పూజలకు హాజరైన డీహెచ్ శ్రీనివాసరావు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సుజాత నగర్/సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం పాత అంజనాపురం పంచాయతీ పరిధిలోని చిమ్నతండాలో నిర్వహించిన ప్రత్యంగిర పూజా కార్యక్రమంలో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు జి.శ్రీనివాసరావు పాల్గొనడం వివాదాస్పదమైంది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. సుజాతనగర్ ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి.. లంబాడీల కులదైవం ప్రత్యంగిర అమ్మవారి భక్తురాలు.
భర్త శ్రీరాం, కుటుంబసభ్యులతో కలిసి గత రెండేళ్లుగా తమ ఇంటివద్ద ప్రతిరోజూ హోమాలు, ప్రతి శుక్రవారం గోపూజ, మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.30 మధ్య రాహుకేతు పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిదిగా భావించే ముక్కుపుడక, మెడలో పూలదండ ధరించి ‘ప్రత్యంగిర.. ప్రత్యంగిర.. ప్రత్యంగిర..’ మంత్రోచ్ఛారణతో నిత్యం గంట పాటు హోమం చేస్తున్నారు. అయితే హోమగుండంలో ఎండుమిర్చి వేస్తే ఘాటు రావడం లేదని, ఇది ప్రత్యంగిర అమ్మవారి మహిమ అని స్థానికులు చెప్పుకుంటున్నారు.
అనేక మంది భక్తులు వచ్చి ఆ పూజలో పాల్గొంటున్నారు. గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు తదితర ప్రజాప్రతినిధులు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఈనెల 5న జిల్లా పర్యటనలో ఉన్న శ్రీనివాసరావు ఈ పూజలో పాల్గొనడంతో విజయలక్ష్మి నిర్వహించే ప్రత్యంగిర పూజ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.
కుమారుడి గుండె జబ్బు తగ్గిపోయిందని..
స్థానికుల కథనం ప్రకారం.. విజయలక్ష్మి, శ్రీరాం దంపతులకు సుమంత్, 18 ఏళ్ల చరణ్ కుమారులు. మూడేళ్ల క్రితం చరణ్ గుండెకు రంధ్రం ఉందని, ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న ప్రత్యంగిర అమ్మవారిని దర్శించుకున్న ఆ కుటుంబం తమ కులదైవానికి మొక్కుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆపరేషన్ లేకుండానే చరణ్ గుండె జబ్బు తగ్గిపోయిందని, మందులూ వాడనవసరం లేదని వైద్యు లు చెప్పారని, ఇదంతా తమ కులదైవమే చేసిందని ఆ కుటుంబం నమ్మింది. రెండేళ్ల నుండి చిమ్నతండాలో తమ ఇంటి వద్ద పూజలు ప్రారంభించింది.
ఆహ్వానం మేరకే డీహెచ్ హాజరు!
జిల్లాకు చెందిన డీహెచ్ శ్రీనివాసరావు ఇటీవల మరణించిన తన తండ్రి పేరిట ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ నెల 24న పాల్వంచలోనూ ఈ తరహా శిబిరం నిర్వహణ ఏర్పాట్ల పరిశీలన, నిరుపేద విద్యార్థులకు పోటీ పరీక్షల ఉచిత శిక్షణ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఈనెల 5న జిల్లా కేంద్రానికి వచ్చారు. మధ్యా హ్నం 2:30 గంటలకు సుజాతనగర్ వెళ్లిన డీహెచ్ మెడలో పూలమాల వేసుకుని అక్కడ విజయలక్ష్మి నిర్వహించిన ప్రత్యంగిర పూజలో పాల్గొన్నారు. ఆయన్ను తానే ఆహ్వానించానని, తాను చేస్తున్నవి క్షుద్ర పూజలు కావని ఆమె ‘సాక్షి’కి చెప్పారు.
ప్రశాంతత కోసమే గ్రామానికి..
తాను ఎలాంటి క్షుద్రపూజల్లో పాల్గొనలేదని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. కొన్ని ఛానెళ్లలో ప్రసారమైన వార్తలను ఆయన ఖండించారు. సేవా కార్యక్రమాలను ఓర్వలేకనే కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొంటే తప్పేందముందని ప్రశ్నించారు.
స్వయం ప్రకటిత దేవతతో తనకు సంబంధం లేదని, మూఢ నమ్మకాలను తాను విశ్వసించనని వివరించారు. తన తండ్రి స్ఫూర్తితో జీఎస్సాఆర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు విస్తృతంగా సామాజిక సేవలు అందిస్తుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కరోనా నియంత్రణలో రెండున్నర ఏళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసిన తాను మానసిక ప్రశాంతత కోసం సెలవుల్లో సొంత గ్రామానికి వెళ్లి వస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి ప్రజారోగ్య సంచాలకునిగా ఉన్న తనకు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏం ఉందన్నారు. మెగా హెల్త్‌క్యాంపు ఏర్పాట్లలో భాగంలోనే గత కొంత కాలంగా కొత్తగూడెం ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment