kothagudem station
-
మళ్లీ సింగరేణి రైలు కూత
సాక్షి, కొత్తగూడెం అర్బన్: దశాబ్దాల పాటు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చిన సింగరేణి ప్యాసింజర్ రైలు సర్వీసు తిరిగి ప్రారంభం కాబోతోంది. ఏడు నెలల సుదీర్ఘ పోరాటం అనంతరం ఫలితం లభించింది. 60 ఏళ్ల చరిత్ర ఉన్న రైలును వ్యయం తగ్గించే కార్యాచరణలో భాగంగా రద్దు చేశారు. దాని స్థానంలో పుష్ఫుల్ రైలును ప్రారంభించారు. నూతన రైలులో కొత్తగూడెం నుంచి సిర్పూర్కాగజ్నగర్ వరకు ఉన్న ప్రయాణికులు దాదాపు ఏడు నెలల పాటు అష్టకష్టాలు పడ్డారు. భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్‌కు వచ్చిన రైల్వే అధికారులకు వినతులు ఇచ్చి, సింగరేణి రైలును పున:ప్రారంభించాలని కోరారు. కొత్తగూడెంలో అన్ని పార్టీల వారు అఖిలపక్షంగా ఏర్పడి దీక్షలు, ఐక్య ఉద్యమాలు చేపట్టారు. అందరి పోరాట ఫలితంగా సింగరేణి ప్యాసింజర్ రైలును పునఃప్రారంభించడానికి రైల్వే అధికారులు ఎట్టకేలకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. సింగరేణి ప్రాంతాలను కలుపుకుంటూ వెళ్లే సింగరేణి ప్యాసింజర్ రైలులో ఎక్కువగా సింగరేణి కార్మిక కుటుంబాలు, ఆయా ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే రైతుల కుటుంబాలు ప్రయాణం చేస్తుంటాయి. ఈ నెల 6వ తేదీ నుంచి భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్ వరకు పాత సింగరేణి ప్యాసింజర్ ప్రారంభం కానుంది. దసరా కానుకగా అంతా భావిస్తున్నారు. గతంలో మాదిరిగానే 14 కోచ్‌లతో నడువనుంది. ప్రతి కోచ్‌కు బాత్రూంలు, ప్రయాణికుల సామగ్రిని పెట్టుకోవడానికి సదుపాయం ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. 14కోచ్‌లతో రైలు సర్వీసు ఈ నెల 6వ తేది నుంచి భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు సింగరేణి ప్యాసింజర్ రైలు పునఃప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో నడిచిన విధంగానే 14 కోచ్‌లతో నడువనుంది. సమయాల్లో ఏ మార్పులూ ఉండవు. – కిరణ్‌కుమార్, భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చాలా సంతోషంగా ఉంది.. కొత్తగూడెంలోని ప్రజలు, ప్రయాణికులు ఎన్నో పోరాటాలు చేసి సింగరేణి ప్యాసింజర్ రైలును తిరిగి తెప్పించుకోగలిగారు. అన్నీ పార్టీల వారు పోరాడారు. – కలవల చంద్రశేఖర్ పుష్పుల్లో ఒక్క బాత్రూమే.. సింగరేణి ప్యాసింజర్ రైలు స్థానంలో పుష్ఫుల్ రైలు తిప్పగా..బాత్రూంలు లేక మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రైలులో ఉన్న ఒక్క బాత్రూం వద్ద తీవ్ర దుర్వాసన వచ్చేది. –భూక్య హుస్సేన్, తడికలపూడి ఏడు నెలలు ఇటు రాలే.. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి పుష్ఫుల్ రైలు ప్రారంభం అయినప్పటి నుంచి ఆ రైలులో ప్రయాణించడం బంద్ చేశాం. వారానికి ఒక్క సారి పెద్దపల్లికి బస్సులోనే పోయాం. – రవి, రుద్రంపూర్ -
మణుగూరు ఎక్స్‌ప్రెస్ బోగీల్లో మంటలు
కొత్తగూడెం : మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీ బోగిల్లో సోమవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో ప్రయాణికులు బెంబేలెత్తి పోయారు. షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. మణుగూరు నుంచి సికింద్రాబాద్ వెళుతున్న మణుగూరు ఎక్స్‌ప్రెస్ భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్లో రాత్రి 10:40 సమయంలో ఆగింది. మరికొన్ని నిమిషాల్లో సికింద్రాబాద్ బయల్దేరే క్రమంలో షార్ట్ సర్క్యూట్ వల్ల రైలులోని ఏ1, బీ1 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో స్టేషన్ ప్లాట్ ఫాంపైకి ఉరుకులు పరుగులు తీశారు. మిగతా బోగీల్లోని వారు కూడా ఏం జరిగిందో అర్థంకాక స్టేషన్లోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో స్టేషన్ ప్రాంగణం పూర్తిగా దట్టమైన పొగ కమ్ముకోవడంతో అంతా భయాందోళన చెందారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు ఏసీ బోగీల అద్దాలను పగులగొట్టి మంటలను అదుపు చేశారు. రాత్రి 11:30 వరకు కూడా మరమ్మతులు కొనసాగుతున్నాయి. అంతా సవ్యంగానే ఉంటే.. రైలు బయల్దేరుతుందని, లేకుంటే.. ఆ రెండు బోగీలను తొలగించి పంపించనున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. -
అయ్యో.. ఆమెకెంత కష్టం
చుంచుపల్లి (కొత్తగూడెం): బతుకుదెరువు కోసం ఊరుకాని ఊరుకు వచ్చారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ పరిసరాలే వీరి నివాసం. కూలీనాలి చేసుకు ంటూ పొట్టపోసుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆ మహిళకు పెద్ద కష్టం వచ్చిపడింది. మూడు రోజల క్రితం వడదెబ్బకు గురైన భర్త గురువారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. దీంతో సాయంత్రం ఆరు గంటల వరకు రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే భర్త మృతదేహంతో ఆ అభాగ్యురాలు విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. ఈ హృదయ విదారక ఘటన భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెంలో చోటు చేసుకుంది. బిహార్ రాష్ట్రంలోని కఠోర్ జిల్లాకు చెందిన ఖలీల్, మిమ్మి దంపతులు కొంతకాలంగా కొత్తగూడెంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాత్రికి స్టేషన్ పరిసరాల్లోనే నిద్రించేవారు. ఇటీవల భారీగా పెరిగిన ఎండలతో ఖలీల్ అస్వస్థతకు గురై మూడు రోజులుగా అన్నపానీయాలు మానేశాడు. ఆరోగ్యం క్షీణించి గురువారం తెల్లవారు జామున మృతిచెందాడు. దీంతో మిమ్మి బిక్కుబిక్కుమంటూ భర్త శవం వద్ద రోదిస్తూ కూర్చుంది. 43 డిగ్రీల ఎండలోనూ ఆమె శవం వద్ద నుంచి కదలలేదు. ఎవరు ఎంత చెప్పినా వినకుండా అక్కడే రోదిస్తూ ఉండిపోయింది. ఖలీల్ కుటుంబానికి కొత్తగూడెంలో ఎవరూ లేకపోవడంతో సాయంత్రం 6 గంటల సమయంలో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. శుక్రవారం మున్సిపల్ సిబ్బందితో అంత్యక్రియలు చేయిస్తామని తెలిపారు. కాగా, మిమ్మి దీనావస్థను చూసిన స్థానిక ఆటోడ్రైవర్లు ఆమెకు రూ.3,500 ఆర్థిక సహాయం అందించారు. ఖలీల్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆమెను బిహార్‌లోని వారి బంధువుల వద్దకు తరలిస్తామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. -
గోదావరి పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
కొత్తగూడెం: గోదావరి పుష్కరాలకు ప్రయూణికుల సౌకర్యార్థం ప్రత్యేకరైళ్లు నడపనున్నట్లు రైల్వే జీఎం శ్రీవాత్సవ తెలి పారు శుక్రవారం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్‌కు వచ్చి తనిఖీలు నిర్వహించి మాట్లాడారు. భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్‌కు ఆర్టీసీ బస్సులు వచ్చివెళ్లే విధం గా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పుష్కరాలకు ప్రయూణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైళ్ల రాకపోకలు ఎక్కువగా అవకాశం ఉన్న నేపథ్యంలో మూడో ప్లాట్‌ఫామ్‌నూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైల్వేస్టేషన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రైళ్లు, బస్సుల వివరాలు తెలియజేస్తామన్నారు. తొలుత రైల్వేస్టేషన్లో జీఆర్పీఎఫ్ పోలీస్‌స్టేషన్, సోలార్‌పవర్‌ప్లాంట్, కమ్యూనిటీహాల్‌ను ప్రారంభించారు. రైల్వేఆస్పత్రిలో వైద్యసేవల గురించి ఆరా తీశారు. ఎమ్మెల్యే, పార్లమెంట్ కార్యదర్శి జలగం వెంకట్రావ్ రైల్వేజీఎంను కలిశారు