పోడు పట్టాలు ఇవ్వకుంటే చెట్టుకు కట్టేయండి  | TPCC Chief Revanth Reddy Slams CM KCR | Sakshi
Sakshi News home page

పోడు పట్టాలు ఇవ్వకుంటే చెట్టుకు కట్టేయండి 

Published Sun, Feb 12 2023 2:29 AM | Last Updated on Sun, Feb 12 2023 2:29 AM

TPCC Chief Revanth Reddy Slams CM KCR - Sakshi

జవహర్‌ ఖని గని వద్ద తట్టా,  చెమ్మస్‌తో రేవంత్‌ రెడ్డి 

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం:  సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఓట్లు అడగడానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వస్తే చెట్లకు కట్టేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు కాంగ్రెస్‌ వెంట ఉన్నారనే భయం సీఎం కేసీఆర్‌కు పట్టుకుందని.. అందుకే ఇప్పుడు 11.5 లక్షల ఎకరాల పోడు భూ­ములకు పట్టాలు జారీ చేస్తామని మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు.

‘హాథ్‌సే హాథ్‌ జోడో’యాత్రలో భాగంగా శనివారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జగదాంబ సెంటర్‌లో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. అధికారం చేపట్టిన తొమ్మిదేళ్లలో పోడు రైతులు, ఆదివాసీలపై దాడులు చేయడం తప్ప పట్టాలు ఇచ్చే విషయాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. పోడు భూముల అంశంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడితే.. ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కేసీఆర్‌ ఆమెపైకి దూసుకొస్తూ రంకెలు వేశారని వ్యాఖ్యానించారు. పోడు సాగుచేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని తాము డిమాండ్‌ చేస్తున్నామే తప్ప.. ఫాంహౌజ్‌ భూములు, బ్యాంకులోని డబ్బులు రాసి ఇవ్వాలని ఏమీ అడగటం లేదని పేర్కొన్నారు. 

ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలి 
మాయమాటలు చెప్పడంలో, ప్రజలను మోసం చేయడంలో సీఎం కేసీఆర్‌ను మించిన వారు ఎవరూ లేరని రేవంత్‌రెడ్డి విమర్శించా­రు. వాల్మీకి బోయ వర్గానికి చెందిన గట్టు భీ­ముడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆశ చూపి, చివరికి ఎగ్గొట్టారని ఆరోపించారు. వాల్మీకి బో­యతోపాటు మరికొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. రిజర్వేషన్ల పెంపు, కొత్త కులా­ల చేర్పు వంటి అంశాలను కేంద్రం మీద నెట్టే­స్తూ తప్పు కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. 

సింగరేణిలో అవినీతిపై విచారణ చేస్తాం 
కాంగ్రెస్‌ సభలకు వెళ్తున్న వారికి పోడు పట్టాలు ఇవ్వబోమంటూ ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తోందని రేవంత్‌ ఆరోపించారు. జవహర్‌ఖని గనిని సందర్శించిన రేవంత్‌రెడ్డి కార్మికులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేయిస్తామని.. సింగరేణి సీఎండీ శ్రీధర్, టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలు కవితపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

అర్హులందరికీ పోడు పట్టాలిస్తాం 
2024 జనవరిలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వ­స్తుందని.. ఆ వెంటనే అర్హులైన అం­దరికీ పోడు పట్టాలు జారీ చేస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నా­రు. ఆహార, వాణిజ్య పంటన్నింటికీ గిట్టుబాటు ధర కల్పిస్తామని, రూ.5 లక్షల వ్యయంతో ఇందిర­మ్మ ఇళ్ల పథకం అమలు చే­స్తామని ప్రకటించారు. రూ.ఐదువేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రూ.800 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీలు ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement