సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఈ స్థాయిలో వరదలు వస్తాయని ఎవరూ ఊహించలేదని.. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతిలో వరదలు సృష్టిస్తున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో కశ్మీర్, లేహ్ వద్ద ఇలాంటి కుట్రలు జరిగినట్లు వార్తలొచ్చాయన్నారు. ఇతర దేశాలు క్లౌడ్ బరస్ట్‌తో ఇలాంటి కుట్రలు చేస్తున్నాయనే చర్చ ఉందన్నారు. గోదావరి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగినట్లు అనుమానం ఉందన్నారు. దీనిపై నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.
చదవండి: తగ్గేదేలే.. ఎవరికి వారే.. అటు గవర్నర్.. ఇటు కేసీఆర్ పోటాపోటీగా..
కాగా, వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించారు. భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ముంపు బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి సీఎం ఆరా తీశారు.
వారిని పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు. భద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ప్రతిసారి ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం అన్నారు.
శాశ్వత ప్రాతిపదికన కాలనీల నిర్మాణం:
తరచుగా వరదల్లో మునిగిపోతున్న భద్రాచలం వాసుల కన్నీళ్లను తుడిచేందుకు సీఎం కేసీఆర్ వారికి శాశ్వత ప్రాతిపదికన నివాసాల కోసం కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. వరద చేరని ఎత్తైన ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను సీఎం ఆదేశించారు. తమకు శాశ్వత ప్రాతిపదికన రిలీఫ్ దొరకుతుండటంతో పునరావాస కేంద్రాల్లోని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment