సాయిచంద్ (ఫైల్)
నేలకొండపల్లి: ‘నా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలి, నేను బతికి బాధలు భరించలేను’అని ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన గోరెంట్ల సాయిచంద్(17) అనే బాలుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఓ వీడియోను మూడు రోజుల కిందట సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆదివారం కలిసిన విలేకరుల ఎదుట తన గోడు వెలిబుచ్చాడు. నేలకొండపల్లికి చెందిన గోరంట్ల సుజాత చెరువుమాదారం పాఠశాలలో అటెండర్.
సాయిచంద్, సాయి ప్రత్యూష ఆమె సంతానం. సాయి ప్రత్యూషను 2014 లో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన గుండా గోపి అనే వ్యక్తికిచ్చి వివాహం జరిపించారు. కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం ఇబ్బంది పెట్టడమే కాకుండా, ‘నువ్వు చనిపోతే ఆ ఉద్యోగం నా భార్యకు వస్తుంది’అంటూ సుజాతను వేధించేవాడు. ఈ క్రమంలో 2020లో అనారోగ్యానికి గురైన సుజాత హుజూర్‌నగర్‌లోని కూతురు ఇంట మృతి చెందింది. అయితే, ఆమె కరోనాతో చనిపోయిందని కూతురు, అల్లుడు అంటుండగా, ఆ మృతిపైన అనుమానాలు ఉన్నాయని, అక్కకు ఉద్యోగం కోసమే చంపి ఉంటారని ఆ బాలుడు ఆరోపిస్తున్నాడు.
ఇదే విషయమై నిలదీస్తే తనను కూడా చంపేస్తానని బావ బెదిరిస్తున్నాడని, తన ఇంటి తాళాలు పగులగొట్టి సర్టిఫికెట్లు, డబ్బు, బంగారు వస్తువులు తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అక్క అత్తారింటివారు కూడా వేధిస్తున్నారని, ఇన్ని బాధలు భరించలేనని, చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని ఖమ్మం, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్, జగదీష్‌రెడ్డిలను వేడుకుంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తనకు మతిస్థిమితంలేదని ప్రచారం చేస్తున్నారని, ఆత్మహత్య చేసుకునే ధైర్యం తనకు లేదని, అందుకే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఆ బాలుడు కోరాడు. అక్కాబావలపై చర్యలు తీసుకోవాలని, వచ్చే జన్మలోనైనా మంచి కుటుంబంతో బతకాలని ఉందని పేర్కొన్నాడు.
తమ్ముడిని తప్పుదారి పట్టిస్తున్నారు: సాయి ప్రత్యూష, సోదరి
తల్లి మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని, ఆమె మృతికి సంబంధించిన రిపోర్టులు కూడా ఉన్నాయని సాయిచంద్ సోదరి సాయిప్రత్యూష ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ్ముడి వీడియో సోషల్ మీడియాలో చూసి ఆందోళన చెందానని, కొందరు అతడిని తప్పుదారి పట్టిస్తున్నారని, వారిపై ఇప్పటికే నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment