రేష్మ
భద్రాచలం అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రిలో సిజేరియన్ చేయించుకున్న ఓ మహిళ తీవ్ర రక్తస్రావంతో మృతి చెందడం వివాదాస్పదమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణానికి చెందిన రేష్మ(21)ను ఆదివారం మొదటి కాన్పు కోసం కుటుంబ సభ్యులు మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సాధారణ ప్రసవం చేసేందుకు వీలుకాక పోవడంతో అక్కడి వైద్యులు సిజేరియన్ చేసి డెలివరీ నిర్వహించారు.
రేష్మ సుమారు రెండు కేజీలు బరువు ఉన్న మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ సమయంలో, ఆ తర్వాత అధికంగా రక్తస్రావం కావడంతో రేష్మను మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో కుటుంబీకులు వెంటనే అక్కడికి తరలించినప్పటికీ రక్తస్రావం అదుపులోకి రాకపోవడంతో ఆమె మృతి చెందింది. భద్రాచలం ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే రేష్మ మృతి చెందిందన్న వాదనలు తొలుత వెల్లువెత్తాయి.
అయితే భద్రాచలం డాక్టర్లు మాత్రం ఆస్పత్రికి వచ్చేలోగానే రేష్మ మృతి చెందిందని, తమ నిర్లక్ష్యం లేదని చెబుతున్నారు. మణుగూరులో రేష్మకు ఆపరేషన్ చేస్తున్న సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? రక్తస్రావం కావడంతో పాటు రక్తం తక్కువగా ఉన్న విషయం ముందే తెలిసినప్పటికీ ఆపరేషన్ చేసేశారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సిఉంది. జిల్లావైద్యాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబసభ్యులు కోరుతున్నారు.
భద్రాచలం వచ్చేలోపే మృతి చెందింది
మణుగూరు ఆస్పత్రి నుంచి భద్రాచలంఆస్పత్రికి వచ్చేలోపే బాలింత ఆరోగ్య పరిస్థితి విషమించింది. స్పృహ కోల్పోయి, అప్పటికే మృతి చెందింది. మా దగ్గర వైద్యులు సకాలంలోనే స్పందించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు పంచనామా నిర్వహించాం.
–డాక్టర్ రామకృష్ణ, భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్
మా నిర్లక్ష్యం లేదు..
రేష్మకు సిజేరియన్ చేసి కాన్పు జరిపారు. చికిత్స అందించడంతో మా దగ్గర వైద్యుల నిర్లక్ష్యమేమీ లేదు. ఆపరేషన్ తర్వాత బ్లీడింగ్ ఎక్కువ కావడంతో భద్రాచలం ఆస్పత్రికి రిఫర్ చేశాం.
–డాక్టర్ విజయ్ కుమార్, మణుగూరు ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment