గాయాలను చూపిస్తున్న సోందుబీ, ఫకీర్
ఇల్లెందు: టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ వేరే వార్డులోని రెండు కుటుంబాల మధ్య గొడవలో కలగజేసుకోవడమేకాక తల్లీకొడుకులపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులు ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీ రెండో వార్డులోని సత్యనారాయణపురంలో తల్లీకొడుకులు ఎస్.కె.సోందుబీ, షేక్ ఫకీర్ సాహెబ్ నివసిస్తున్నారు.
వీరి ఇంటి పక్కన ఉండే మీరా సాహెబ్ ప్రహరీ నిర్మిస్తుండగా, శనివారం ఉదయం హద్దుల విషయమై సోందూబీ, ఫకీర్ సాహెబ్ ఆ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో రెండు కుటుంబాలమధ్య వాగ్యుద్ధం జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని గొడవలకు దిగొద్దని రెండు పక్షాలకు సూచించారు. కాసేపటికి ఒకటో వార్డు కౌన్సిలర్ రవి తన అనుచరులతో అక్కడకు వచ్చి సోందుబీ, ఫకీర్ సాహెబ్‌ను పిలిచి పంచాయితీ పెట్టాడు.
కాగా, కౌన్సిలర్ చెప్పినట్లుగా వినడం లేదంటూ తమపై దాడి చేశాడని బాధితులు వాపోయారు. ఏదైనా సమస్య ఉంటే తమ కౌన్సిలర్‌కు చెప్పుకుంటామంటున్నా వినకుండా దాడి చేశాడని తెలిపారు. కౌన్సిలర్ రవితో తమకు ప్రాణ హాని ఉందని అన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్‌నైన తనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమీ కాదని బెదిరించాడని చెప్పారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై చంద్రశేఖర్ సత్యనారాయణపురం వెళ్లి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment