మళ్లీ సింగరేణి రైలు కూత | Singareni Passenger Service Restoration In Bhadradri Kothagudem | Sakshi
Sakshi News home page

మళ్లీ సింగరేణి రైలు కూత

Published Tue, Oct 1 2019 10:59 AM | Last Updated on Tue, Oct 1 2019 10:59 AM

Singareni Passenger Service Restoration In Bhadradri Kothagudem - Sakshi

సాక్షి, కొత్తగూడెం అర్బన్‌: దశాబ్దాల పాటు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చిన సింగరేణి ప్యాసింజర్‌ రైలు సర్వీసు తిరిగి ప్రారంభం కాబోతోంది. ఏడు నెలల సుదీర్ఘ పోరాటం అనంతరం ఫలితం లభించింది. 60 ఏళ్ల చరిత్ర ఉన్న రైలును వ్యయం తగ్గించే కార్యాచరణలో భాగంగా రద్దు చేశారు. దాని స్థానంలో పుష్‌ఫుల్‌ రైలును ప్రారంభించారు. నూతన రైలులో కొత్తగూడెం నుంచి సిర్పూర్‌కాగజ్‌నగర్‌ వరకు ఉన్న ప్రయాణికులు దాదాపు ఏడు నెలల పాటు అష్టకష్టాలు పడ్డారు. భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్‌కు వచ్చిన రైల్వే అధికారులకు వినతులు ఇచ్చి, సింగరేణి రైలును పున:ప్రారంభించాలని కోరారు.

కొత్తగూడెంలో అన్ని పార్టీల వారు అఖిలపక్షంగా ఏర్పడి దీక్షలు, ఐక్య ఉద్యమాలు చేపట్టారు. అందరి పోరాట ఫలితంగా సింగరేణి ప్యాసింజర్‌ రైలును పునఃప్రారంభించడానికి రైల్వే అధికారులు ఎట్టకేలకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. సింగరేణి ప్రాంతాలను కలుపుకుంటూ వెళ్లే సింగరేణి ప్యాసింజర్‌ రైలులో ఎక్కువగా సింగరేణి కార్మిక కుటుంబాలు, ఆయా ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే రైతుల కుటుంబాలు ప్రయాణం చేస్తుంటాయి. ఈ నెల 6వ తేదీ నుంచి భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ స్టేషన్‌ వరకు పాత సింగరేణి ప్యాసింజర్‌ ప్రారంభం కానుంది. దసరా కానుకగా అంతా భావిస్తున్నారు. గతంలో మాదిరిగానే 14 కోచ్‌లతో నడువనుంది. ప్రతి కోచ్‌కు బాత్రూంలు, ప్రయాణికుల సామగ్రిని పెట్టుకోవడానికి సదుపాయం ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.

14కోచ్‌లతో రైలు సర్వీసు 
ఈ నెల 6వ తేది నుంచి భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ వరకు సింగరేణి ప్యాసింజర్‌ రైలు పునఃప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో నడిచిన విధంగానే 14 కోచ్‌లతో నడువనుంది. సమయాల్లో ఏ మార్పులూ ఉండవు. 
– కిరణ్‌కుమార్,  భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌

చాలా సంతోషంగా ఉంది..
కొత్తగూడెంలోని ప్రజలు, ప్రయాణికులు ఎన్నో పోరాటాలు చేసి సింగరేణి ప్యాసింజర్‌ రైలును తిరిగి తెప్పించుకోగలిగారు. అన్నీ పార్టీల వారు పోరాడారు.  
– కలవల చంద్రశేఖర్‌

పుష్‌పుల్‌లో ఒక్క బాత్రూమే.. 
సింగరేణి ప్యాసింజర్‌ రైలు స్థానంలో పుష్‌ఫుల్‌ రైలు తిప్పగా..బాత్రూంలు లేక మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రైలులో ఉన్న ఒక్క బాత్రూం వద్ద తీవ్ర దుర్వాసన వచ్చేది.  
–భూక్య హుస్సేన్, తడికలపూడి

ఏడు నెలలు ఇటు రాలే.. 
భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్‌ నుంచి పుష్‌ఫుల్‌ రైలు ప్రారంభం అయినప్పటి నుంచి ఆ రైలులో ప్రయాణించడం బంద్‌ చేశాం. వారానికి ఒక్క సారి పెద్దపల్లికి బస్సులోనే పోయాం.  
– రవి, రుద్రంపూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement