వాసాలమర్రి
హుజూరాబాద్ నుండి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దళితబంధు.. తెలంగాణ దళితుల సంక్షేమం, అభివృద్ధిలో ఓ విప్లవం. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయంతో ఉపాధి మార్గాన్ని చూపే ఓ కొత్త వెలుగు. ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తి మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ దళితుల స్థితిగతులను మార్చేందుకు వాసాలమర్రిలో పురుడుపోసుకున్న ఈ పథకం హుజూర్‌బాద్‌లో విస్తరించి ఏడాదిని పూర్తి చేసు కుంటోంది.
అయితే లక్ష్యాలు, నిబంధనలు ఒక్కటే అయినా, యాదాద్రి జిల్లా వాసాలమర్రి లబ్ధిదారుల్లో వెలుగులు నింపుతున్న ఈ పథకం..హుజూరాబాద్‌లో మాత్రం తడబడుతోంది. తక్కువ సంఖ్యలో లబ్ధిదారులు, సరైన యూనిట్ల ఎంపిక, అధికారుల పర్యవేక్షణ, మెరుగైన అమలు తీరు వాసాలమర్రి దళితులను విజయపథంలో నడిపిస్తుంటే..యూనిట్ల ఎంపికలో అవగాహన లోపం, సరైన మార్గదర్శకత్వ లేమి కారణంగా హుజూరాబాద్‌లో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు.
ప్రత్యేక సర్వే.. పకడ్బందీగా అమలు
వాసాలమర్రిలో స్థానిక మార్కెట్ పరిస్థితి, లబ్ధిదారుల అభిరుచులు, వారి సాంకేతిక సామర్థ్యాల పరిశీలన అనంతరం యూనిట్లను మంజూరు చేశారు. ఆపై వారు నిలదొ క్కుకునేందుకు ప్రత్యేక శిక్షణ, పరిశీలనతో ముందుకు వెళ్తుండటంతో ఇక్కడ సక్సెస్ రేటు ఊహించినదానికంటే అధికంగా ఉంది. మెజారిటీ లబ్ధిదారుల పరిస్థితి ప్రభుత్వం ఆశించిన విధంగా మెరుగుపడుతోంది.
స్థానిక అవసరాల మేరకు యూనిట్లు
‘వాసాలమర్రిలో తొలుత ప్రత్యేకంగా సర్వే చేసి స్థానిక పరిస్థితులు, అవసరాలను గుర్తించాం. ఇదే సమయంలో లబ్ధిదారుల్లో సామర్థ్యాన్ని పరిశీలించి వారు కోరుకున్నవి కాకుండా అక్కడ అవసరం ఉన్న యూనిట్లు పెట్టించాం. 75 మందికి 19 రకాల పనులు అప్పగించి చేయూతనిస్తున్నాం. మెజారిటీ లబ్ధిదారుల ఆర్థికస్థితి ఇప్పుడిప్పుడే మారుతోంది..’ అని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ చెప్పారు.
ఇక్కడ కోరుకున్న వారికి కోరుకున్నట్టుగా..!
హుజూరాబాద్‌లో 15,710 కుటుంబాలకు దళితబంధు అందజేయాలన్న లక్ష్యంతో ఇప్పటికి 12,007 మందికి అందజేశారు. అయితే ఇక్కడ స్థానిక పరిస్థితులు, లబ్ధిదారుల సామర్ధ్యం, మార్కెట్‌లో డిమాండ్ – సప్లయితో సంబంధం లేకుండా యూనిట్ల పంపిణీ సాగుతోంది. దీంతో లబ్ధిదారుల్లో తమకు రూ.10 లక్షల సహాయం అందుతుందన్న సంతోషం ఉన్నా, ఆశించిన ఆదాయం రావటం లేదన్న అసంతృప్తి వెంటాడుతోంది.
హుజూరాబాద్ మండలం చిల్పూరులో 324 కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేస్తే అందులో 142 యూనిట్లు వాహనాలే కావటం విశేషం. ఇక ఎక్కువ సంఖ్యలో బర్రెలు తీసుకున్నవారూ సంతృప్తిగా లేరు. హరియాణాæ నుండి తెచ్చిన బర్రెలు ఆశించిన విధంగా పాలు ఇవ్వకపోగా, అనారోగ్యం పాలవున్న తీరు లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. లబ్ధిదారుల అవగాహన లోపం, సరైన చర్యలు తీసుకోవడంలో అధికారుల వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వాసాలమర్రిలో ‘లక్ష్మీ’ కటాక్షం
దళితబంధు పథకంతో తన పేరు నిజంగా సార్ధకమైందని అంటోంది..వాసాలమర్రికి చెందిన చెన్నూరి లక్ష్మి. నలుగురు పిల్లల తల్లయిన లక్ష్మి గతంలో అద్దెకు తీసుకున్న ఆటోలో భర్తతో కలిసి ఊరూరూ తిరుగుతూ కూరగాయల వ్యాపారం చేసేది. కానీ వచ్చిన లాభంలో 75 శాతం ఆటో అద్దెకే పోయేది. ఈ నేపథ్యంలో దళితబంధు కింద లక్ష్మి ఆటో ట్రాలీ తీసుకుంది. కూరగాయలు కొని అమ్మితే లాభం ఉండదని భావించింది.
తనకున్న భూమిలో బోరు వేసి తాను కూడా కాయగూరల సాగు మొదలుపెట్టింది. ఇప్పటికే నలుగురు కూతుళ్లలో ఇద్దరి వివాహాలు చేయగా, బీటెక్, ఎంబీఏ చదువుతున్న ఇంకో ఇద్దరు అమ్మాయిలున్నారు. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్న కుమార్తె మానసతో కలిసి లక్ష్మి చుట్టుపక్కల పల్లెలకు ఆటోలో వెళ్లి వస్తూ వ్యాపారం చేస్తోంది.
సొంత ఆటో, వ్యవసాయ పంటలతో ప్రస్తుతం లక్ష్మిఆదాయం నెలకు రూ.50 వేల వరకు చేరింది. ఇక దీపం వత్తులు చేస్తున్న బొల్లారం లావణ్య, పేపర్ గ్లాస్‌లు తయారు చేసి విక్రయిస్తున్న బొల్లారం రేఖలు చిన్నపాటి పారిశ్రామికవేత్తలుగా మారిపోయారు. తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నారు. ఈ తరహా మార్పు వాసాలమర్రిలోని 80 శాతం లబ్ధిదారుల్లో కనిపిస్తోంది.
వరినాటు మెషీన్ తీసుకున్నాం కానీ..
గతంలో కూలీ పనులు చేసుకొని బతికేటోళ్లం. దళితబంధులో మా చిన్నాన్న అయిలయ్యతో కలిసి వరి నాటు వేసే మెషీన్ తీసుకున్నం. ఇప్పటివరకు 80 ఎకరాల్లో నాట్లు వేసినం. గంటకు ఎకరం వరకు నాటు వేస్తుంది. అయితే ఆ యంత్రాన్ని నడపడం మాకు రాకపోవడంతో బాపట్ల నుంచి డ్రైవర్, టెక్నీషియన్లను తీసుకొచ్చాం. వచ్చిన ఆదాయంలో అత్యధికం డ్రైవర్, టెక్నీషియన్‌తో పాటు డీజిల్‌కే పోయింది. మాకు సరిపడా మిగిలే పరిస్థితి ఉంటే బాగుంటుంది.
–పాంకుంట అనిల్, ధర్మరాజుపల్లి (హుజూరాబాద్)
కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
మాకు ఎకరన్నర పొలం ఉంది. మా ఆయన వ్యవసాయం చేస్తోంటే నేను ఊళ్లోనే కూలి పనికి పోయి బతికేది. మాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. దళితబంధులో నెల క్రితం 4 బర్రెలు వచ్చినై. రెండు బర్లు పాలిస్తున్నై. 15 రోజులకు రూ.6 వేల వరకు వచ్చినయి. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. అయితే పాల దిగుబడి ఊహించినట్టుగా లేదు.
– పుల్ల సరోజని, చెల్పూరు (హుజూరాబాద్)
అడ్డా మీద పెట్టనివ్వలేదు..
రెండు నెలల క్రితం మాకు మా నాన్న పేరుమీద ఆటో ట్రాలీ ఇచ్చారు. ఊరిలో సరిపడా గిరాకీ దొరకటం లేదు. జమ్మికుంట అటో అడ్డాకు పోతే.. సభ్యత్వం కోసం 7 వేలు కట్టమన్నారు. అంతమొత్తం లేక ఆటో ఊరిలోనే పెట్టా. ఇక్కడ గిరాకీ దొరికితే పోతున్న.
– గోపీచంద్, చెల్పూరు (హుజూరాబాద్)
చేయి విడువని వ్యవస్థ కావాలి
దళితబంధు అనేది సంక్షేమ రంగంలోనే అత్యద్భుతం. అయితే యూనిట్ ఎంపిక, నిర్వహణ, భవిష్యత్తులో వచ్చే సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ అవసరం. ఇది ప్రభుత్వంతో పాటు దళిత ప్రజాస్వామిక సంఘాల బాధ్యత. వచ్చే ఐదేళ్ల పాటు లబ్ధిదారులకు అన్నివిధాలా సహాయకారిగా ఉండేలా చేయి విడువని వ్యవస్థ ఏర్పాటు చేస్తేనే పథకం లక్ష్యం నెరవేరుతుంది.
– మల్లేపల్లి లక్ష్మయ్య, చైర్మన్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్
అన్నివిధాలా అండగా ఉండాలి
రాష్ట్రంలో 19 లక్షల దళిత కుటుంబాలున్నాయి. రూ.3,100 కోట్లతో 29 వేల మంది లబ్ధిదారులకు పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఈ పథకంతో దళితుల జీవితాల్లో మార్పులు రావాలంటే ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సిన పలు చర్యలను నిపుణులు సూచిస్తున్నారు.
►యూనిట్ల మంజూరుతోనే సరి పెట్టుకోకుండా లబ్ధిదారులకు అన్నివిధాలా అండగా నిలవాలి. అవసరమైన సహాయ సహకారాలు అందించాలి.
►లబ్ధిదారులు స్థానిక పరిస్థితులు, వారి సామర్థ్యానికి అనుగుణంగా యూనిట్లు ఎంపిక చేసుకునేలా చూడాలి. యూనిట్ల పంపిణీ కంటే ముందుగానే వాటిపై పూర్తి అవగాహన కల్పించాలి. అవసరమైన సాంకేతిక శిక్షణ ఇవ్వాలి. మార్కెట్ మెలకువలు కూడా వివరించాలి.
►దళితబంధు లబ్ధిదారుల పర్యవేక్షణ కోసం ప్రతి మండలానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించి యూనిట్లు లాభాల బాట పట్టేలా మిగతా విభాగాలతో సమన్వయం చేయాలి.
►ప్రతి నెలా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి, లోపాలు సరిదిద్దడంతో పాటు లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలి.
►ప్రభుత్వ విభాగాల్లో ప్రైవేటు వాహనాల వినియోగం స్థానే.. దళితబంధు యూనిట్లకు ప్రాధాన్యవ్వాలి.
►జిల్లా స్థాయిలో గ్రీవెన్స్‌సెల్ పెట్టి వచ్చే ఫిర్యాదులపై తక్షణ పరిష్కారం చూపాలి.
Comments
Please login to add a commentAdd a comment