
సాక్షి, హైదరాబాద్: దళితబంధు యూనిట్ ఏర్పాటుపై లబ్ధిదారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకేసారి రూ.10 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ కాగా, ఆ నిధితో ఎలాంటి వ్యాపారం చేయాలనే దానిపై స్పష్టత లేక అయోమయంలో పడ్డారు. యూనిట్ ప్రతిపాదనలు సంబంధిత కమిటీల ద్వారా జిల్లా కలెక్టర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. కలెక్టర్ ఆమోదించిన తర్వాత యూనిట్ సంబంధిత వస్తువులు, పరికరాల కొనుగోలుకు అనుమతి లభిస్తుంది.
అనంతరం లబ్ధిదారు ఖాతా నుంచి నగదును చెక్కురూపంలో విక్రేత ఖాతాకు బదిలీచేస్తారు. పథకాన్ని పారదర్శకంగా, పక్కాగా అమలు చేసేవిధంగా ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలు విధించింది. దళితబంధు కింద హూజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంతోపాటు ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఇప్పటివరకు 18,064 మంది బ్యాంకుఖాతాల్లో నగదు జమచేశారు.
ఈ క్రమంలో సగానికిపైగా లబ్ధిదారులు కొత్త యూనిట్లకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించగా, ఇందులో అత్యధికులు కార్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. దాదాపు 8 వేల ప్రతిపాదనల్లో 5,440 మంది కారుగానీ, ట్రాక్టర్‌గానీ కొనుగోలు చేస్తామని చెప్పారు. కొందరు కార్లు కొని అద్దెకు ఇచ్చుకుంటామని తెలపగా, మరికొందరు క్యాబ్‌రంగంలో పనిచేస్తామని వివరించారు. వ్యవసాయపనుల కోసం ట్రాక్టర్లు కొనుగోలు చేసుకుని సొంతంగా నడిపిస్తామని వివరించారు.
కార్లు, ట్రాక్టర్లకు డిమాండ్ ఉన్నప్పటికీ, ఒకేచోట పెద్దసంఖ్యలో వాహనాలుంటే వాటికి పనిదొరికే అవకాశాలు తగ్గుతాయనే అభిప్రాయం అధికార వర్గాల్లో కనిపిస్తోంది. దీంతో పరిమితసంఖ్యలోనే ఇలాంటి యూనిట్లకు అవకాశం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కార్లు, ట్రాక్టర్లు మాత్రమే కాకుండా ఇతర డిమాండ్ ఉన్న రంగాలపై అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు దళితబంధు నోడల్ అధికారులు సూచనలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment