yellandu area hospital
-
ఖాళీలు ఎక్కువ.. సేవలు తక్కువ
సాక్షి, ఇల్లెందు (భద్రాద్రి కొత్తగూడెం): స్థానిక ప్రభుత్వ వైద్యశాల సమస్యల నిలయంగా మారింది. నియోజకవర్గ కేంద్రంలో రోగులకు వైద్యం అందించాల్సిన ఈ దవఖానా సమస్యలతో కునారిల్లుతోంది. ఒకవైపు పరిష్కారానికి నోచుకోని సమస్యలు, మరొక వైపు ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించరనే విమర్శలు ఈ వైద్యశాలను అతలాకుతలం చేస్తున్నాయి. నిత్యం 300 మందికి పైగా రోగులకు వైద్యశాలకు వస్తారు. కానీ ఇక్కడ రోగులకు కనీస సదుపాయాలు లేవు. కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ సివిల్ సర్జన్, మత్తు, పిల్లల, ప్రశూతీ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో వైద్యం అందటం కష్టంగా మారింది. ఇక వచ్చే వర్షాకాలంలో రోగం వస్తే ఖమ్మానికి పరుగులు తీయాల్సి వస్తోంది. గడిచిన రెండు ఏళ్లుగా ఇక్కడకు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగింది. ఐదుగురు వైద్యులు ఉండాల్సిన ఈ వైద్యశాలలో నలుగురే ఉన్నారు. ఇక డిప్యూటీ సివిల్ సర్జన్, మత్తు, చిన్న పిల్లల వైద్యులు, గైనకాలజిస్ట్ పోస్టు భర్తీకి నోచుకోవటం లేదు. 30 పడకల వైద్యశాలలో సమస్యలు.. ఇల్లెందు 30 పడకల వైద్యశాలలో ఏడాది కాలంగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశాలు లేవు. అయితే వైద్యశాలలో గెనకాలజీ, సర్జన్, స్వీపర్ ఒక పోస్టు , స్కావెంజర్ – 1 పోస్టు, సెక్యూర్టీగార్డు – 1 పోస్టు, ఎంఎన్ఓ రెండు పోస్టులు, వంట కుక్– 1 పోస్టు, వాటర్ మెన్–1 పోస్టు,దోబీ–3 పోస్టులు, తోటీ –3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంబులెన్సు అందుభాటులో లేదు. అత్యవసరమైన కేసులు ఖమ్మానికి తరలించాలంటే సొంత వాహనంలో తరలించాల్సి వస్తోంది. చిన్న పిల్లల వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్లు అందుబాటులో లేక పోవటం వల్ల రోగులు అవస్థలు పడుతున్నారంటూ రెండు రోజుల క్రితం సీపీఎం ఆధ్వర్యంలో హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. సమస్యల వలయంలో వైద్యశాలను గట్టెక్కించాల్సిన అవసరం ఉన్నతాధికారుల మీదే ఉంది. -
సింగరేణి ఆస్పత్రికి సుస్తీ
వేధిస్తున్న ప్రత్యేక వైద్య నిపుణుల కొరత ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న గైనకాలజిస్టు పోస్టు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్న మహిళలు ఇల్లెందుఅర్బన్: సింగరేణి ఇల్లెందు ఏరియా వైద్యశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో కార్మిక కుటుంబాలు ఇబ్బం దులు పడుతున్నాయి. ఇల్లెందు ఏరియాలో సుమారు 1750మంది కార్మిక కుటుంబాలు జీవిస్తున్నా యి. కార్మిక కుటుంబాలకు అందించాల్సిన వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతుందని కార్మిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యశాలలో ఏడుగురు వైద్యులు, సుమారు 40 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్యశాలలో గుండె, చర్మం, కంటి, గైనకాలజిస్టు తదితర ప్రత్యేక వైద్య నిపుణుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన గైనకాలజిస్టు పోస్టు ఐదేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో మహిళలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జలుబు, జ్వరం, దగ్గు, వాంతులు, విరోచనాలు వంటి సాధారణ వ్యాధులను నయం చేసే వైద్యులు మాత్రమే ఉన్నారు. గర్భిణులు, చిన్నపిల్లలు, ఎముకల వైద్యనిపుణులు లేకపోవడంతో కొత్తగూడెం ప్రధాన వైద్యశాలకు వెళ్లాల్సి వస్తోందని కార్మిక కుటుంబాలు చెబుతున్నాయి. ఎక్స్‌రే తీసే సిబ్బంది ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్కరు సెలవులో ఉంటే కొత్తగూడేనికి పరుగులు తీయాల్సిందే. కార్మికులకు పీఎంఈ (పిరియడికల్ మెడికల్ ఎగ్జామినేషన్)కే వైద్యశాల పరిమితమవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గని మూసివేస్తున్నారనే సాకుతో..? 21 ఇన్‌క్లైన్ గనిని 2017లో యాజమాన్యం మూసి వేస్తుందనే సాకుతో ఏరియా వైద్యశాల అభివృద్ధి గురించి అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గని మూసివేతతో పాటుగా ఏరియా వైద్యశాల కూడా కనుమరుగవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రతినెల కొత్తగూడెం నుంచి ప్రత్యేక వైద్యనిపుణులను రప్పించి కార్మికులకు వైద్య సేవలందిస్తున్న యాజమాన్యం ఇల్లెందులోనే ప్రత్యేక వైద్యనిపుణుల ఏర్పాటు విషయాన్ని ఎందుకు విస్మరిస్తుందని కార్మిక నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏరియా వైద్యశాలను ఏ–1 డిస్పెన్సరీగా కుదించేందుకు యాజమాన్యం గతంలోనే చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.. జీఎం విజయ్‌బాబు అడ్డుకోవడంతో ఆ చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్లీ ఆ అంశం తెరపైకి వస్తుందనే ప్రచారం జరుగుతోంది.