రోడ్డుపై, అడవుల్లో ఖాళీ బీరు బాటిళ్లను చూస్తే ఇక అనుమానించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే మావోయిస్టులు కొత్త తరహాలో బీర్ బాటిల్ బాంబును అమర్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తమ వద్ద ఉందని చెప్పకనే చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా ఉన్న మావోయిస్టులు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం(కె), భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో తమ కదలికలు ఉన్నాయని చెప్పేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో మావోయిస్టుల దుశ్చర్యలను గట్టిగా తిప్పికొడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ఏటూరునాగారం: ప్రెషర్ బాంబ్‌లు, కెమెరా ఫ్లాష్ బాంబ్‌లు, బ్యాటరీలు ఇలా అనేక రకాల మందుపాతరలు అమర్చిన మావోయిస్టులు రూటు మార్చారు. కూంబింగ్‌లో పాల్గొనే భద్రతా దళాలు, పోలీసులను ఏమారుస్తూ పేలుడు జరిపి భారీ విధ్వంసం సృష్టించేలా బీరు బాటిల్ బాంబ్ వ్యూహాన్ని అమల్లో పెడుతున్నారు.
ప్రెషర్, బకెట్ బాంబులను భద్రతా దళాలు సులువుగా గుర్తిస్తుండటంతో తమ వ్యూహం మారుస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో పేలుడు తీవ్రత పెంచేందుకు మావోయిస్టులు పదునైన ఇనుప ముక్కలను పేలుడు పదార్థాల చుట్టూ ఉంచేవారు. అయితే మెటల్ డిటెక్టర్లు ఉపయోగించినప్పుడు, ఆ బాంబు జాడను భద్రతా దళాలు సులువుగా పసిగడుతున్నట్టు మావోయిస్టులు అనుమానిస్తున్నారు. దీంతో బీరు బాటిల్ బాంబు వ్యూహానికి పదును పెట్టినట్టు తెలుస్తోంది.
ఖాళీ బాటిళ్లలో ఐఈడీ
మావోయిస్టులు ఖాళీ బీరు బాటిళ్లలో ఐఈడీ తరహా పేలుడు పదార్థాలను కూర్చి విధ్వంసం సృష్టించే వ్యూహంఅమలుకు శ్రీకారం చుట్టారు. తాగి పడేసిన బీరు బాటిల్ అయితే భద్రతా దళాలు అనుమానించకుండా వదిలేస్తాయని, పైగా అందులో అమర్చిన బాంబు పేలినప్పు డు గాజు ముక్కల కారణంగా ప్రమాద తీవ్రత పెరుగుతుందనే అంచనాతో ఈ ప్లాన్ అమలు చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఈ తరహా బాంబులను ఒడిశాలో పేల్చి నట్టు సమాచారం. తాజాగా బీరు బాటిల్లో అమర్చిన బాంబును ములుగు జిల్లాలో పోలీసులు గుర్తించారు.
పోలీసులు బయటకు తీసిన బీర్‌బాటిల్ , పేలుడు పదార్థాలు
మందుపాతరలు, ప్రెషర్‌బాంబుల ఘటనలు
►ఈనెల 4న చర్ల మండలం కుర్నపల్లి మార్గంలో ఎర్రబోరు–బోదనెల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై అమర్చిన శక్తిమంతమైన 20 కిలోల మందుపాతరను చర్ల పోలీసులు నిర్వీర్యం చేశారు.
►గత నెల 28న చర్ల మండలంలోని కొండెవాయి సమీపంలోని ప్రధాన రహదారిపై శక్తిమంతమైన మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు.
►గత నెల 26న కొండెవాయి అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలను మట్టుబెట్టేందుకు అమర్చిన ప్రెషర్ బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు.
►గత నెల14న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పెగడపల్లి వద్ద అమర్చిన మందుపాతరను పేల్చడంతో ఏఎస్‌ఐ మహ్మద్ అస్లాం తీవ్రంగా గాయపడ్డాడు.
►2022 డిసెంబర్‌లో ఉంజుపల్లి సమీపంలో పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకొని పెట్టిన ప్రెషర్‌బాంబు పేలి ఆవు మృతిచెందింది.
►2021 జూలైలో చర్ల శివారు లెనిన్‌కాలనీ సమీపంలో చర్ల యువకుడు ప్రమాదవశాత్తు ప్రెషర్ బాంబును తొక్కడంతో అది పేలింది.
కొత్త కోణంలో బాంబు...
గతంలో ఏటూరునాగారం ఏజెన్సీ అప్పటి పీపుల్స్‌వార్ నక్సల్స్‌కు ప్రయోగశాలగా ఉండేది. ఇప్పుడు మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్, వాజేడు, వెంకటాపురం(కె) ప్రాంతాలను అనువైనవి గుర్తించి తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త తరహా దాడులకు వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం పామునూరు అటవీ ప్రాంతంలో మందుపాతర అమర్చినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.
వాటిని వెతుక్కుంటూ వెళ్లిన భద్రత బలగాలకు విద్యుత్ వైర్లు కనిపించాయి. వాటిని చూసుకుంటూ ముందుకెళ్లగా ఖాళీ బీరు బాటిల్ కనిపించింది. ఆ వైర్లు ఆ సీసాలోకి పోయినట్లు గుర్తించిన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌ను పిలిపించి నిర్వీర్యం చేశారు. ఐఈడీ నింపిన సీసాలో భద్రత బలగాలకు గుచ్చుకునేలా ఇనుప బోల్ట్‌లు, రాగి రేకు ముక్కలు, ప్లాస్టిక్ లెడ్, కార్బన్ ముక్కలు, గన్ పౌడర్ ఇతర పేలుడు పదార్థాలను అందులో కూర్చి పెట్టారు. అది పేలితే పెద్ద ప్రమాదం ఉండేదని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment