
సాక్షి, నేలకొండపల్లి: కళాశాలల్లో చదివే విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. పదో తరగతి వరకు పీఈటీల పర్యవేక్షణలో పలు క్రీడాంశాల్లో రాణించిన క్రీడాకారులు.. ఇంటర్మీడియట్‌కు రాగానే ఆటలపై మక్కువ చూపించని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం కళాశాలల్లో పూర్తిస్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులు(పీడీ) లేకపోవడమే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 33 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. కేవలం ఇద్దరు పీడీలు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఏళ్లతరబడి పీడీ పోస్టులు భర్తీ చేయకపోవడంతో కళాశాలల్లో వ్యాయామ విద్య కుంటుపడుతోంది.
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 11,600 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు అండర్–19 విభాగంలో వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తుంటారు. జోనల్ స్థాయిలో సత్తా చాటిన వారిని రాష్ట్రస్థాయికి.. అక్కడ ప్రతిభ కనబరిచిన వారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తుంటారు. ప్రస్తుతం కళాశాలల్లో పీడీలు లేకపోవడంతో అండర్–19 క్రీడా పోటీలు నిర్వహించడం కూడా అనుమానంగానే ఉంది. పాఠశాల స్థాయిలో క్రీడల్లో రాణించిన విద్యార్థులు.. ఇంటర్మీడియట్‌లో చేరిన తర్వాత వారికి క్రీడల్లో శిక్షణ ఇచ్చే ఫిజికల్ డైరెక్టర్లు లేకపోవడంతో ఇన్నాళ్లు మైదానంలో పడిన శ్రమ అంతా వృథా అవుతోంది.
ఇద్దరే పీడీలు..
ఖమ్మం జిల్లాలో 19, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఖమ్మం జిల్లాలో మొత్తం 6,600 మంది విద్యార్థులు, భద్రాది కొత్తగూడెం జిల్లాలో 5,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి కళాశాలలో పీడీ ఉండాల్సి ఉండగా.. నయాబజార్, శాంతినగర్ కళాశాలల్లో మాత్రమే పీడీలు ఉన్నారు. కళాశాలల్లో ఆడేందుకు మైదానాలు, క్రీడా సామగ్రి ఉన్నా.. ఆడించే వారు లేకపోవడంతో విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనే అవకాశం కోల్పోతున్నారు. పీడీలు ఉన్న కళాశాలల్లో కూడా క్రీడలు నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జూనియర్ కళాశాల్లో పీడీలను నియమించేలా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు.
ఖాళీల మాట వాస్తవమే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పీడీ పోస్టులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమే. అయితే ప్రభుత్వం త్వరలోనే వీటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. అండర్–19 విభాగంలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు సమావేశం నిర్వహిస్తాం. కళాశాలల్లో విద్యార్థులకు వ్యాయామ విద్యను తప్పక అందిస్తాం.
– రవిబాబు, డీఐఈఓ
Comments
Please login to add a commentAdd a comment