సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీకి చెందిన వారికే ప్రాధాన్యం దక్కిందని పలువురు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం ఎమ్మెల్యేలకు ఇవ్వడంతో వారి అనుయాయులకే యూనిట్లు కేటాయించినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి వంద యూనిట్లను కేటాయించింది. వీటిలో దాదాపు 90 శాతానికి పైగా అధికార పార్టీ వారికి కేటాయించినట్లు తెలుస్తోంది.
చదవండి: రహస్య సర్వే: హస్తం కేడర్‌పై.. అధిష్టానం నజర్..
ఎంపిక చేసిన జాబితాలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నారు. కొన్ని మండలాల్లో సదరు కార్యకర్తలు తమ సమీప బంధువుల పేర్లమీద ఏకంగా రెండు నుంచి మూడు వరకు యూనిట్లు పెట్టుకున్నారు. ఇందులో గతంలో హార్వెస్టర్లు, ట్రాక్టర్లు పొందిన వారు సైతం ఉండడం గమనార్హం. దీంతో నిరుపేద దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 100 యూనిట్లే కావడంతో మొదట ఇబ్బందులు పడిన ఎమ్మెల్యేలు తరువాత ఏదైతే అదైంది అన్న రీతిలో తమ అనుయాయులకే ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా లబ్ధిదారుల ఎంపిక విషయంలో మొదట ఇబ్బంది పడినట్లు తెలిసింది. లబ్ధిదారుల ఎంపిక జాబితాను వెంటవెంటనే మూడు సార్లు మార్పు చేయడం గమనార్హం. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్‌పల్లి మండలం సాంపల్లిలో 15, నిజామాబాద్ రూరల్ మండలం ముత్తకుంటలో 14, సిరికొండ మండల కేంద్రంలో 1, ముషీర్‌నగర్‌లో 15, జక్రాన్‌పల్లి మండలం మాదాపూర్‌లో 5, ధర్పల్లి మండలం వాడిలో 15, ఇందల్వాయి మండలం లోలంలో 15, మోపాల్ మండలం ముదక్‌పల్లిలో 15 కుటుంబాలను ఎంపిక చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక చేసిన జాబితాను గోప్యంగా ఉంచారు.
ఈ నియోజకవర్గంలో ఇతర పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని వారికి సంబంధించిన వారిని సైతం ఎంపిక చేసినట్లు తెలిసింది. బోధన్ నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో దాదాపుగా టీఆర్‌ఎస్ కార్యకర్తలనే ఎంపిక చేసినట్లు సమాచారం. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించి అధికారుల పరిశీలన నామమాత్రంగానే సాగినట్లు సమాచారం.
ఎమ్మెల్యేల నుంచి వచ్చిన జాబితాను ఆన్‌లైన్ చేయడమే అధికారుల పని అన్నట్లుగా ఉంది. కాగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల రుణాల కోసం ఎదురు చూస్తున్న దళిత నిరుద్యోగులు ఈ పథకం అమల్లోకి రావడంతో ఆ రుణాలపై ఆశలు వదులుకుంటున్నారు. అయితే తాజా పథకంలో తమకు ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆయా జాబితాలకు సంబంధించి అధికారులతో వెరిఫికేషన్ చేయించామన్నారు. లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమం పూర్తి చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment