మాకు న్యాయం చేయాలి | Bhadrachalam Residents Protest Against Recurring Floods Problem | Sakshi
Sakshi News home page

మాకు న్యాయం చేయాలి

Published Sun, Jul 17 2022 1:16 AM | Last Updated on Sun, Jul 17 2022 1:16 AM

Bhadrachalam Residents Protest Against Recurring Floods Problem - Sakshi

దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో వరదతో వచ్చిన బురదను శుభ్రం చేసుకుంటున్న బాధితులు 

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తీరం వెంట ఉన్న పట్టణాలు, గ్రామాలను గడగడలాడించిన గోదావరి నెమ్మదించింది. అయితే అప్పటికే వరద తీవ్రత ధాటికి తీర ప్రాంత ప్రజలు భారీగా నష్టపోయారు. వరద వెనక్కి మళ్లితే తప్ప నష్టం ఎంతో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. సరైన సమాచారం ఇవ్వకుండా తీరని నష్టం కలిగించిన ప్రభుత్వాధికారులే తమను ఆదుకోవాలంటూ భద్రాచలంలో సుభాష్‌నగర్‌ కాలనీవాసులు శనివారం పట్టణంలో ఆందోళన నిర్వహించారు.

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్‌ హామీ ఇచ్చే వరకు కదిలేది లేదంటూ కూనవరం రోడ్డులో బైఠాయించారు. వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ జిల్లాకు వస్తుండటంతో తమను ఆదుకుంటారనే ఆశల్లో వరద బాధితులు ఉన్నారు. భద్రాచలం దగ్గర నిర్మించిన కరకట్ట ఈ కాలనీ దగ్గర ముగుస్తుంది. దీంతో వరద తీవ్రత పెరగడంతో కరకట్ట చివర నుంచి నీళ్లు సుభాష్‌ కాలనీలోకి వచ్చాయి. ముంపు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు గురువారమే ఈ కాలనీవాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఆ సమయంలో వరద 64 అడుగుల ఎత్తుకు రావొచ్చని అంచనా వేశారు. దీంతో ఈ కాలనీ ప్రజలు వరద ఎత్తును దృష్టిలో ఉంచుకుని ఇంట్లోని మంచాలు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఇతర విలువైన సామాన్లను అటక మీద పెట్టడం, తాళ్లతో కట్టి పైకప్పు వరకు చేర్చి కేవలం కట్టుబట్టలతో పునరావాస శిబిరాలకు చేరుకున్నారు. అయితే వరద ఏకంగా 71 అడుగులకు చేరుకోవడంతో సామగ్రి నీట మునిగింది. ఇక్కడ నివసిస్తున్నవారిలో అత్యధికులు రోజువారీ కూలీలే.

చనిపోతామంటూ... 
తమకు న్యాయం చేయాలంటూ సుభాష్‌నగర్‌ కాలనీవాసులు గంటల తరబడి రోడ్డుపై ధర్నా చేశారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య సైతం వీరి ఆందోళనకు మద్దతుగా నిలిచారు. ‘సర్వం కోల్పోయిన తాము బతడం దండగ’అంటూ తిరిగి వరద నీటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. తమకు న్యాయం చేయకుంటే రాజకీయ నాయకులెవరూ ఓట్లు అడిగేందుకు తమ వాడకు రావొద్దంటూ నినాదాలు చేశారు. సుభాష్‌నగర్‌ ముంపునకు గురికాకుండా కరకట్ట నిర్మాణం చేయాలని డిమాండ్‌ చేశారు.

బురద సమస్య: గోదావరి వరదనీరు వెనక్కి తగ్గగానే ముంపు ప్రాంతాలు ఎదుర్కొనే సమస్యలో బురద తొలగింపు ప్రధానమైనది. ఈ బురద కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్‌తోపాటు పదిహేను మున్సిపాలిటీల నుంచి 195 మంది పారిశుధ్య కార్మికులను భద్రాచలం ఏజెన్సీకి తరలిస్తున్నారు. వీరితో జెట్టింగ్, ఫాగింగ్‌ మెషీన్లు, బురద తొలగించే యంత్రాలను తీసుకొస్తున్నారు. అంటురోగాలు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.

నీళ్లలోనే పంటపొలాలు 
భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 53 అడుగులకు తగ్గితేనే ఏజెన్సీ ప్రాంతాలు ముంపు నుంచి బయటపడతాయి. అయితే శనివారం అర్ధరాత్రి వరకు నీటిమట్టం 60 అడుగులకుపైనే ఉంది. ముఖ్యంగా కిన్నెరసాని, గోదావరి నదులు సంగమ ప్రదేశానికి సమీపాన ఉన్న బూర్గంపాడు పూర్తిగా ముంపునకు గురైంది. ఈ మండలంలో ఏకంగా 7,955 మంది పునరావాస కేంద్రాల్లోనే మగ్గుతున్నారు. వరదనీరు వెనక్కి మళ్లితేనే ఎన్ని ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది, ఎన్ని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోయాయి, ఎంత మేర రోడ్లు కొట్టుకుపోయాయి, ఎన్ని కాజ్‌వేలు దెబ్బతిన్నాయనే విషయం తేలుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement