![Maoist Party Telangana Committee Alleges That Police Are Conducting Spy Operations On Maoists - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/29/SPYWARE.jpg.webp?itok=ia5hZZD4)
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులపై పోలీసులు గూఢచర్య ఆపరేషన్లు చేస్తున్నారని.. ఫోన్లలో స్పైవేర్ చొప్పించి లొకేషన్, ఫొటోలు సేకరిస్తున్నారని మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ పత్రికలో ఆరోపించింది. ఆ వివరాల ఆధారంగానే భారీగా ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారని పేర్కొంది. అంతేగాకుండా ఇన్‌ఫార్మర్లు, కొరియర్లను లోబర్చుకుని.. వారి ద్వారా మావోయిస్టులపై విష ప్రయోగాలు చేస్తున్నారని ఆరోపించింది. మావోయిస్టు పార్టీ ప్రతి ఆరు నెలలకోసారి అధికార పత్రికను విడుదల చేస్తుంది. అందులో భాగంగా తాజా పత్రికలో పలు సంచలన ఆరోపణలు చేసింది.
హ్యాకర్లతో స్పైవేర్..
పోలీసులు హ్యాకర్ల సాయంతో తమ ఫోన్లలో రహస్యంగా నిఘా యాప్స్ (స్పైవేర్)ను ఇన్‌స్టాల్ చేస్తున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. లొకేషన్, ఫోటోలు, వీడియోలను సంగ్రహించి.. కూంబింగ్ బృందాలకు పంపి ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆరోపించింది. పార్టీ ఇన్‌ఫార్మర్లు, కొరియర్ల ఫోన్లలోనూ స్పైవేర్‌తో నిఘా పెట్టినట్టు తెలిపింది.
కొరియర్లను భయపెట్టి..
మావోయిస్టు పార్టీకి కొరియర్లుగా పనిచేస్తున్న వారిని పోలీసులు రహస్యంగా అరెస్ట్ చేసి బెదిరిస్తున్నారని.. వారు ప్రాణభయంతో కోవర్టులుగా మారిపోతున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. కొరియర్లు మావోయిస్టుల కోసం తెచ్చే పళ్లు, డ్రైప్రూట్స్, మందులు, ఇతర ఆహార పదార్థాల్లో పోలీసులు విషం కలుపుతున్నారని ఆరోపించింది.
దీనివల్ల మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని, కొందరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌లో వాజేడు– వెంకటాపురం దళంపై ఇలాంటి విష ప్రయోగమే జరిగిందని, దళంలోని కీలక నేతలు తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారని వెల్లడించింది.
పక్కా ప్రణాళికలతో దాడులు
మావోయిస్టులను నిర్మూలించే ఉద్దేశంతో కేంద్ర హోంశాఖ పలు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి సమాధాన్–2022ను చేపట్టిందని మావోయిస్టు పార్టీ పత్రికలో తెలిపింది. ఇందులో భాగంగా నిర్దిష్టమైన ప్రణాళికతో పదిరకాల ఎత్తుగడలకు శ్రీకారం చుట్టిందని వెల్లడించింది. ఆ వ్యూహాలను మొదట తెలంగాణ నుంచే అమల్లోకి తెచ్చారని. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్ 4న ములుగులో ఛత్తీస్‌గడ్, తెలంగాణ డీజీపీలతోపాటు కేంద్ర హోంశాఖ సలహాదారు విజయ్‌కుమార్, సీఆర్‌పీఎఫ్ డీజీ, ఆ జోన్ ఐజీల, ఇతర కీలక అధికారులు సమావేశమయ్యారని పేర్కొంది.
ప్రధానంగా గెరిల్లా బేస్‌గా ఉన్న దండ కారణ్యాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో.. దానికి ఆనుకుని ఉన్న మావోయిస్టు మద్దతు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. అందులో భాగంగానే తెలంగాణ–ఛత్తీస్‌గడ్ సరిహద్దు గ్రామమైన భట్టిగూడెం వద్ద 5వేలమంది కోబ్రా, డీఆర్‌జీ, గ్రేహౌండ్స్ బలగాలతో దాడికి పాల్పడ్డారని.. కానీ తెలంగాణ కమిటీ తప్పించుకోగలిగిందని వెల్లడించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నాపురం అడవుల్లో కూంబింగ్ చేస్తున్న ఓ గ్రేహౌండ్స్ టీమ్‌ను చూసిన మరో గ్రేహౌండ్స్ గ్రూప్.. మావోయిస్టులు అనుకుని కాల్పులు జరిపిందని గుర్తుచేసింది. ఆ ఘటనలో ఓ ఎస్సై మృతిచెందాడని, మరో హెడ్ కానిస్టేబుల్ దాడి భయంతో గుండెపోటుతో చనిపోయాడని పేర్కొంది.
మావోయిస్టుల కోసమే ఆ ఓఎస్‌డీలు!
గతంలో మావోయిస్టులపై దాడుల్లో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్ అధికారులను కీలక విభాగాల్లో ఓఎస్‌డీలుగా నియమిస్తున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ కార్యాలయాల ఏర్పాటు, అధికారుల నియామకాలను వేగవంతం చేశారని.. అందులో సాంకేతిక నైపుణ్యం ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని తమ పత్రికలో వెల్లడించింది. మావోయిస్టు పార్టీని పూర్తిగా నియంత్రించాలనే లక్ష్యంతోనే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలంటూ పోలీస్ శాఖలో వేలాది మందిని నియమిస్తున్నట్టు ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment