‘బ్లాకుల’ ప్రైవేటీకరణ అసాధ్యం! | Privatization Of Singareni Coal Blocks Is Impossible Says Singareni Director Balaram | Sakshi
Sakshi News home page

‘బ్లాకుల’ ప్రైవేటీకరణ అసాధ్యం!

Published Mon, Mar 21 2022 2:03 AM | Last Updated on Mon, Mar 21 2022 2:03 AM

Privatization Of Singareni Coal Blocks Is Impossible Says Singareni Director Balaram - Sakshi

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అసాధ్యం. సింగరేణి సంస్థకు చెందిన గనులన్నీ ఆ సంస్థకే చెందాలని నిజాం పాలనలోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో సింగరేణి సంస్థ, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు త్రైపాక్షిక ఒప్పం దం కుదుర్చుకున్నాయి. సింగరేణిలో రాష్ట్ర ప్రభు త్వం 51, కేంద్రం 49% వాటాలు కలిగి ఉన్నాయి.

దీంతో ఏ విషయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వానిదే తుదినిర్ణయంగా ఉంటుంది’అని సింగరేణి పర్సనల్, అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్‌(పీఏడబ్ల్యూ) డైరెక్టర్‌ ఎన్‌.బలరాం స్పష్టం చేశారు. సింగరేణికి పేలుడు పదర్థాల సరఫరాపై ఉక్రెయిన్‌–రష్యా యుద్ధ ప్రభావం, గనుల్లో వరుస ప్రమాదాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, డిస్మిస్‌ కార్మికుల సమస్యల గురించి ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. అవి ఆయన మాటల్లోనే..  

టెండర్లు పిలిచినా ముందుకు రాలేదు 
2015 జనవరిలో అమల్లోకి వచ్చిన మినరల్స్, మైన్స్‌డెవలప్‌మెంట్‌ రెగ్యులరైజేషన్‌(ఎంఎండీఆర్‌) చట్టానికనుగుణంగా తెలంగాణ లోని కోయగూడెం ఓసీ, సత్తుపల్లి ఓసీ–3, శ్రావణపల్లి ఓసీ, కేకే–6 బ్లాకు లను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ కంపెనీలకు బ్లాకులు అప్పగిస్తే సమయం ఆదాతోపాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలుంటాయని కేంద్రం భావించింది. త్రైపాక్షిక ఒప్పందానికి కేంద్ర నిర్ణయం విరుద్ధంగా ఉండటం, దాన్ని కార్మికసంఘాలు వ్యతిరేకించడంతో బ్లాకుల ప్రైవేటీకరణ సాధ్యం కాని పని. బ్లాకుల నిర్వహణకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇప్పట్లో ప్రైవేటీకరణ లేనట్టే.  

ఎక్స్‌ప్లోజివ్స్‌ కోసం ప్రత్యామ్నాయ చర్యలు 
ఉక్రెయిన్‌– రష్యా యుద్ధం నేపథ్యంలో సింగరేణికి ఎక్స్‌ప్లోజివ్స్‌ సరఫరా(అమ్మోనియం నైట్రేడ్‌) పూర్తిగా నిలిచిపోలేదు. ప్రస్తుతం రాష్ట్రీయ కెమికల్‌ ఫెర్టిలైజర్స్‌ (పుణే–70%ఎక్స్‌ప్లోజివ్స్‌), స్టార్‌ క్యామ్‌ సంస్థ(30%) ద్వారా ఒక టన్ను ఎక్స్‌ప్లోజివ్స్‌కు రూ.65 వేలకు ఒప్పందం కుదుర్చుకుని సరఫరా చేసుకుంటోంది.

వచ్చే నెల రెండోవారం వర కు ఆయా సంస్థలతో ఒప్పందం ఉంది. యుద్ధం కొనసాగినా ఆ పరిస్థితిని అధిగమించేలా సింగరేణి ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించింది. రోజూ ఓపెన్‌ కాస్టుల్లో ఓవర్‌ బర్డెన్‌కు 560 టన్నులు, భూ గర్భ గనులకు 50 టన్నులు మొత్తం 610 టన్నుల ఎక్స్‌ప్లోజివ్స్‌ అవసరమవుతాయి.  

స్థానికతకు పెద్దపీట 
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం సింగరేణి నియామకా ల్లో స్థానికతకు పెద్దపీట వేస్తున్నాం. ఇకపై సంస్థలో కార్మిక విభాగంలో 95% ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తాం. ఎగ్జిక్యూటివ్‌ నియామకాల్లో గతంలో ఉన్న 60(స్థానిక), 40(స్థానికేతర) శాతాన్ని మార్పు చేశాం. 80% ఉద్యోగాలు స్థానికులకు, 20% స్థానికేతరులకు ఇవ్వనున్నాం. ఇటీవల సింగరేణి భూగర్భ గనుల్లో ప్రమాదాలు పెరగడం బాధాకరం. డిప్యూ టీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ పర్యవేక్షించి ఆదేశిస్తేనే కార్మికులు గనుల్లో పని చేస్తుంటారు.  గతం తో పోలిస్తే ప్రమాదాలు తగ్గాయి.

మరో అవకాశం 
సింగరేణిలో ఆరు వేలమంది డిస్మిస్‌ కార్మికులున్నా రు. అనారోగ్యం, గనుల్లో పని చేయడం ఇష్టం లేక, వ్యవసాయం, ఇతర ఉద్యోగాలపై ఆసక్తితో కార్మికులు సింగరేణి వంద మస్టర్ల నిబంధనను పాటించడం లేదు. దీంతో వారిని డిస్మిస్‌ చేయాల్సి వస్తుంది. వీరి కోసం బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల నిర్ణయం ప్రకారం మరో అవకాశం ఇవ్వాలని సింగరేణి భావిస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement