అయ్యో.. ఆమెకెంత కష్టం  | Wait 15 hours husband funeral his wife | Sakshi
Sakshi News home page

అయ్యో.. ఆమెకెంత కష్టం 

Published Fri, Apr 19 2019 1:28 AM | Last Updated on Fri, Apr 19 2019 1:28 AM

Wait 15 hours husband funeral his wife - Sakshi

చుంచుపల్లి (కొత్తగూడెం): బతుకుదెరువు కోసం ఊరుకాని ఊరుకు వచ్చారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ పరిసరాలే వీరి నివాసం. కూలీనాలి చేసుకు ంటూ పొట్టపోసుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆ మహిళకు పెద్ద కష్టం వచ్చిపడింది. మూడు రోజల క్రితం వడదెబ్బకు గురైన భర్త గురువారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. దీంతో సాయంత్రం ఆరు గంటల వరకు రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలోనే భర్త మృతదేహంతో ఆ అభాగ్యురాలు విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. ఈ హృదయ విదారక ఘటన భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెంలో చోటు చేసుకుంది. బిహార్‌ రాష్ట్రంలోని కఠోర్‌ జిల్లాకు చెందిన ఖలీల్, మిమ్మి దంపతులు కొంతకాలంగా కొత్తగూడెంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

రాత్రికి స్టేషన్‌ పరిసరాల్లోనే నిద్రించేవారు. ఇటీవల భారీగా పెరిగిన ఎండలతో ఖలీల్‌ అస్వస్థతకు గురై మూడు రోజులుగా అన్నపానీయాలు మానేశాడు. ఆరోగ్యం క్షీణించి గురువారం తెల్లవారు జామున మృతిచెందాడు. దీంతో మిమ్మి బిక్కుబిక్కుమంటూ భర్త శవం వద్ద రోదిస్తూ కూర్చుంది. 43 డిగ్రీల ఎండలోనూ ఆమె శవం వద్ద నుంచి కదలలేదు. ఎవరు ఎంత చెప్పినా వినకుండా అక్కడే రోదిస్తూ ఉండిపోయింది. ఖలీల్‌ కుటుంబానికి కొత్తగూడెంలో ఎవరూ లేకపోవడంతో సాయంత్రం 6 గంటల సమయంలో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. శుక్రవారం మున్సిపల్‌ సిబ్బందితో అంత్యక్రియలు చేయిస్తామని తెలిపారు. కాగా, మిమ్మి దీనావస్థను చూసిన స్థానిక ఆటోడ్రైవర్లు ఆమెకు రూ.3,500 ఆర్థిక సహాయం అందించారు. ఖలీల్‌ అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆమెను బిహార్‌లోని వారి బంధువుల వద్దకు తరలిస్తామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement