ఖాళీలు ఎక్కువ.. సేవలు తక్కువ | Yellandu Government Hospital Have No Facilities | Sakshi
Sakshi News home page

ఖాళీలు ఎక్కువ.. సేవలు తక్కువ

Published Fri, Jul 5 2019 12:35 PM | Last Updated on Fri, Jul 5 2019 12:39 PM

Yellandu Government Hospital Have No Facilities - Sakshi

ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాల

సాక్షి, ఇల్లెందు (భద్రాద్రి కొత్తగూడెం): స్థానిక ప్రభుత్వ వైద్యశాల సమస్యల నిలయంగా మారింది. నియోజకవర్గ కేంద్రంలో రోగులకు వైద్యం అందించాల్సిన ఈ దవఖానా సమస్యలతో కునారిల్లుతోంది. ఒకవైపు పరిష్కారానికి నోచుకోని సమస్యలు, మరొక వైపు ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించరనే విమర్శలు ఈ వైద్యశాలను అతలాకుతలం చేస్తున్నాయి. నిత్యం 300 మందికి పైగా రోగులకు వైద్యశాలకు వస్తారు. కానీ ఇక్కడ రోగులకు కనీస సదుపాయాలు లేవు. కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి.

డిప్యూటీ సివిల్‌ సర్జన్, మత్తు, పిల్లల, ప్రశూతీ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో వైద్యం అందటం కష్టంగా మారింది. ఇక వచ్చే వర్షాకాలంలో రోగం వస్తే ఖమ్మానికి పరుగులు తీయాల్సి వస్తోంది. గడిచిన రెండు ఏళ్లుగా ఇక్కడకు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగింది. ఐదుగురు వైద్యులు ఉండాల్సిన ఈ వైద్యశాలలో నలుగురే ఉన్నారు. ఇక డిప్యూటీ సివిల్‌ సర్జన్, మత్తు, చిన్న పిల్లల వైద్యులు, గైనకాలజిస్ట్‌ పోస్టు భర్తీకి నోచుకోవటం లేదు.

30 పడకల వైద్యశాలలో సమస్యలు..
ఇల్లెందు 30 పడకల వైద్యశాలలో ఏడాది కాలంగా హాస్పిటల్‌ అభివృద్ధి కమిటీ సమావేశాలు లేవు. అయితే వైద్యశాలలో గెనకాలజీ, సర్జన్, స్వీపర్‌ ఒక పోస్టు , స్కావెంజర్‌ – 1 పోస్టు, సెక్యూర్టీగార్డు – 1 పోస్టు, ఎంఎన్‌ఓ రెండు పోస్టులు, వంట కుక్‌– 1 పోస్టు, వాటర్‌ మెన్‌–1 పోస్టు,దోబీ–3 పోస్టులు, తోటీ –3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంబులెన్సు అందుభాటులో లేదు. అత్యవసరమైన కేసులు ఖమ్మానికి తరలించాలంటే సొంత వాహనంలో తరలించాల్సి వస్తోంది.

చిన్న పిల్లల వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్లు అందుబాటులో లేక పోవటం వల్ల రోగులు అవస్థలు పడుతున్నారంటూ రెండు రోజుల క్రితం సీపీఎం ఆధ్వర్యంలో హాస్పిటల్‌ ఎదుట ఆందోళన చేశారు. సమస్యల వలయంలో వైద్యశాలను గట్టెక్కించాల్సిన అవసరం ఉన్నతాధికారుల మీదే ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

వైద్యశాల ఎదుట ఆందోళన చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

2
2/2

ఖాళీలు తెలిపే బోర్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement