బోగీల్లో చెలరేగిన మంటలు
కొత్తగూడెం : మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీ బోగిల్లో సోమవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో ప్రయాణికులు బెంబేలెత్తి పోయారు. షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. మణుగూరు నుంచి సికింద్రాబాద్ వెళుతున్న మణుగూరు ఎక్స్‌ప్రెస్ భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్‌లో రాత్రి 10:40 సమయంలో ఆగింది. మరికొన్ని నిమిషాల్లో సికింద్రాబాద్ బయల్దేరే క్రమంలో షార్ట్ సర్క్యూట్ వల్ల రైలులోని ఏ1, బీ1 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి.
దీంతో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో స్టేషన్ ప్లాట్ ఫాంపైకి ఉరుకులు పరుగులు తీశారు. మిగతా బోగీల్లోని వారు కూడా ఏం జరిగిందో అర్థంకాక స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో స్టేషన్ ప్రాంగణం పూర్తిగా దట్టమైన పొగ కమ్ముకోవడంతో అంతా భయాందోళన చెందారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు ఏసీ బోగీల అద్దాలను పగులగొట్టి మంటలను అదుపు చేశారు. రాత్రి 11:30 వరకు కూడా మరమ్మతులు కొనసాగుతున్నాయి. అంతా సవ్యంగానే ఉంటే.. రైలు బయల్దేరుతుందని, లేకుంటే.. ఆ రెండు బోగీలను తొలగించి పంపించనున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment