సాక్షి, చర్ల: మండల పరిధిలోని బెస్త కొత్తూరు వాసి, పెదమిడిసిలేరు ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు ఈ నెల 8న రాత్రి సుమారు 10.30 గంటలకు ఇంటి నుంచే అపహరించుకుపోయారు. శుక్రవారం హతమార్చి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఎర్రంపాడు శివారులోని అటవీ ప్రాంతంలో పుట్టపాడు మార్గంలో మృతదేహాన్ని వదిలివెళ్లారు. శ్రీనివాసరావును కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో వారితో పాటు తీసుకెళ్లిన ద్విచక్రవాహనాన్ని కూడా మృతదేహం వద్దనే వదిలివెళ్లారు. ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నందువల్లే హతమార్చామంటూ అక్కడ ఒక లేఖను కూడా వదిలి వెళ్లారు.
గత సోమవారం రాత్రి శ్రీనివాసరావును అపహరించుకు పోయే సమయంలో అడ్డుపడిన భార్యను తుపాకీ చూపించి బెదిరించడంతో పాటు అడ్డుపడిన కుమారుడు ప్రవీణ్‌ను కర్రతో తలపై బలంగా కొట్టారు. శ్రీనివాసరావును బీ కొత్తూరు నుంచి ఎన్ కొత్తూరు మీదుగా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యానికి తీసుకెళ్లారు. దీంతో మంగళవారం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బీ కొత్తూరు సమీప గ్రామాలకు చెందిన సన్న, చిన్నకారు రైతులు సుమారు 300 మంది ట్రాక్టర్లలో అడవిబాటపట్టి ఎర్రంపాడు, చెన్నాపురం తదితర గ్రామాలలో గాలింపు చేపట్టారు. అటవీ ప్రాంతంలో వీరికి తారసపడిన కొందరు ఆదివాసీలు వెనుదిరిగి వెళ్లాలని, ఒకటి రెండు రోజుల్లో శ్రీనివాసరావు ఇంటికి వచ్చేస్తాడంటూ చెప్పడంతో వారు అటవీ ప్రాంత నుంచి వెనుదిరిగారు.
బుధవారం ఉదయం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని తోగ్గూడెం అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు హతమార్చి మృతదేహాన్ని పడవేశారంటూ పుకార్లు షికార్లు చేయడంతో మీడియా ఆ ప్రాంతానికి చేరుకోగా.. వేరే ద్విచక్రవాహనదారుడు రోడ్డు ప్రమాదానికి గురై ఆ ప్రాంతంలో కనిపించడంతో అతనిని పామేడు వైద్యశాలకు తరలించి మీడియా వెనుదిరిగింది. అటు తర్వాత గురువారం ఉదయం నుంచి శ్రీనివాసరావును మావోయిస్టులు విడుదల చేశారని అదుగో వస్తున్నాడని... ఇదుగో వస్తున్నాడంటూ వదంతులు వ్యాపించాయి. శుక్రవారం సరిహద్దులోని ఎర్రంపాడు శివారు అటవీ ప్రాంతంలోని పుట్టపాడు మార్గంలో మృతదేహం పడి ఉందని సమాచారం అందడంతో మీడియా ఆ ప్రాంతానికి చేరుకుంది.
ఎర్రంపాడుకు సుమారు కిలోమీటరు దూరంలో నల్లూరి శ్రీనివాపరావును మావోయిస్టులు హతమార్చి మృతదేహాన్ని వదలివెళ్లారు. గొడ్డళ్లతో నరికి హతమార్చినట్లుగా తెలుస్తోంది. మృతదేహం వద్ద మావోయిస్టు పార్టీ చర్ల–శబరి ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరిట లేఖను వదిలివెళ్లారు. ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తుండడంవల్లే ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును హతమార్చామని లేఖలో పేర్కొన్నారు. శ్రీనివాసరావు పోలీసులతో కలిసి పార్టీని నిర్మూలించడానికి ఆదివాసీ గ్రామాలలో ఇన్‌ఫార్మర్లను తయారు చేస్తున్నాడని, దళాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేస్తూ ప్రజా సంఘాల వాళ్లను అరెస్టులు చేయిస్తున్నాడని, అందుకే ఖతం చేశామంటూ లేఖలో పేర్కొన్నారు.
ప్రాధేయ పడినా..
ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును కిడ్నాప్ చేసిన తర్వాత భార్య దుర్గ, కుమారుడు ప్రవీణ్‌కుమార్ నల్లూరి శ్రీనివాసరావును మానవతా దృక్పథంతో విడిచిపెట్టాలంటూ పలుమార్లు ప్రాధేయపడ్డారు. ఎటువంటి తప్పు చేయలేదని, నలుగురికీ ఉపకారిగానే ఉంటాడని, అపకారిగా ఏ మాత్రం కాదని ఒక వేళ తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే పెద్ద మనస్సు చేసుకొని మన్నించి విడిచిపెట్టాలంటూ వేడుకున్నారు. అయినప్పటికీ మావోయిస్టులు కనికరించలేదు.
శోక సంద్రంలో బీ కొత్తూరు ...
శ్రీనివాసరావును మావోయిస్టులు హతమార్చడంతో బెస్త కొత్తూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. కిడ్నాప్‌కు గురైన శ్రీనివాసరావును మావోయిస్టులు విడిచిపెడతారని, తిరిగి వస్తాడని ఎదురు చూసిన భార్య, కుమారుడు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు.. మృతదేహం కనిపించడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీనివారావు ఇంటి వద్ద భార్య, కుమారుడు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ముమ్మరంగా కూంబింగ్ జరుగుతున్నా..
ఒక పక్క సరిహద్దుల్లో ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్‌లు కొనసాగుతున్నా.. మరో పక్క దండకారణ్యంలో విరివిగా సీఆర్‌పీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నా.. మావోయిస్టులు అడపా దడపా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఎంపీటీసీ సభ్యుడినే హతమార్చి పోలీసులకు సవాల్ విసిరారని చెప్పకనే చెప్పవచ్చు. 2017 ఫిబ్రవరిలో చర్ల మండలంలోని పెదమిడిసిలేరుకు చెందిన సోడి ప్రసాద్‌ను మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి ఇంటికి సమీపంలోని గీసరెల్లి మార్గంలో హతమార్చారు. అటు తరువాత మళ్లీ సరిగ్గా రెండేళ్ల తరువాత మళ్లీ తాజా సంఘటనలో మండలంలోని బెస్త కొత్తూరుకు చెందిన పెదమిడిసిలేరు ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును హత్యచేశారు.
ఈ రెండు హత్యలకు మధ్యలో 2018 జూలై నెలలో మావోయిస్టు పార్టీ ముఖ్య నేత అరుణ్‌కుమార్ చర్ల మండలంలోని కుర్నపల్లి శివారులో పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. ఎండా కాలం ఆకురాలి దండకారణ్యం కూంబింగ్‌కు అనువుగా ఉంటుంది. వర్షాకాలం అటవీప్రాంతం దట్టంగా ఉండడంతో మావోయిస్టులకు అనుకూలంగా మారుతుంది. ఈ క్రమంలో తాజా హత్యతో మరెన్ని ఘాతుకాలు జరుగుతాయోనని సరిహద్దు ప్రజానీకం తీవ్రంగా భయాందోళనలు చెందుతున్నారు. ఎంపీటీసీ సభ్యుడి హత్య నేపథ్యంలో సరిహద్దుకు ప్రత్యేక పోలీసు బలగాలను తరలిస్తున్నారు. ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండడంతో సరిహద్దులో ఏ క్షణంలో ఏ ప్రమాదం వచ్చి పడుతుందోనని సరిహద్దు జనం తీవ్రంగా భయాందోళనలు చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment