సాక్షి, హైదరాబాద్/ సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ‘ఆపరేషన్ ప్రహార్’లో భాగంగా తమపై భద్రతా బలగాలు డ్రోన్ దాడులు చేశాయని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఈనెల 19వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో తమపై డ్రోన్ల సాయంతో బాంబు వేశారని ఆరోపించారు. ఏప్రిల్ 19వ తేదీని చీకటి దినంగా లేఖలో అభివర్ణించారు. బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొత్తలంక, పాలగూడెం గ్రామాల సరిహద్దులో డ్రోన్ల సాయంతో 12 బాంబులు జారవిడిచారని పేర్కొన్నారు. మావోయిస్టులపై ఆకాశమార్గం ద్వారా జరిగిన ఈ దాడిని అన్ని వర్గాలవారు తీవ్రంగా ఖండించాలని కోరారు.
ఈ మేరకు దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేశారు. ఈ దాడిలో పశుపక్షాదులు, వృక్షాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఏప్రిల్ 3న బీజాపూర్‌లో భద్రతా బలగాలపై తాము జరిపిన దాడికి ఇది ప్రతీకార చర్య అని ఆరోపించారు. ఆ దాడితో నీరుగారిపోయిన స్థానిక పోలీసులు, ఇక్కడ మైనింగ్ చేపట్టాలనుకుంటున్న కార్పొరేట్ శక్తుల్లో తిరిగి మనోధైర్యం కూడగట్టేందుకే ఈ వాయుదాడి జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ చర్యలు వదిలి మావోల ఏరివేతపై దృష్టి సారించడమేంటని విస్మయం వ్యక్తం చేశారు.
ఆకాశ యుద్ధం మొదలైందా?
ఈ పరిణామాలు చూస్తుంటే మావో–భద్రతా బలగాల మధ్య ఆకాశయుద్ధం మొదలైందా అన్న చర్చ మొదలైంది. డ్రోన్ దాడి జరిగిందని మావోలు, తాము చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ దాడి జరిగి ఉంటే దేశ చరిత్రలో మావోలు, భద్రతా బలగాల పోరులో జరిగిన తొలి వాయుదాడి ఇదే అవుతుంది. మావోల నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం ‘ఆపరేషన్ ప్రహార్’మొదలుపెట్టిందని మావోలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే వాయు దాడులు జరిగాయంటున్నారు. అయితే స్థానిక ఎస్పీ కశ్యప్ ఈ విషయంపై స్పందించలేదు. మరోవైపు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ మాత్రం మావోల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, మావోల కేడర్‌లో ఉన్న ఆధిపత్య పోరులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు. తాము స్థానిక ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
వారు అమర్చిన ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్)లతో మహిళలు, చిన్నారులు సహా వేలాది మంది మరణాలకు మావోలే కారణమని ఆరోపించారు. బుధవారం కూడా ఐఈడీ కారణంగా ఓ ఐటీబీపీ జవాను గాయపడగా, ఓ ఆవు మరణించిందని వెల్లడించారు. మరోవైపు ఈ దాడిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. స్థానికంగా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు వాడే డ్రోన్ల సామర్థ్యం చాలా తక్కువని, అవి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ఎగురుతాయని, 10 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణిస్తాయని చెబుతున్నారు. అందులోనూ అవి నిఘా సంబంధిత సమాచారం మాత్రమే సేకరిస్తాయని, వీటికి బాంబులు మోసుకెళ్లే శక్తి లేదని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ డ్రోన్ దాడి జరిగి ఉంటే అవి బీజాపూర్‌కు సమీపంలో ఉన్న బిలాయ్ (389 కి.మీ.), జగదల్‌పూర్ (189 కి.మీ.), హైదరాబాద్ (301 కి.మీ.) నుంచి వచ్చి ఉండాలని స్థానికంగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నగరాల్లో మాత్రమే దాడి చేసే డ్రోన్లను నియంత్రించగలిగే సాంకేతికత అందుబాటులో ఉందన్న ప్రచారం స్థానికంగా జరుగుతోంది.
ఎందుకీ ఘర్షణ..
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని బస్తర్ డివిజన్‌లో ‘జనతన సర్కార్’ పేరిట సమాంతర ప్రభుత్వం నడుపుతున్న మావోయిస్టు పార్టీకి, పోలీసు బలగాలకు మధ్య నిరంతరం పోరు నడుస్తోంది. సాధారణ పౌరులకు హాని కలగకుండా, ఆస్తులకు నష్టం జరగకుండా బలగాలు పోరు చేస్తుండగా.. ఆదివాసీల మద్దతు తీసుకుంటూ మావోయిస్టులు యుద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, దంతెవాడ, బస్తర్, కాంకేర్, నారాయణపూర్ జిల్లాల్లో బలగాలు, మావోల మధ్య పోరుతో దండకారణ్యం రక్తసిక్తం అవుతోంది. ఈ పోరులో వేలాది మంది మావోయిస్టులు, బలగాలు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నెల 3న బీజాపూర్ జిల్లా తెర్రెం–జొన్నగూడ అటవీ ప్రాంతంలో మావోల వ్యూహాత్మక దాడిలో 23 మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వియత్నాం తరహా గెరిల్లా యుద్ధతంత్రాన్ని మావోయిస్టు పార్టీ అనుబంధ పీఎల్‌జీఏ దండకారణ్య ఆర్మీ కమాండర్ మడవి హిడ్మా ఆధ్వర్యంలో అమలు చేశారు. హిడ్మా ఫిలిప్పీన్స్‌లో ఈ తరహా శిక్షణ పొంది వచ్చాడు.
ఆకాశంలో యుద్ధం మొదలైందా?
Published Thu, Apr 22 2021 3:16 AM | Last Updated on Thu, Apr 22 2021 12:17 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment