కొనసాగుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ మార్గం గుండా ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి పనులు త్వరగా పూర్తిచేయాలి. 
– శ్యాంసుందర్‌రావు, వేముల  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement