Nelakondapalli
-
అధికారులకు షాక్: సబ్‌స్టేషన్ అమ్ముతా.. కొంటారా ?
సాక్షి, నేలకొండపల్లి: విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఒకరు స్థలం దానంగా ఇవ్వగా, నేతలు, అధికారులు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నెరవేరకపోవడంతో ఆ దాత వినూత్నంగా నిరసనకు దిగాడు. దీంతో, అతడి నిరసన.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామానికి 2014లో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరైంది. గ్రామానికి చెందిన రైతు ఆకుల నరసింహారావు 12 గుంటల భూమి ఇచ్చాడు. అప్పుడు సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా ఉద్యోగం ఇస్తామని చెప్పినా, హామీ నెరవేరకున్నా పైసా జీతం లేకుండా పనిచేశాడు. గతంలో పలుమార్లు నిరసన తెలిపినా, ఆత్మహత్యయత్నానికి పాల్పడినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో, విసుగు చెందాడు ఈ క్రమంలో బుధవారం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన నరసింహారావు.. సబ్‌స్టేషన్ అమ్ముతున్నందున కావాల్సిన వారు తనను సంప్రదించాలని కోరాడు. ఈ విషయమై ఆయనతో మాట్లాడగా ఉద్యోగమైనా ఇవ్వాలని, లేకపోతే ఎకరం భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై అధికారులు ఇంకా స్పందించలేదు. ఇది కూడా చదవండి: రీసేల్.. రివర్స్ -
భక్త రామదాసు నేలకొండపల్లిలో ప్రాచీన బౌద్ధ క్షేత్రం!
భక్త రామదాసు అనగానే ముందుగా అందరూ చెప్పేది ఆయన శ్రీ రాముని ఆలయం నిర్మించిన (1664) భద్రాద్రి గురించి. రామదాసుగా ప్రసిద్ధుడైన కంచెర్ల గోపన్న (1620-1688) పుట్టిన ఊరు నేలకొండపల్లిలో వారి స్వగృహం (ఇప్పుడు ధ్యాన మందిరంగా మార్చారు) వారి ఇష్టదైవం శ్రీరాజగోపాలస్వామి గుడి ఉన్నాయి. రామదాసు జగమెరిగిన రామ భక్తుడు, ఆయన కీర్తనల్లో, దాశరథి శతకంలో వినబడేది రామకథనే, కాని వారి ఊరు మాత్రం మహాభారత కథతో (విరాట్‌రాజు దిబ్బ, కీచకగుండం లాంటివి ) ముడిపడి ఉండడం విశేషం. అంతేకాదు నేలకొండపల్లి క్రీ శ2-6 శతాబ్దుల మధ్య కాలంలో ప్రసిద్ధమైన బౌద్ధమత కేంద్రం కావడం మరో విశేషం. ఆ కాలంలో ముడి ఇనుముతో, పంచలోహలతో ఇక్కడ తయారైన బుద్ధ విగ్రహాలు దక్షిణ భారత మంతా పంపిణీ చేయబడేవట. నేలకొండపల్లి ఎర్రమట్టిదిబ్బలో 1976 లో జరిగిన పురావస్తు తవ్వకాల్లో బయటపడిన అమరావతి కన్నా పెద్దదిగా భావించబడే బౌద్ధస్తూపం ఈ గ్రామ చరిత్రనే మార్చేసింది. ఈ చక్రాకార స్తూపం చుట్టూ 180 ఎత్తు 16మీ గా 2 ఎకరాల స్థలంలో నిర్మించబడింది. దీనిపైనున్న బ్రాహ్మి లిపి శాసనాన్ని క్రీ శ 3-4 శతాబ్దులదిగా భావిస్తున్నారు. స్తూప పరిసరాల్లోని దాదాపు నూరు ఎకరాల్లో మజ్జుగూడెం వరకు బౌద్ధ బిక్షుల నివాసాలు, నల్లదిబ్బ ప్రాంతంలో చైత్యాలు, మట్టిబొమ్మలు,నీటితొట్టెలు, బైరాగిగుట్ట వద్ద విగ్రహాల తయారీ కేంద్ర శిథిలాలు బయట పడ్డాయట. ఇక్కడున్న బాలసముద్రం సరస్సులో ఒక జాలరి వలకు చిక్కిన బుద్ధుని పంచలోహ విగ్రహం చాలా విలువైనదట. బాదనకుర్తి, ఫణిగిరి,ధూళికట్ట బౌద్ధ క్షేత్రాల్లా దీన్ని నిర్లక్ష్యం చేయకుండా పురావస్తు శాఖవారు శిథిలమైన నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి పూర్వరూపం తేవడంతో ఇది దేశ విదేశ బౌద్ధ యాత్రికులను ఆకర్శించడం సంతోషకరం. -వేముల ప్రభాకర్ -
అక్కాబావలు అమ్మను చంపేశారు.. నే బతకనిక.. అనుమతి ఇవ్వండి
నేలకొండపల్లి: ‘నా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలి, నేను బతికి బాధలు భరించలేను’అని ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన గోరెంట్ల సాయిచంద్(17) అనే బాలుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఓ వీడియోను మూడు రోజుల కిందట సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆదివారం కలిసిన విలేకరుల ఎదుట తన గోడు వెలిబుచ్చాడు. నేలకొండపల్లికి చెందిన గోరంట్ల సుజాత చెరువుమాదారం పాఠశాలలో అటెండర్. సాయిచంద్, సాయి ప్రత్యూష ఆమె సంతానం. సాయి ప్రత్యూషను 2014 లో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన గుండా గోపి అనే వ్యక్తికిచ్చి వివాహం జరిపించారు. కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం ఇబ్బంది పెట్టడమే కాకుండా, ‘నువ్వు చనిపోతే ఆ ఉద్యోగం నా భార్యకు వస్తుంది’అంటూ సుజాతను వేధించేవాడు. ఈ క్రమంలో 2020లో అనారోగ్యానికి గురైన సుజాత హుజూర్‌నగర్‌లోని కూతురు ఇంట మృతి చెందింది. అయితే, ఆమె కరోనాతో చనిపోయిందని కూతురు, అల్లుడు అంటుండగా, ఆ మృతిపైన అనుమానాలు ఉన్నాయని, అక్కకు ఉద్యోగం కోసమే చంపి ఉంటారని ఆ బాలుడు ఆరోపిస్తున్నాడు. ఇదే విషయమై నిలదీస్తే తనను కూడా చంపేస్తానని బావ బెదిరిస్తున్నాడని, తన ఇంటి తాళాలు పగులగొట్టి సర్టిఫికెట్లు, డబ్బు, బంగారు వస్తువులు తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అక్క అత్తారింటివారు కూడా వేధిస్తున్నారని, ఇన్ని బాధలు భరించలేనని, చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని ఖమ్మం, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్, జగదీష్‌రెడ్డిలను వేడుకుంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తనకు మతిస్థిమితంలేదని ప్రచారం చేస్తున్నారని, ఆత్మహత్య చేసుకునే ధైర్యం తనకు లేదని, అందుకే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఆ బాలుడు కోరాడు. అక్కాబావలపై చర్యలు తీసుకోవాలని, వచ్చే జన్మలోనైనా మంచి కుటుంబంతో బతకాలని ఉందని పేర్కొన్నాడు. తమ్ముడిని తప్పుదారి పట్టిస్తున్నారు: సాయి ప్రత్యూష, సోదరి తల్లి మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని, ఆమె మృతికి సంబంధించిన రిపోర్టులు కూడా ఉన్నాయని సాయిచంద్ సోదరి సాయిప్రత్యూష ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ్ముడి వీడియో సోషల్ మీడియాలో చూసి ఆందోళన చెందానని, కొందరు అతడిని తప్పుదారి పట్టిస్తున్నారని, వారిపై ఇప్పటికే నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపింది. -
పరుగుల చిరుత.. శిక్షకుడిగా సత్తా చాటి..
నేలకొండపల్లి: అతనిలో చిరుతలోని వేగం ఉంది. పరుగు మొదలు పెడితే గమ్యం చేరే దాక విశ్రమించడు. పలు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని తన సత్తా చాటాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని సుర్దేపల్లి గ్రామానికి చెందిన తోళ్ల స్థాయి. అతనికి చిన్న తనం నుంచే పరుగు పందేలు అంటే ఆసక్తి. దమ్మపేట గురుకుల పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశం పొంది రాధాకృష్ణ వద్ద అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందారు. యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభను ప్రదర్శించారు. రాజీవ్ గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కర్ణాటక ఆధ్వర్యంలో 2016లో నిర్వహించిన అఖిలభారత విశ్వ విద్యాలయం తరపున క్రాస్ కంట్రీ 12 కిలో మీటర్ల పరుగు పందెంలో కాకతీయ విశ్వవిద్యాలయము తరుపున పాల్గొన్నారు. కాకినాడలో నిర్వహించిన సౌత్ జోన్ పోటీలో పాల్గొని సత్తా చూపారు. అలాగే జాతీయ క్రీడా సంస్థలు నిర్వహించిన పోటీలో పాల్గొని బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. శిక్షకుడిగా సత్తా చాటి.. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న సాయి అథ్లెటిక్స్ కోచ్ గా గుర్తింపు పొందారు . పటియాల నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ క్రీడా సంస్థ స్పోర్ట్స్ శిక్షకుడిగా ట్రైనింగ్ తీసుకున్నారు. దోమలగూడా ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయ కాలేజీ నుంచే డిప్లమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్ లో శిక్షణ పొందారు. ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ టెక్నికల్ అఫీషియల్స్ 2019 లో చోటు సాధించారు. గ్రామస్థాయి యువతకు శారీరక దృఢత్వం క్రీడాస్ఫూర్తిని అందించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.వేసవి శిబిరాలు నిర్వహిస్తూ. ప్రతి ఏటా వేసవికాలంలో జిల్లాలోని విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంచేలా శిక్షణ ఇచ్చారు. శిబిరాలను నిర్వహిస్తున్నారు. పాల్గొన్న యువతకు అథ్లెటిక్స్ లో శిక్షణ ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. జుంప్స్ అండ్ త్రోస్ విభాగంలో విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. పలుమార్లు 2కే, 3కే రన్లు నిర్వహించారు. ప్రతిభావంతులను తయారు చేయడమే లక్ష్యం గ్రామస్థాయిలో చాలామంది క్రీడాకారులు ఉంటారు. వారికి సరైన అవకాశాలు లేక , శిక్షణ లేక ఎందరో క్రీడాకారులు మరుగున పడుతుంటారు.పాఠశాల స్థాయి నుంచి క్రీడా శక్తిని పెంపొందించి ప్రతిభావంతులైన క్రీడాకారుల ను తయారు చేయడమే నా లక్ష్యం. -తోళ్ల సాయి, అథ్లెటిక్స్ కోచ్ -
పిలిస్తే వస్తుంది.. చికెన్ మాత్రమే తింటుందీ కోడి!
కూసుమంచి: ఈ చిత్రంలోని కోడి పేరు మోటూ! అది దాణా బదులు చికెన్ తింటోంది. యజమాని చెప్పినట్లు వింటోంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని తెలంగాణ చికెన్ సెంటర్ యజమాని ఇలియాస్ ఆ కోడిని పెంచుతున్నాడు. బ్రాయిలర్ కోళ్లను దిగుమతి చేసుకుని చికెన్ విక్రయించే ఇలియాస్‌కు గత నెలలో వచ్చిన ఈ కోడి నచ్చింది. దానికి మోటూ అని ముద్దు పేరు పెట్టి దాణా బదులు చికెన్ ముక్కలు, స్కిన్ అలవాటు చేశాడు. దీంతో అది చికెన్ తప్ప దాణా ముట్టుకోవడం లేదు. ఆ కోడిని యజమాని ‘మోటూ ఇదర్ ఆవో’అని పిలిస్తే చాలు వచ్చేస్తోంది. యజమాని వెంటే తిరుగుతూ... ఆయన సైగలకు అనుగుణంగా నడుచుకుంటోంది. కాగా, ఈ కోడిని కొందరు రూ.5వేల వరకు అడిగినా ఇవ్వలేదని ఇలియాస్ తెలిపారు. కాలువలో 5 కి.మీ. కొట్టుకుపోయిన గేదెలు నేలకొండపల్లి: ప్రమాదవశాత్తూ నాలుగు పాడి గేదెలు కాలువలో పడ్డాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో 5 కిలో మీటర్ల మేర కొట్టుకుపోయాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో అమ్మగూడెంనకు చెందిన రైతు అడపాల రమేశ్‌కు నాలుగు గేదెలు ఉన్నాయి. మంగళవారం వాటిని మేతకు తీసుకెళ్తుండగా నందిగామ బ్రాంచ్ కాలువలో గేదెలు జారి పడ్డాయి. అయితే గేదెలు పైకి ఎక్కడానికి ఎక్కడా మార్గం లేకపోవడం, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర కొట్టుకుపోతూ నేలకొండపల్లికి చేరాయి. అప్పటికే అమ్మగూడెంనకు చెందిన పలువురు రైతులు కాలువ కట్ట వెంట పరుగెత్తుతూ గేదెలను బయటకు లాగేందుకు శ్రమించారు. చివరకు నేలకొండపల్లి బ్రిడ్జి సమీపంలో రైతులంతా కాలువలోకి దూకి వాటిని అడ్డుకుని తాళ్లుకట్టి పైకి లాగారు. చదవండి: బాబోయ్ బార్.. భయపడుతున్న యజమానులు -
అటకెక్కిన ఆట!
సాక్షి, నేలకొండపల్లి: కళాశాలల్లో చదివే విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. పదో తరగతి వరకు పీఈటీల పర్యవేక్షణలో పలు క్రీడాంశాల్లో రాణించిన క్రీడాకారులు.. ఇంటర్మీడియట్‌కు రాగానే ఆటలపై మక్కువ చూపించని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం కళాశాలల్లో పూర్తిస్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులు(పీడీ) లేకపోవడమే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 33 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. కేవలం ఇద్దరు పీడీలు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఏళ్లతరబడి పీడీ పోస్టులు భర్తీ చేయకపోవడంతో కళాశాలల్లో వ్యాయామ విద్య కుంటుపడుతోంది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 11,600 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు అండర్–19 విభాగంలో వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తుంటారు. జోనల్ స్థాయిలో సత్తా చాటిన వారిని రాష్ట్రస్థాయికి.. అక్కడ ప్రతిభ కనబరిచిన వారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తుంటారు. ప్రస్తుతం కళాశాలల్లో పీడీలు లేకపోవడంతో అండర్–19 క్రీడా పోటీలు నిర్వహించడం కూడా అనుమానంగానే ఉంది. పాఠశాల స్థాయిలో క్రీడల్లో రాణించిన విద్యార్థులు.. ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత వారికి క్రీడల్లో శిక్షణ ఇచ్చే ఫిజికల్ డైరెక్టర్లు లేకపోవడంతో ఇన్నాళ్లు మైదానంలో పడిన శ్రమ అంతా వృథా అవుతోంది. ఇద్దరే పీడీలు.. ఖమ్మం జిల్లాలో 19, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఖమ్మం జిల్లాలో మొత్తం 6,600 మంది విద్యార్థులు, భద్రాది కొత్తగూడెం జిల్లాలో 5,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి కళాశాలలో పీడీ ఉండాల్సి ఉండగా.. నయాబజార్, శాంతినగర్ కళాశాలల్లో మాత్రమే పీడీలు ఉన్నారు. కళాశాలల్లో ఆడేందుకు మైదానాలు, క్రీడా సామగ్రి ఉన్నా.. ఆడించే వారు లేకపోవడంతో విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనే అవకాశం కోల్పోతున్నారు. పీడీలు ఉన్న కళాశాలల్లో కూడా క్రీడలు నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జూనియర్ కళాశాల్లో పీడీలను నియమించేలా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. ఖాళీల మాట వాస్తవమే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పీడీ పోస్టులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమే. అయితే ప్రభుత్వం త్వరలోనే వీటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. అండర్–19 విభాగంలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు సమావేశం నిర్వహిస్తాం. కళాశాలల్లో విద్యార్థులకు వ్యాయామ విద్యను తప్పక అందిస్తాం. – రవిబాబు, డీఐఈఓ -
రామదాసుకు అంతర్జాతీయస్థాయి కీర్తి కోసం కృషి
సాక్షి, నేలకొండపల్లి: రామయ్య పరమ భక్తాగ్రేసరుడు కంచర్ల గోపన్న(రామదాసు)కు అంతర్జాతీయస్థాయిలో కీర్తిని తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక రామదాసు ధ్యాన మందిరంలో భక్త రామదాసు జయంత్యుత్సవాలను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రసంగించారు. ఈ మందిరం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గత ఏడాది మాట ఇచ్చారని, దానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. భక్త రామదాసు ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసినట్లే ఆయన స్మృతి భవనాన్ని కూడా త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రామదాసు వంటి మహనీయుడి చరిత్రను ప్రపంచమంతా తెలుసుకునేలా ప్రచారం చేయాలని తుమ్మల సూచించారు. ఇక్కడ బౌద్ధ క్షేత్రంతోపాటు బాలసముద్రం చెరువును కూడా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. effort for International glory to Ramadas:Tummala -
రామదాసు స్వస్థలంలో కళ్యాణానికి నగదు లేదు
-
30 మంది విద్యార్థినులకు అస్వస్థత
నేలకొండపల్లి : ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని గురుకుల బాలికల విద్యాలయంలో ఆహారం వికటించి 30 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. శుక్రవారం ఆహారంలో భాగంగా చికెన్ వడ్డించడంతో అది వికటించి 30 మందికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో శనివారం వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. -
పంటకాలువలో పడి చిన్నారి మృతి
నేలకొండపల్లి (ఖమ్మం) : ఆడుకుంటూ వెళ్లి పంట కాలువలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన కోనేటి రోశయ్య, శ్రీదేవి దంపతుల కుమారుడు ప్రవీణ్(3) శుక్రవారం ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఇంటి పక్కనే ఉన్న పంట కాలువ వైపు వెళ్లి ప్రమాదవశాత్తు దాంట్లో పడిపోయాడు. నీటిలో కొట్టుకుపోయి తూము వద్ద చిక్కుకున్నాడు. కాలువలో మృతదేహమై కనిపించిన చిన్నారిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
వడదెబ్బతో ఆరుగురు మృతి
వడదెబ్బతో గురువారం వేర్వేరుచోట్ల ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మం డలం అమ్మగూడెంకు చెందిన పసుపులేటి వెంకయ్య(75), మెదక్ జిల్లా రామాయంపేట మండలం శివ్వాయపల్లికి చెం దిన వడ్ల నారాయణ, రంగారెడ్డి జిల్లా గండేడ్ మండలం దేశాయిపల్లికి చెందిన గాజుల రాములు (52), నల్లగొండ జిల్లా చివ్వెం లకు చెందిన సోపంగి దుర్గయ్య (45), రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన మిర్యాల భిక్షపతి, చిలుకూరు మండలం దూదియా తండా వాసి గుగులోతు బాసు ఉన్నారు. -
నేడు సీసీఐ కేంద్రం ప్రారంభం
నేలకొండపల్లి: నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం సీసీఐ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి ఆలీం తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పత్తి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సీసీఐ కేంద్రాన్ని ప్రారంభిస్తోందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా కేంద్రంలోనే పత్తిని విక్రయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరలిలా.. పత్తి పొడువు పింజ రకం,రూ.4050. మధ్యరకం.రూ.3750. రైతులు పాటించాల్సిన నిబంధనలు... పత్తిని బస్తాలు, బోరాలలో కాకండా బండ్లు, ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎం, లారీలలో విడిగా అమ్మకానికి తీసుకరావాలి. పత్తి సహజ రంగు మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తేమ 8 శాతానికి తక్కువగా ఉండాలి. మార్కెట్ కమిటి ఇచ్చిన టోకెన్‌లో తెలిపిన ప్రకార ం తీసుకరావాలి. కేంద్రానికి వచ్చేటపుడు మీ సేవా, లేదా పట్టాదారు పాసుపుస్తకం తీసుకుని రావాలి. పత్తిలో అపరిపక్వమైన కాయలను వేరు చేయాలి. ఎండిన ఆకులు, కొమ్మ రెమ్మలు, చెత్త లేకుండా శుభ్రం చేయాలి. అమ్మకాల అనంతరం రైతుకు ఆన్లైన్ ద్వారా 48 గంటలలో డబ్బు అందుతుంది. అందుకు రైతుల బ్యాంక్ పుస్తకాల జిరాక్స్పత్రాలు తేవాలి. మార్కెట్ యార్డులో బీడీలు, సిగిరెట్లు కాల్చటం, వంట చేసుకోవటం లాంటివి చేయకూడదు. -
కాశ్మీర్ టూ కన్యాకుమారి... కాంగ్రెస్ ఖతం
నేలకొండపల్లి: దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ గల్లంతు కావడం ఖాయమని సీపీఎం పోలిట్‌బ్యూరో మెంబర్, రాజ్యసభ సభ్యురాలు బృందా కారత్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో సోమవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్ద అవినీతి పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. మతోన్మాదంతో ముందుకు సాగుతున్న బీజేపీని, ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అడుగు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజలపైనే ఉందన్నారు. దేశంలో మూడోఫ్రంట్ ఏర్పాటుకు కృషి జరుగుతోందని తెలిపారు. పేదలను విస్మరించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పేదల జీవితాలు బాగుపడాలంటే ఖమ్మం పార్లమెంట్‌కు వైఎస్సార్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, పాలేరు అసెంబ్లీకి సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌ను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పాలేరు అసెంబ్లీ అభ్యర్థి పోతినేని సుదర్శన్, వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు కోటి సైదారెడ్డి, సీపీఎం డివిజన్ కార్యదర్శి బత్తుల లెనిన్, ఐద్వా జిల్లా నాయకురాలు బుగ్గవీటి సరళ, డివిజన్ కార్యదర్శి సిరికొండ ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
విజయమ్మ కాన్వాయ్‌పై దాడి చేసినవారిపై కేసు
నేలకొండపల్లి(ఖమ్మంజిల్లా), న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన వారిమీద నేలకొం డపల్లి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు విజయమ్మ అక్టోబర్ 31న ఖమ్మం జిల్లాలో పర్యటించడం తెలిసిందే. ఆ సందర్భంగా నేలకొండపల్లి మీదుగా న ల్లగొండ జిల్లాలోకి వెళుతుండగా ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామమైన పైనంపల్లిలో కందుల మధు మరికొందరు కాన్వాయ్‌ను అడ్డగించి చెప్పులు, కర్రలతో దాడి చేశారు. విజయమ్మను అవమానించేలా వ్యవహరించారు. తమ పార్టీ నేతల వ్యక్తిగత స్వేచ్ఛను, కార్యకర్తల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారంటూ దాడికి పాల్పడిన వారిపై వైఎస్సార్ సీపీ నాయకులు జిల్లపల్లి సైదులు, నకిరికంటి సూర్యనారాయణ, జెర్రిపోతుల అంజిని నేలకొండపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టి.. నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన కందుల మధుతోపాటు మరో ఐదుగురిపై 341, 352, 355 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.సత్యనారాయణరెడ్డి ఆదివారం తెలిపారు. -
నేలకొండపల్లిలో విజయమ్మ మీడియా సమావేశం