
దమ్మపేట: ప్రజలు ఆశీర్వదించి తమను అధికారంలోకి తీసుకొస్తే భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ఫైల్‌పైనే తొలి సంతకం చేస్తానని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మంగళవారం ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. అప్పారావుపేట గ్రామంలో జరిగిన ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’లో పాల్గొన్న షర్మిల తొలుత ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ 2008లో ఓకేసారి 50వేల టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించిన ఘనత వైఎస్‌ఆర్‌కి మాత్రమే దక్కిందని గుర్తు చేశారు. రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల సమయంలో ప్రకటించిన కేసీఆర్ ఆ తరువాత విస్మరించారని, పోరాడి సాధించిన తెలంగాణలో ఉపాధి లభించక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆయన చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. తమ పోరాట ఫలితంగా ఇటీవల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ఖాళీలన్నీ భర్తీ చేసే వరకు తమ దీక్షలు కొనసాగుతాయని షర్మిల స్పష్టం చేశారు.