కేఎస్‌ఎం బంక్ సమీపంలో అధికారులతో వాగ్వాదానికి దిగిన స్థానికులు
పాల్వంచ: పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో ఇటీవల పలు సర్వే నంబర్లలోని భూముల స్వాధీన ప్రక్రియ వివాదాస్పదంగా మారుతోంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం పాల్వంచ పరిధిలో నిర్మిస్తున్న తరుణంలో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల రక్షణ పేరుతో రెవెన్యూ శాఖ పలు సర్వే నంబర్లలో వందలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటుండడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. రైతుల పట్టా భూములతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్న ఇళ్ల స్థలాలు సైతం ప్రభుత్వ భూమి అంటూ అధికారులు ఫెన్సింగ్ వేస్తున్నారు. బహుళ అంతస్తుల ఇళ్లు నిర్మించుకున్న వారికి సైతం నోటీసులు జారీ చేయడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రెవెన్యూ శాఖకు, ప్రజలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసు బందోబస్తు నడుమ భూముల స్వాధీన పరంపర కొనసాగిస్తున్నారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయిస్తున్నారు.
నాలుగు రోజులుగా ఉద్రిక్తత..
నవభారత్ సమీపంలోని కేఎస్‌ఎం బంక్ వెనుక భాగంలో 444/1 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి ఉందంటూ రెవెన్యూ అధికారులు 1932 సంవత్సరం నాటి నక్ష ప్రకారం సర్వే చేసి ఆరెకరాల భూమికి ఫెన్సింగ్ పనులు ప్రారంభించారు. బహుళ అంతస్తులు కట్టుకున్న సుమారు 100 మందికి సైతం ఫిబ్రవరి 3 వరకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఇందులో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న వారే ఎక్కువ. ఎస్‌ఎఫ్‌సీ వారు రుణాలు ఇచ్చేముందు ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపాలని బహిరంగ పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. కానీ అప్పుడేమీ మాట్లాడని రెవెన్యూ అధికారులు.. ఇప్పుడు ప్రభుత్వ భూములంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ గత నాలుగు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
నవభారత్ దాబాల వద్ద రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ వేసిన దృశ్యం
రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా ఓ మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమ, మంగళవారాల్లో కూడా బాధితులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. అలాగే పాల్వంచలోని కుంటినాగుల గూడెంలో 817, 842, 822, 821, 826, 835 సర్వే నంబర్లలో గిరిజన రైతులకు చెందిన సుమారు 40 ఎకరాల సాగు భూమి ఉంది. వీటిలో కొన్నింటికి 1975, 1995, 2007 సంవత్సరాల్లో సోషల్ వెల్ఫేర్ పట్టాలు ఇచ్చారు. ఇక్కడ 12 ఎకరాల వరకు స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేశారు. నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మంచికంటి నగర్, శేఖరం బంజర, పాలకోయ తండా ఏరియాల్లో సుమారు 24 ఎకరాలకు ఫెన్సింగ్ వేశారు.
సాగు భూములు అమ్ముకున్నారని...
నిరుపేద ఎస్సీ, ఎస్టీలు సాగు చేసుకుని జీవనోపాధి పొందాలంటూ గతంలో ప్రభుత్వం ఒక్కొక్కరికి ఎకరం, రెండెకరాల చొప్పున సోషల్ వెల్ఫేర్ పట్టాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ భూములు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారంటూ పలు ప్లాట్లలో నిర్మించిన బేస్ మట్టాలను తొలగించారు. మరోవైపున నవభారత్ దాబాల నుంచి అన్నపూర్ణ మెస్ వరకు రోడ్డు పొడవునా 100 ఎకరాల్లో ‘ఇవి ప్రభుత్వ భూములు’ అంటూ 22 హెచ్చరిక బోర్డులు పాతారు. నవభారత్ ఆలయం ఎదుట సర్వే నంబర్ 444లో 4.35 ఎకరాల స్థలంలో చేపట్టిన పలు నిర్మాణాలకు అనుమతి లేదంటూ కూల్చివేశారు.
లక్ష్మీదేవిపల్లి పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 60/1లో సుమారు 12 ఎకరాలు స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేశారు. ఉల్వనూరులో సుమారు 20 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. పాండురంగాపురంలో ఓ రైతుకు చెందిన ఐదెకరాల భూమి స్వాధీనం చేసుకునేందుకు యత్నించగా రైతు అడ్డుకోవడంతో తాత్కాలింగా ఆ పనులు నిలిపివేశారు. మధువన్ గార్డెన్‌కు చెందిన సర్వే నంబర్ 406/1లో సుమారు ఏడెకరాల భూమికి కూడా ఫెన్సింగ్ వేశారు. అయితే చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్‌ఏ) నుంచి అనుమతులు ఉన్నా ఫెన్సింగ్ వేశారంటూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇంకా శ్రీనివాస కాలనీ, మసీదుగుట్ట, వెంగళరావు కాలనీలోని భూములను కూడా స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది.
కోర్టును ఆశ్రయిస్తున్న బాధితులు..
రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటున్న భూములన్నీ కొత్తగూడెం – పాల్వంచ రహదారితో పాటు, ములకలపల్లి రోడ్‌లో ఉండటంతో వాటి విలువ ఇప్పుడు భారీగా పెరిగింది. ఈ భూములు దశాబ్దాల తరబడి పట్టాదారుల ఆధీనంలోనే ఉన్నాయి. అందుకు సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయి. అయినా రెవెన్యూ అధికారులు భవిష్యత్ భూ అవసరాల పేరుతో స్వాధీనం చేసుకోవడం పట్ల బాధితులు ఆందోళన చెందుతున్నారు. గ్రీవెన్స్ డేలో కలెక్టర్‌కు వందల మంది ఆర్జీలు పెట్టుకుంటున్నారు. మరి కొందరు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. 444 సర్వే నంబర్‌లోనే 32 ఫిర్యాదులు హైకోర్టులో ఉండడం గమనార్హం. ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన భూములకు రక్షణ లేకపోవడంతో కోర్టుకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులకు గురి చేస్తున్నారు
కేఎస్‌ఎం బంక్ వెనుక సర్వే నంబర్ 444/13,17,18లో అన్ని రకాల అనుమతులు ఉన్న వెంచర్‌లో దశాబ్దాల క్రితం ప్లాట్లు కొనుగోలు చేశాం. అందులో అనేక మంది బహుళ అంతస్తులు కూడా నిర్మించుకున్నారు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు వచ్చి సర్వే నంబర్ 444/1 అని, ఇవి ప్రభుత్వ భూములు అంటూ ఫెన్సింగ్ వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
కె.రవికుమార్, బాధితుడు
ఇంటికి కూడా నోటీసు ఇచ్చారు.
లక్షల రుపాయలు ఖర్చు పెట్టి ఇళ్లు నిర్మించుకున్న వారికి అధికారులు నోటీసులు ఇవ్వడం బాధాకరం. అన్ని అనుమతులతో, పదేళ్ల క్రితమే ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్నాం. ఇంతకాలం పట్టించుకోని అధికారులు ఇప్పుడు సర్కారు భూములంటూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం అన్యాయం. మేం కోర్టును ఆశ్రయిస్తాం.
- శ్రీనివాస్, బాధితుడు
పత్రాలు ఇస్తే పరిశీలిస్తాం
మా నక్షా ప్రకారం ప్రభుత్వ భూమి అని ఉన్న వాటిని మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నాం. కొందరు కోర్టుకు వెళ్లారు. అయితే వారి నంబర్లు ఉన్న చోట భూములు ఉండటం లేదు. బాధితులు వారి పత్రాలు సమర్పిస్తే తప్పకుండా పరిశీలించి న్యాయం చేస్తాం. అవసరమైతే వారి భూములను కూడా చూపిస్తాం.
- జి.నవీన్‌కుమార్ శర్మ, పాల్వంచ తహసీల్దార్
Comments
Please login to add a commentAdd a comment