పొలంలోకి వెళ్లేందుకు వీలు లేకుండా కొనసాగుతున్న నిర్మాణ పనులు
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు మద్దూరి శ్రీనివాసరావు. చర్ల మండలం కుదునూరు గ్రామపంచాయతీ పరిధిలో 36 గుంటల భూమే ఈయనకు జీవనాధారం. ఈ స్థలం సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతోంది. దీంతో పరిహారంగా రూ.7.20 లక్షలు అందిస్తామని ప్రకటించారు. కానీ నేటికీ ఒక్క పైసా అందలేదు. సదరు భూమి శ్రీనివాసరావు తల్లి పేరు మీద ఉండటం, ఆమె గతేడాది చనిపోవడంతో.. పట్టాపై ఉన్న భూయజమాని లేరనే కారణంతో పరిహారం నిలిపేశారు.
ఈయన చీకటి కిశోర్. సీతమ్మసాగర్ కింద ఇతని కుటుంబానికి సంబంధించిన భూమి ముంపునకు గురవుతోంది. దీంతో ఏడాది క్రితమే రూ.3.50 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. కానీ ఆ స్థలం పట్టా కిశోర్ తండ్రి శాంతయ్య పేరిట ఉంది. ఆయన ఇటీవల మరణించారు. శాంతయ్య లేడనే కారణంతో ఆ కుటుంబానికి నేటికీ పరిహారం అందించలేదు.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వడంతో పాటు 320 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సీతమ్మ సాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఇందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం, అశ్వాపురం మండలాల మధ్య గోదావరి నదిపై బ్యారేజీ నిర్మిస్తోంది.
దీనివల్ల ఇటు దుమ్ముగూడెం, చర్ల, అటు మణుగూరు, అశ్వాపురం మండలాల్లో సుమారు 3,267 ఎకరాలు మంపునకు గురయ్యే అవకాశం ఉందని గుర్తించారు. నిర్వాసితులకు పరిహారం అందించేందుకు రూ.160 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే కోర్టు వివాదాలు, పట్టా పుస్తకం ఎవరి పేరుతో ఉందో ఆ భూ యజమానులు మరణించడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల సుమారు 100 మంది రైతులకు నేటికీ పరిహారం అందలేదు.
సమస్యలు పరిష్కరించి ముంపు బాధితులకు పరిహారం అందజేయాల్సిన రెవెన్యూ అధికారులు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ముప్పు తిప్పలు పెడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు పనులు మొదలు కావడంతో భూమి సాగు చేసేందుకు వీలుకాక, మరోవైపు పరిహారం అందక నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆందోళనలకు దిగుతున్నారు.
ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా..
ఇటీవల సీతమ్మసాగర్ బ్యారేజీ, ఫ్లడ్‌బ్యాంక్, వరద కాలువ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. పరిహారం చెల్లించిన భూముల్లో జోరుగా కొనసాగుతున్నాయి. భారీ యంత్రాలు తిరిగేందుకు వీలుగా పొలాల్లో తాత్కాలిక రోడ్లు వేస్తున్నారు. ఎక్కడిక్కడ కందకాలు తీశారు. దీంతో చాలా పొలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పరిహారం అందని రైతుల భూములు కూడా ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి.
ఇప్పటికే ఖరీఫ్ సీజన్‌ను రైతులు నష్టపోగా ఇప్పుడు రబీ సీజన్‌లో అదే పరిస్థితి నెలకొంది. దీంతో ముంపు రైతులు తమకు వెంటనే పరిహారం చెల్లించాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే బుధవారం చర్లలో బ్యారేజీ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఆందోళనకు దిగారు. తమ తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు, అలాగే సంబంధిత వారసత్వ ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా నేటికి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయలేదని ముంపు బాధితులు వాపోతున్నారు.
పరిహారం అందకపోయినా ఇన్నాళ్లూ భూములు సాగు చేస్తూ జీవించామని, ఇప్పుడు పనులు మొదలు కావడంతో సాగుకు అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఉన్న ఒక్క జీవనాధారం కోల్పోవడంతో కడుపు నింపుకునేందుకు కూలీ పనులకు వెళుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిక్కుతోచనిస్థితిలో కొందరు రైతులు పట్టణాలకు వలస వెళ్తుంటే, ఆసరా కోల్పోయిన వృద్ధులు ఆదుకునే హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
రెండు వారాల్లో నష్ట పరిహారం
పెండింగ్‌లో ఉన్న పరిహారం ఫైళ్లు పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ముంపు బాధితులకు రెండు వారాల్లో పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– భరణిబాబు, తహసీల్దార్, చర్ల
Comments
Please login to add a commentAdd a comment