Nurse Tejavath Susheela First In Telangana To Receive 'National Florence Nightingale Award' - Sakshi
Sakshi News home page

Tejavath Susheela: అడవి బిడ్డల ఆత్మీయ నేస్తం... తేజావత్‌ సుశీల

Published Fri, Jun 23 2023 11:09 AM

Nurse Tejavath Susheela First In Telangana To Receive National Florence Nightingale Award - Sakshi

వృత్తే దైవంగా,సేవే పరమార్థంగా భావించిన తేజావత్‌ సుశీలకు ఈ యేడాది ప్రతిష్టాత్మక ‘ఫ్లారెన్స్‌ నైటింగేల్‌’ అవార్డు దక్కింది.తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట ప్రాథమిక వైద్యశాలలోఏఎన్‌ఎంగా సేవలందిస్తున్న సుశీల గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా 27 ఏళ్ల తన కెరీర్‌ గురించి సుశీల ‘సాక్షి’తో పంచుకున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన తేజావత్‌ సుశీల జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా నర్సులు చేస్తున్న ఉత్తమ సేవలకుగాను జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డులను ఏటా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2022, 2023 సంవత్సరాలకుగాను జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించారు. ఇందులో 2022కుగాను ఏఎన్‌ఎమ్‌ కేటగిరీలో తెలంగాణకు చెందిన నర్సు తేజావత్‌ సుశీల రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట సమీపంలో కనీసం రహదారి సదుపాయం కూడా లేని మారుమూల ప్రాంతంలో ఉండే గుత్తికోయలకు అందించిన సేవలకు గుర్తుగా నైటింగేల్‌ అవార్డును అందించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 1973 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 614 మంది నర్సులు ఉత్తమ నర్సులకు నైటింగేల్‌ అవార్డులు అందుకున్నారని కేంద్రం తెలిపింది. 

‘‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోని వీ వెంకటాయపాలెం అనే గ్రామం మా సొంతూరు. 1996లో ఏఎన్‌ఎంగా తొలి పోస్టింగ్‌ మణుగూరులో వచ్చింది.  ఆ తర్వాత సుజాతనగర్‌లో కొన్నాళ్లు పని చేశాను. 2010 నుంచి ఏజెన్సీ ప్రాంతమైన ఎర్రగుంట పీహెచ్‌సీలో పని చేస్తున్నాను. 27 ఏళ్ల కెరీర్‌లో పనిలోనే సంతృప్తి వెతుక్కుంటూ వస్తున్నాను. మా ఇల్లు, నాకు కేటాయించిన గ్రామాలు తప్ప పెద్దగా బయటకి పోయిందీ లేదు. హైదరాబాద్‌కు కూడా వెళ్లడం తక్కువే. చదువుకునేప్పటి నుంచి ఈ రోజు వరకు... ఏనాటికైనా ఢిల్లీని చూస్తానా అనుకునేదాన్ని. కానీ  ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌ వరకు నా ప్రయాణం ఉంటుందని అనుకోలేదు. దేశ ప్రథమ మహిళ చేతుల మీదుగా అవార్డు అందుకున్న క్షణాలు 
మరువలేనివి. 

రెండు ప్రయాణాలు
2010 సమయంలో ఛత్తీస్‌గడ్‌ నుంచి గుత్తి కోయలు తెలంగాణకు రావడం ఎక్కువైంది. నా పీహెచ్‌సీ పరిధిలో మద్దుకూరు సమీపంలో గుత్తికోయలు వచ్చి మంగళబోడు పేరుతో ఓ గూడెం ఏర్పాటు చేసుకున్నట్టు అక్కడి సర్పంచ్‌ చెప్పాడు. ఆ గ్రామానికి తొలిసారి వెళ్లినప్పుడు ఎవ్వరూ పలకరించలేదు. నేనే చొరవ తీసుకుని అన్ని ఇళ్లలోకి తలుపులు తీసుకుని వెళ్లాను. ఓ ఇంట్లో ఓ మహిళ అచేతనంగా పడుకుని ఉంది. పదిహేను రోజుల కిందటే ప్రసవం జరిగిందని చెప్పారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మనిషి నీరసించిపోయి ఉంది. ఒళ్లంతా ఉబ్బిపోయి ఉంది. వెంటనే ఆ గ్రామ సర్పంచ్‌ను బతిమాలి ఓ సైకిల్‌ ఏర్పాటు చేసి అడవి నుంచి మద్దుకూరు వరకు తీసుకొచ్చాను. అక్కడి నుంచి ఆటోలో కొత్తగూడెం ఆస్పత్రికి వచ్చాం. పరిస్థితి విషమించడంతో వరంగల్‌ తీసుకెళ్లాలని సూచించారు. 108లో ఆమెను వెంటబెట్టుకుని వరంగల్‌కు తీసుకెళ్లాను. 21 రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత ఆ తల్లిబిడ్డలు ఇద్దరూ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత అక్కడున్న వలస గుత్తి కోయలకు నాపై నమ్మకం కలిగింది. ఏదైనా సమస్య ఉంటే సంకోచం లేకుండా చెప్పుకోవడం మొదలు పెట్టారు.

రక్తం కోసం బతిమాలాను
ఓసారి గుత్తికోయగూడెం వెళ్లినప్పుడు పిల్లలందరూ నా దగ్గరకు వచ్చారు కానీ జెమిలీ అనే ఏడేళ్ల బాలిక రాలేదు. ఏమైందా అని ఆరా తీస్తూ ఆ పాప ఇంట్లోకి వెళ్లాను. నేలపై స్పృహ లేని స్థితిలో ఆ పాప పడుకుని ఉంది. బ్లడ్‌ శాంపిల్‌ తీసుకుని టెస్ట్‌ చేస్తే మలేరియా పాజిటివ్‌గా తేలింది. వెంటనే పీహెచ్‌సీకి అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకువస్తే పాప పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెప్పారు. ఖమ్మం తీసుకెళ్లమన్నారు. ఆక్కడకు వెళ్తే వరంగల్‌ పొమ్మన్నారు. కానీ డాక్టర్లను బతిమాలి అక్కడే వైద్యం చేయమన్నాను. ఆ పాపది ఓ-నెగెటివ్‌ గ్రూప్‌ రక్తం కావడంతో చాలా మందికి ఫోన్లు చేసి బతిమాలి రెండు యూనిట్ల రక్తం సంపాదించగలిగాను. చివరకు ఆ పాప ప్రాణాలు దక్కాయి. మరోసారి ఓ గ్రామంలో ఓ బాలింత చంటిపిల్లకు ఒకవైపు రొమ్ము పాలే పట్టిస్తూ రెండో రొమ్ముకు పాలిచ్చేందుకు తంటాలు పడుతున్నట్టు గమనించాను. వెంటనే ఇన్‌ఫెక్షన్‌ గుర్తించి ఆస్పత్రికి తరలించాను.

అర్థం చేసుకోవాలి
మైదానం  ప్రాంత ప్రజలకు ఒకటికి రెండు సార్లు చెబితే అర్థం చేసుకుంటారు. వారికి రవాణా సదుపాయం కూడా బాగుంటుంది. కానీ వలస ఆదివాసీల గుత్తికోయల గూడేల్లో పరిస్థితి అలా ఉండదు. ముందుగా వారిలో కలిసిపోవాలి. ఆ తర్వాత అక్కడి మహిళలను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే భర్త/తండ్రి తోడు రావాలి. వాళ్లు పనులకు వెళితే సాయంత్రం కానీ రారు. వచ్చే వరకు ఎదురు చూడాలి. వచ్చినా పనులు వదిలి ఆస్పత్రికి వచ్చేందుకు సుముఖంగా ఉండరు. ఆస్పత్రి కోసం పని వదులుకుంటే ఇంట్లో తిండికి కష్టం. అన్నింటికీ ఒప్పుకున్నా.... ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే అడవుల్లో ఉండే గుత్తికోయ గ్రామాలకు రవాణా కష్టం. క్షేత్రస్థాయిలో ఉండే ఈ సమస్యలను అర్థం చేసుకుంటే అత్యుత్తమంగా వైద్య సేవలు అందించే వీలుంటుంది.

కోవిడ్‌ సమయంలో
మద్దుకూరు, దామరచర్ల, సీతాయిగూడెం గ్రామాలు నా పరిధిలో ఉండేవి. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో ఈ మూడు గ్రామాల్లో కలిపి ఓకేసారి 120 మందిని ఐసోలేçషన్‌లో ఉంచాను. ఇదే సమయంలో మా ఇంట్లో నలుగురికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రాణనష్టం రాకుండా సేవలు అందించాను. నా పరిధిలో ఉన్న గ్రామాల్లో ఏ ఒక్కరూ కోవిడ్‌తో ఇంట్లో చనిపోలేదు.

వారి సహకారం వల్లే
వృత్తిలో మనం చూపించే నిబద్ధతను బట్టి మనకంటూ ఓ గుర్తింపు వస్తుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకప్పుడు అర్థరాత్రి ఫోన్‌ చేసినా డాక్టర్లు లిఫ్ట్‌ చేసి అప్పటికప్పుడు సలహాలు ఇస్తారు. అవసరాన్ని బట్టి హాస్పిటల్‌కు వచ్చి కేస్‌ అటెండ్‌ చేస్తారు. అదే విధంగా నాతో పాటు పని చేసే ఇతర సిబ్బంది పూర్తి సహకారం అందిస్తారు. ఇక ఆశా వర్కర్లు అయితే నా వెన్నంటే ఉంటారు. ఏదైనా పని చెబితే కొంత ఆలçస్యమైనా ఆ పని పూర్తి చేస్తారు. వీరందరి సహకారం వల్లే నేను ఉత్తమ స్థాయిలో సేవలు అందించగలిగాను. ఈ రోజు నాకు దక్కిన గుర్తింపుకు డాక్టర్ల నుంచి ఆశావర్కర్ల వరకు అందరి సహకారం ఉంది’’ అని వివరించారు సుశీల.


– తాండ్ర కృష్ణగోవింద్
 సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం 

Advertisement
 
Advertisement
 
Advertisement