భద్రాద్రి కొత్తగూడెం: టిక్‌టాక్ పుణ్యమాని రెండేళ్ల క్రితం తప్పిపోయిన బధిరుడు సొంతింటికి చేరుకున్నాడు. జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం పినపాక పట్టీనగర్ గ్రామానికి చెందిన రొడ్డం వెంకటేశ్వర్లు రెండేళ్ల క్రితం కూలి పనుల నిమిత్తం దగ్గరలోని పాల్వంచ పట్టణానికి వెళ్లాడు. తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతని ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో అదే గ్రామానికి కలసాని నాగేందర్ అనే వ్యక్తి ఇటీవల టిక్‌టాక్ వీడియోలు చూస్తుండగా ఓ వీడియోలో వెంకటేశ్వర్లు కనిపించాడు. వెంటనే ఆ విషయాన్ని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు.
పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో వెంకటేశ్వర్లు పంజాబ్‌లోని లూథియానాలో ఉన్నట్టు అతని కుటుంబ సభ్యులకు తెలుసుకున్నారు. వెంకటేశ్వర్లు కుమారుడు అక్కడికి వెళ్లి స్థానిక పోలీసులను సంప్రదించాడు. వారు తన తండ్రిని అప్పగించడంతో అతణ్ని తీసుకొని మంగళవారం ఉదయం స్వగ్రామానికి చేరుకున్నాడు. వెంకటేశ్వర్లు తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆనందం వెల్లివిరిసింది. అతని ఆచూకీ పట్టించిన టిక్‌టాక్‌కు, సహకరించిన పోలీసులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఎంపీటీసీ తొటమళ్ల సరిత కలిసి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి అతడికి, అతడి భార్యకు నూతన వస్ర్తాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment