సాక్షి, ఖమ్మం క్రైం: అంత్యక్రియలకు బయలుదేరిన రిటైర్డ్ సీఐ దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ విషాద సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. రిటైర్డ్ సీఐ విజయ్‌కుమార్ ఖమ్మం నగరంలోని చెరువుబజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఆయన తల్లి తన స్వస్థలమైన ఆదిలాబాద్‌లో మృతి చెందింది. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు విజయ్‌కుమార్ తన భార్య సునీత, కూతురుతో కలిసి కారులో ఆదిలాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం శాంతినగర్ వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనటంతో అక్కడికక్కడే విజయ్‌కుమార్, ఆయన భార్య సునీత మృతి చెందారు. కారులో ఉన్న కుమార్తె, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.
విజయ్‌కుమార్ 1989 బ్యాచ్ ఎస్‌ఐ. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎస్సై, సీఐగా పనిచేశారు. ఖమ్మం డీసీఆర్‌బీ సీఐగా పనిచేస్తున్న కాలంలో పలువురి మన్ననలు పొందడంతోపాటు అందరికీ సుపరిచితుడిగా మారారు. పోలీస్ శాఖలో ఆయనకు సమర్థవంతమైన అధికారిగా, ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా గుర్తింపు ఉంది.
ఖమ్మంలో విషాద ఛాయలు
విజయ్‌కుమార్ దంపతుల మృతదేహాలను ఖమ్మం తీసుకొచ్చారు. ఖమ్మంలో ఆయన సన్నిహితులు, బంధువుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను చూసేందుకు స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పలువురు పోలీస్ అధికారులు మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment