
జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న దళితులు
జూలూరుపాడు: దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం జరిగిందంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో దళితులు, యువకులు ఆందోళనకు దిగారు. అర్హులైన వారికి కాకుండా భూములు, భవనాలు, ఉద్యోగాలు ఉన్నవారికి, గతంలో ప్రభుత్వ రుణాలు పొందిన వారికి దళితబంధు జాబితాలో చోటు కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం జూలూరుపాడు, వెంగన్నపాలెం, పెద్దహరిజనవాడ, చిన్నహరిజనవాడ గ్రామాల దళిత మహిళలు, యువత మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యాలయాన్ని ముట్టడించారు. ఖమ్మం–కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జాబితాలోని అనర్హుల పేర్లు ఇస్తే పరిశీలించి ప్రభుత్వానికి నివేదికిస్తామని తహసీల్దార్ చెప్పడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. అనర్హుల పేర్లు తొలగించి అర్హుల ఎంపిక కోసం గ్రామసభ నిర్వహించాలని, ఎమ్మెల్యే అనుచరుల పేర్లు తొలగించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment