సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: డిమాండ్ల సాధనకు రాజకీయ పార్టీలు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త మండలాల కోసం ఉద్యమిస్తున్న ఆయా పార్టీలు, సంఘాలు ధర్నాలు, ర్యాలీలతో లాభం లేదని గ్రహించి వినూత్న పద్ధతిలో ప్రయత్నిస్తున్నాయి. ఇల్లెందు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌తో పాటు కొమరారం, బోడు కేంద్రంగా నూతన మండలాల ఏర్పాటుకోసం వామపక్షాలు, ఇతర పార్టీలు ఏళ్ల ఉద్యమిస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా సాధారణ పద్ధతుల్లోనే సంతకాల సేకరణ, ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు చేపట్టాయి. అయితే ఇందులో రాజకీయ పార్టీల నాయకులు భాగస్వాములు అవుతున్నారు తప్పితే ప్రజల భాగస్వామ్యం ఆశించిన స్థాయిలో లేదని నేతలు గ్రహించారు.
దీంతో పార్టీలు.. ప్రజలను కూడా భాగం చేసేందుకు సరికొత్త ఎత్తుగడ కింద ఆటల పోటీలను ఆయుధంగా ఎంచుకున్నాయి. ఈ క్రమంలో పురుషులకు వాలీబాల్ పోటీలు, ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాల స్థాయిలో మహిళలకు కబడ్డీ పోటీలు నిర్వహించాయి. గతంలో కూడా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆటల పోటీలు జరిగినా.. అవి ఏదైనా జాతీయ పండుగలను పురస్కరించుకుని లేదా ఆయా పార్టీలకు చెందిన నేతల స్మారకార్థం జరిగేవి. కానీ తొలిసారిగా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆటల పోటీలు నిర్వహించడం విశేషం.
2016 నుంచి డిమాండ్లు..
2016 అక్టోబర్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా విభజన సందర్భంగా ఇల్లెందు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌తో పాటు కొమరారం మండలం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను రాజకీయ పక్షాలు భుజానికి ఎత్తుకున్నాయి. సుమారు మూడు నెలల పాటు వివిధ రాజకీయ పక్షాలు ఆందోళనలు, నిరసనలు నిర్వహించాయి. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. అయితే, ఈ డిమాండ్లపై ప్రభుత్వం సర్వే నిర్వహించింది తప్పితే ఎలాంటి పురోగతి లేదు. ఆ తర్వాత కాలంలో ఏజెన్సీ ప్రాంతమైన టేకులపల్లి మండలాన్ని విభజించి బోడు కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు అంశం కూడా తెరపైకి వచ్చింది.
మలి దశలో ఉద్యమం తీరుతెన్నులు
ఈ ఏడాది జనవరిలో ఇల్లెందు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం, సంతకాల సేకరణ, ఇతర రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు.
ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు నెలపాటు ప్రజాపంథా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు.
మార్చి 4 నుంచి 12 వరకు ఇల్లెందు మండలం మర్రిగూడెం నుంచి ఇల్లెందు వరకు 32 కిలోమీటర్లు సీపీఐ (ఎంఎల్) – న్యూడెమొక్రసీ ఆధ్వర్యాన పాదయాత్ర చేపట్టారు.
మార్చి 28, 29వ తేదీల్లో పురుషులకు మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు.
ఈనెల 1, 2వ తేదీల్లో ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాల స్థాయిలో మహిళలకు కబడ్టీ పోటీలు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment