
భద్రాద్రి జిల్లా పార్కలగండిలో దెబ్బతిన్న అరటిపంటను పరిశీలిస్తున్న షర్మిల
దమ్మపేట: అకాల వర్షాలు, ఈదురుగాలులతో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదు కోవాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో కొనసాగింది. యాత్రలో భాగంగా పార్కలగండికి వెళ్లారు. అక్కడ ఆదివారంరాత్రి తీవ్రమైన గాలులు, వర్షం వల్ల నష్టపోయిన అరటి, మామిడి, నిమ్మ పంటలను పరిశీలించారు.
రాష్ట్రంలో ఎక్కడ పంట నష్టం జరిగినా పట్టించుకోని సీఎం కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రైతే రాజని మాట్లాడుతున్న పాలకులు వారిని ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. రాజన్న రాజ్యం తీసుకురావడ మే లక్ష్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించానని తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తే మెరుగైన సంక్షేమ పాలన తీసుకొస్తానన్నారు. అనంతరం అగ్రిగోల్డ్ బాధితులు షర్మిలను కలసి తమ డిపాజిట్ సొమ్ము ఇప్పించాలని కోరగా, తాను అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీపీ నేతలు సోయం వీరభద్రం, పి.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment