కాశ్మీర్ టూ కన్యాకుమారి... కాంగ్రెస్ ఖతం
నేలకొండపల్లి: దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ గల్లంతు కావడం ఖాయమని సీపీఎం పోలిట్‌బ్యూరో మెంబర్, రాజ్యసభ సభ్యురాలు బృందా కారత్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో సోమవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్ద అవినీతి పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు.
మతోన్మాదంతో ముందుకు సాగుతున్న బీజేపీని, ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అడుగు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజలపైనే ఉందన్నారు. దేశంలో మూడోఫ్రంట్ ఏర్పాటుకు కృషి జరుగుతోందని తెలిపారు. పేదలను విస్మరించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
పేదల జీవితాలు బాగుపడాలంటే ఖమ్మం పార్లమెంట్‌కు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, పాలేరు అసెంబ్లీకి సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌ను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పాలేరు అసెంబ్లీ అభ్యర్థి పోతినేని సుదర్శన్, వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు కోటి సైదారెడ్డి, సీపీఎం డివిజన్ కార్యదర్శి బత్తుల లెనిన్, ఐద్వా జిల్లా నాయకురాలు బుగ్గవీటి సరళ, డివిజన్ కార్యదర్శి సిరికొండ ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.