
డీసీపీ మురళీధర్‌కు భోజనం వడ్డిస్తున్న పూజ
‘నేను ఉద్యోగం సాధించడానికి పడిన కష్టం సాధారణమైంది కాదు. తొలుత ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసి వచ్చిన జీతం డబ్బులను పొదుపు చేసుకుని.. వాటితో హైదరాబాద్‌లో రూమ్ తీసుకుని గ్రూప్–1 ఉద్యోగం సాధించే వరకు నిర్విరామంగా శ్రమించా. గ్రామీణ వాతావరణంలో పెరిగినా.. అక్కడే ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో చదువుకున్నా.. లక్ష్య సాధన కోసం అమ్మానాన్నలు నేర్పిన క్రమశిక్షణ, అమ్మ ముందుచూపు, నాన్న శ్రమ నన్ను ఇంతటివాడిని చేసింది. ఒక చిన్న సంఘటనే పోలీస్ అధికారి అయ్యేలా ప్రేరేపించింది. ప్రతి అంశంలో ఆచితూచి అడుగు వేయడం.. కష్టపడి సాధించుకున్న ఉద్యోగం ద్వారా పది మందికి న్యాయం చేయాలనే తపన ఈరోజుది కాదు’ అంటున్న ఖమ్మం అడిషనల్ డీసీపీ(లా అండ్ ఆర్డర్) మురళీధర్, ఆయన సతీమణి, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) పూజలతో ఈ వారం పర్సనల్ టైమ్. వారి మాటల్లోనే..
సాక్షి, ఖమ్మం: మాది నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న బొర్గం గ్రామం. సాధారణ మధ్యతరగతి కుటుంబమే అయినా.. అమ్మ దాసరి లక్ష్మీబాయి ఉదాత్త ఆశయం, నాన్న దాసరి ఆనంద్ శ్రమ మమ్మల్ని ఉన్నతులను చేసింది. పిల్లలను ఒక లక్ష్యం వైపు నడిపించాలని వారికి సమాజం పట్ల బాధ్యత కలిగేలా తీర్చిదిద్దాలనే అమ్మనాన్నల ఆశయం నన్ను ముందుకు నడిపించింది. 2006లో ఎక్సైజ్ ఎస్సై ఉద్యోగం నాకు లభించేంత వరకు ఎన్ని పోటీ పరీక్షలు రాసినా.. ఎన్ని కోచింగ్‌లు తీసుకున్నా నా సొంత డబ్బులతోనే చదువుకున్నాను. ఒకసారి నిజామాబాద్ నుంచి ఉద్యోగ అన్వేషణ కోసం హైదరాబాద్ చేరుకున్నా.. ఉద్యోగిగానే ఇంటికి చేరుకోవాలని పట్టుదల నాలో పెరిగింది. అనుకున్నట్లుగానే పోలీస్ అఫీసర్ అయ్యా.
అయితే తొలుత ఎక్సైజ్ శాఖలో లభించిన ఉద్యోగంతో హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఏడాదిపాటు విధులు నిర్వహించా.. ఎందుకో ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉన్న పోలీస్ ఉద్యోగం అంటే వల్లమాలిన అభిమానం, ఇష్టం. ఎప్పటికైనా పోలీస్ కావాలనే ఆలోచన, నా లక్ష్యం వెనుక చిన్న సంఘటన సైతం ఇమిడి ఉంది. 2005లో నా అత్యంత సన్నిహితుడైన మిత్రుడిని నిజామాబాద్ జిల్లాలోని ఒక పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. కారణం ఏమిటో తెలుసుకోవడానికి అతను చేసిన తప్పేమిటో ఆరా తీయడానికి మాకు శక్తికి మించిన భారమైంది. స్టేషన్‌లో అడుగు పెట్టి విషయం కనుక్కోవాలంటేనే విద్యార్థిగా భయపడాల్సిన పరిస్థితి అప్పటిది. ఇక ఆరోజు స్నేహితులు అందరి మధ్యలో నేనొక నిర్ణయానికి వచ్చా.. అయితే పోలీస్ అధికారినే కావాలి.. సామాన్యుడు సైతం పోలీస్ అధికారి కావాలన్న నా లక్ష్యానికి ఆ సంఘటన ప్రేరణ. అందుకే ఏ ప్రాంతంలో ఉద్యోగం చేసినా ప్రజల సమస్యలను వినడానికి.. వారి బాధల్లో పాలుపంచుకోవడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం వృత్తిలో భాగమైంది.
అధికారులుగా బాధితులు చెప్పే సమస్యలు ఒక్కోసారి చిన్న అంశాలుగా అనిపించినా వారికి మాత్రం పోలీస్ శాఖ ద్వారా మేము అందించే సహాయం.. సలహా జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తుండటం తృప్తిని ఇస్తోంది. నేను డీఎస్పీగా ఒక ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు పెన్సిల్‌తో గీసిన నా ఫొటో వారి ఇంట్లో ప్రత్యక్షమైన తీరును ఓ జర్నలిస్టు మిత్రుడు వాట్సాప్ ద్వారా పంపిస్తే నా ఆనందానికి అంతే లేదు. చిన్నప్పటి నుంచి ఈ రోజు పనిని రేపటికి వాయిదా వేసే అలవాటు లేదు. ఈ విషయంలోనూ అమ్మ చొరవ.. నాన్న పర్యవేక్షణే కారణం. నాన్న ఆనంద్ నిజామాబాద్‌లో బీడీ ఖార్ఖానా నడుపుతున్నారు. ఆ వ్యాపారం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనేది. ఆ కష్టం మా దరి చేరకుండా.. ఆర్థిక ఇబ్బందులు మాకు రాకుండా అమ్మ, నాన్న చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే వారు. అమ్మ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మా ముగ్గురు పిల్లలను ఇంగ్లిష్ మీడియంలోనే చదివించాలని పట్టుపట్టి కోరిక నెరవేర్చుకుంది.
మా ఊరి నుంచి నిజామాబాద్‌కు రిక్షాలో వెళ్లేవాళ్లం. ఇంగ్లిష్ మీడియం చదువుపట్ల అమ్మకున్న అవగాహన, భవిష్యత్‌లో ఇంగ్లిష్‌కు ఉండే ప్రాధాన్యాన్ని అమ్మ అప్పుడే పసిగట్టడం నా అదృష్టం. నాన్న సైతం మమ్మల్ని ప్రోత్సహించడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇక చిన్న చిన్న విషయాలను మనం పరిగణలోకి తీసుకోకపోవడం, వాటి ని ఆచరించకపోవడంతో భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే పోలీస్ అధికారిగా కాకున్నా ప్రజలకు సన్నిహితుడిగా నేనెప్పుడూ హెల్మెట్ వాడమని, సీటు బెల్ట్ పెట్టుకోమని వ్యక్తిగతంగా అభ్యర్థిస్తుంటా. నేను మార్కాపురం డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో అందరికీ హెల్మెట్లు ఉండేలా ప్రచారం చేశాం. వాటిని కట్టుదిట్టంగా అమలు చేశాం.
నా పరిధిలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ హెల్మెట్ బండి వెనుకాల పెట్టుకోని.. తలకు పెట్టుకోకపోవడంతో రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. అది ఇప్పటికీ నన్ను కలిచివేస్తుంది. అతని తలకు తప్ప ఎక్కడా చిన్న గాయం లేదు. హెల్మెట్ మోటారుసైకిల్‌కు కాకుండా.. ఆయన తలకు ఉంటే ఆ రోజు అంత దారుణం జరిగి ఉండేది కాదు. వారి కుటుంబంలో విషాదం నింపి ఉండేది కాదని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. రోడ్డు ప్రమాదంలో నా మేనల్లుడు చనిపోయినప్పుడు సైతం నేను తట్టుకోలేకపోయా. నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను కాపాడుతాయి తప్ప కుటుంబాలను విషాదంలో ముంచవు అన్నది గమనించమని నేను ఏ ప్రాంతంలో.. ఏ హోదాలో ఉన్నా ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నం చేస్తున్నా.
మా విజయాల వెనుక అమ్మనాన్నల శ్రమ దాగి ఉంది.. అడిషనల్ డీసీపీ పూజ
మా ఊరు శ్రీకాకుళం జిల్లా పోలకి మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న చిన్న గ్రామం. నాన్న రంగారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అమ్మ జయలక్ష్మి, మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. మమ్మల్ని క్రమశిక్షణాయుతంగా పెంచడమే కాదు. సమాజం పట్ల అవగాహనతోపాటు బాధ్యతాయుతంగా ఉండటం.. నాన్న అమ్మ చిన్నప్పటినుంచే నేర్పారు. మాపై చదువుల పరంగా అమ్మనాన్నల ఒత్తిడి ఏ రోజు ఉండేది కాదు. మేము ఏది చదువుతామంటే అది చదివించడమే కాక.. మీరు నిర్ణయం తీసుకునే శక్తి మీకుందంటూ ఏ ఉద్యోగంలో రాణిస్తారో.. ఏ చదువుపై ఆసక్తి ఉందో వాటినే చదువుకోండంటూ నాన్న ఎప్పుడూ ప్రోత్సహించేవారు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో.. ప్రభుత్వ కళాశాలలో చదివా. గ్రామీణ వాతావరణంలో పెరగడం వల్ల ఆడంబరాలకు దూరంగా ఉండటం.. ఆత్మీయతకు, ఆప్యాయతలకు దగ్గరగా ఉండటం అలవాటై పోయింది.
