సింగరేణి ఆస్పత్రికి సుస్తీ | problems in yellandu area hospital | Sakshi
Sakshi News home page

సింగరేణి ఆస్పత్రికి సుస్తీ

Published Mon, Dec 5 2016 11:58 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

problems in yellandu area hospital

వేధిస్తున్న ప్రత్యేక వైద్య నిపుణుల కొరత
ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న గైనకాలజిస్టు పోస్టు
ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్న మహిళలు
 
ఇల్లెందుఅర్బన్: సింగరేణి ఇల్లెందు ఏరియా వైద్యశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో కార్మిక కుటుంబాలు ఇబ్బం దులు పడుతున్నాయి. ఇల్లెందు  ఏరియాలో సుమారు 1750మంది కార్మిక కుటుంబాలు జీవిస్తున్నా యి. కార్మిక కుటుంబాలకు అందించాల్సిన వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతుందని కార్మిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యశాలలో ఏడుగురు వైద్యులు, సుమారు 40 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్యశాలలో గుండె, చర్మం, కంటి, గైనకాలజిస్టు తదితర ప్రత్యేక వైద్య నిపుణుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన గైనకాలజిస్టు పోస్టు ఐదేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో మహిళలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జలుబు, జ్వరం, దగ్గు, వాంతులు, విరోచనాలు వంటి సాధారణ వ్యాధులను నయం చేసే వైద్యులు మాత్రమే ఉన్నారు. గర్భిణులు, చిన్నపిల్లలు, ఎముకల వైద్యనిపుణులు లేకపోవడంతో కొత్తగూడెం ప్రధాన వైద్యశాలకు వెళ్లాల్సి వస్తోందని కార్మిక కుటుంబాలు చెబుతున్నాయి. ఎక్స్‌రే తీసే సిబ్బంది ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్కరు సెలవులో ఉంటే కొత్తగూడేనికి పరుగులు తీయాల్సిందే. కార్మికులకు  పీఎంఈ (పిరియడికల్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్)కే వైద్యశాల పరిమితమవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
 
గని మూసివేస్తున్నారనే సాకుతో..?
21 ఇన్క్లైన్ గనిని 2017లో యాజమాన్యం మూసి వేస్తుందనే సాకుతో ఏరియా వైద్యశాల అభివృద్ధి గురించి అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గని మూసివేతతో పాటుగా ఏరియా వైద్యశాల కూడా కనుమరుగవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రతినెల కొత్తగూడెం నుంచి ప్రత్యేక వైద్యనిపుణులను రప్పించి కార్మికులకు వైద్య సేవలందిస్తున్న యాజమాన్యం ఇల్లెందులోనే ప్రత్యేక వైద్యనిపుణుల ఏర్పాటు విషయాన్ని ఎందుకు విస్మరిస్తుందని కార్మిక నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏరియా వైద్యశాలను ఏ–1 డిస్పెన్సరీగా కుదించేందుకు యాజమాన్యం గతంలోనే చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.. జీఎం విజయ్‌బాబు అడ్డుకోవడంతో ఆ చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్లీ ఆ అంశం తెరపైకి వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement