సాక్షి, నేలకొండపల్లి: విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఒకరు స్థలం దానంగా ఇవ్వగా, నేతలు, అధికారులు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నెరవేరకపోవడంతో ఆ దాత వినూత్నంగా నిరసనకు దిగాడు. దీంతో, అతడి నిరసన.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామానికి 2014లో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరైంది. గ్రామానికి చెందిన రైతు ఆకుల నరసింహారావు 12 గుంటల భూమి ఇచ్చాడు. అప్పుడు సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా ఉద్యోగం ఇస్తామని చెప్పినా, హామీ నెరవేరకున్నా పైసా జీతం లేకుండా పనిచేశాడు. గతంలో పలుమార్లు నిరసన తెలిపినా, ఆత్మహత్యయత్నానికి పాల్పడినా సమస్య పరిష్కారం కాలేదు.
దీంతో, విసుగు చెందాడు ఈ క్రమంలో బుధవారం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన నరసింహారావు.. సబ్‌స్టేషన్ అమ్ముతున్నందున కావాల్సిన వారు తనను సంప్రదించాలని కోరాడు. ఈ విషయమై ఆయనతో మాట్లాడగా ఉద్యోగమైనా ఇవ్వాలని, లేకపోతే ఎకరం భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై అధికారులు ఇంకా స్పందించలేదు.
ఇది కూడా చదవండి: రీసేల్.. రివర్స్
Comments
Please login to add a commentAdd a comment