మా గ్రామంలో తొలి గ్రూప్–1 అధికారినే కాదు.. డీఎస్పీగా ఎన్నికైన, మహిళను సైతం నేనే. ఈ ఉద్యోగంలో చేరాలా..?వద్దా అన్న అంశంపై తొలుత కొంత తర్జన భర్జన పడినా నాన్న ఇచ్చిన భరోసా, నిర్ణయాధికారాన్ని నాకే వదిలేసే స్వేచ్ఛ ఇవ్వడంతో గ్రూప్–1 సాధించి డీఎస్పీగా ఎంపికై విధుల్లో చేరా. నా తొలి పోస్టింగ్ గుంటూరు జిల్లా. పోలీస్‌శాఖ సవాళ్లు ఎన్ని ఉంటాయో.. సమస్యలను చాకచక్యంగా పరిష్కరిస్తే ప్రశంసలు అదే రీతిలో ఉంటాయన్నది నా స్వయానుభవం. పోలీస్ అధికారిగా ప్రజలు తమ నుంచి న్యాయం జరుగుతుందని, విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారని, ప్రతి అంశంపై అవగాహన ఉంటుందన్న అంచనాతో మా దగ్గరికి వస్తుంటారు. కల్మషం లేకుండా వారి కడుపులో బాధను చెప్పుకునే అవకాశం కల్పిస్తే వారికి సగం స్వాంతన కల్పించినట్లు అవుతుందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ రకంగా మహిళా పోలీస్ అధికారిణిగా అనేక సమస్యలు ఛేదించిన సంఘటనలు అనేకం.
బాధితుల పక్షాన నిలిచామన్న సంతృప్తి నన్ను మరింత అంకితభావంతో పనిచేసేందుకు ప్రోత్సహిస్తుంది. తొలుత నేను ప్రభుత్వ టీచర్‌గా.. ఆ తర్వాత విశాఖపట్నంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా విధులు నిర్వహించా. పోలీస్ అధికారిగా మాత్రం ప్రజలకు సేవ చేసే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంటుంది. నేను మురళీధర్ ఇద్దరం పోలీస్ అధికారులమే కావడమే వృత్తిపరమైన అంశాలను సందర్భానుసారంగా చర్చించుకుంటుంటాం. మా ఇద్దరి లక్ష్యం దాదాపు ఒక్కటిగానే ఉంటుంది. మా చెంతకు వచ్చే ప్రజలకు న్యాయం చేయడం, వారు చెప్పింది విని భరోసా కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తుంటాం. అడిషనల్ డీసీపీ మురళీధర్ మాట్లాడుతూ మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం.
మేమిద్దరం వంటలు బాగా చేస్తాం. నేను హైదరాబాద్‌లో రూమ్‌లో ఉన్నందున స్వయంపాకం అలవాటైంది. అలాగే పూజ కూడా వంటలు బాగా చేస్తుంది. మాకు సంవత్సరం వయసు కలిగిన ఒక బాబు ఉన్నాడు. పూజ మాట్లాడుతూ నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. నాన్నతో కలిసి సినిమాకు వెళ్లడం అంటే ఎంతో ఆనందం. ఇప్పటికీ నాన్నంటే గౌరవంతో కూడిన భయం ఉంటుంది. అక్కాచెల్లెళ్లం అందరం ఒక్కచోట చేరితే బోలెడు విషయాలు చర్చించుకుంటాం. పోలీస్ అధికారిగా నేను ఇంతగా రాణించడానికి నాన్న చిన్నప్పుడు కల్పించిన ఆత్మవిశ్వాసమే కారణమని అనిపిస్తుంటుంది. అయితే నేను ఏనాడు పోలీస్ అధికారిని అవుతానని ఊహించలేదు. గ్రూప్–1కు ఎంపికయ్యేంత వరకు ఈ ఉద్యోగం లభిస్తుందనుకోలేదు.