34 నామినేషన్ల తిరస్కరణ | Thirty Four Nominations Are Rejected In Karimnagar District | Sakshi
Sakshi News home page

34 నామినేషన్ల తిరస్కరణ

Published Wed, Nov 21 2018 6:10 PM | Last Updated on Wed, Nov 21 2018 6:10 PM

Thirty Four Nominations Are Rejected In Karimnagar District

హుజూరాబాద్‌: ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కరీంనగర్‌ జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ అన్నారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం హుజూరాబాద్‌ శాసనసభకు పోటీ చేసేందుకు అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బోయపాటి చెన్నయ్యతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. బీ–ఫాం, సరైన అఫిడవిట్‌ వివరాలను అందించని వారి నామినేషన్‌ పత్రాలను తిరస్కరించినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారంగా నామినేషన్‌ పత్రాలను సమర్పించిన వారి అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసినట్లు చెప్పారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి 27 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా, అందులో 9 మంది నామినేషన్లు తిరస్కరించామన్నారు. ట్రెయినీ కలెక్టర్‌ రాజార్షిషా, తహసీల్దార్‌ హరికృష్ణ, ఆర్‌ఐ రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
రామగుండంలో ఐదు..
గోదావరిఖని(రామగుండం): రామగుండం ఎమ్మెల్యే స్థానానికి వచ్చిన ఐదు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా 22 మంది నామినేషన్లు సమర్పించారు. ఈనెల 19 నామినేషన్లకు చివరి తేదీ కాగా.. 22 మంది 40 నామినేషన్‌ సెట్లను వేశారు. అయితే ఈ నామినేషన్ల పరిశీలనలో ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. బీఎల్‌ఎఫ్‌ కూటమి నుంచి సీపీఐఎం రెండో అభ్యర్థిగా వేసిన వేల్పుల కుమారస్వామి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఆపూరి అనసూర్య, జైమహాభారత్‌ పార్టీ అభ్యర్థి తిరునగరి భవాని, లోక్‌తాంత్రిక్‌ సర్వజన సమ్మేళన్‌ పార్టీ అభ్యర్థి గూడూరి సుజాత, ఇండిపెండెంట్‌ అభ్యర్థి దుర్గం కుమార్‌ నామినేషన్లను తిరస్కరించారు. జనరల్‌ ఎలక్షన్స్‌ అబ్జర్వర్‌ చంద్రకాంత్‌లక్ష్మణ్‌రావు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నర్సింహామూర్తి, అసిస్టెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హన్మంతరావు పరిశీలించారు.

ఉపసంహరించుకుంటే డబ్బులు చెల్లిస్తాం
అసెంబ్లీ ఎన్నికల్లో 22 నామినేషన్లు రాగా.. అందులో ఐదు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యా రిటర్నింగ్‌ అధికారి నర్సింహామూర్తి అన్నారు. వీటిలో మూడింటికి అఫిడవిట్‌ సంతకాలు లేవని, మరోదాంట్లో పది మంది సభ్యుల పేర్లు ఉండాల్సి ఉండగా.. తొమ్మిది మంది సంతకాలే ఉన్నాయన్నారు. మరో అభ్యర్థి అఫిడవిట్‌ పూర్తిగా నింపలేదని అన్నారు. ఈనెల 22న సాయంత్రం 3 గంటల్లోగా నామినేషన్లు ఉపసంహరించుకునే అభ్యర్థులకు డిపాజిట్‌ డబ్బులు చెల్లిస్తామన్నారు.

మంథనిలో పది..
మంథని: మంథని ఆర్టీవో కార్యాలయంలో మంగళవారం నామినేషన్ల పరిశీలనలో పది మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి 20 మంది అభ్యర్థులు 35 నామినేషన్లు వేశారు. ఎన్నికల నియమావళిలో భాగంగా వివిధ కారణాలతో పది మంది అభ్యర్థులకు చెందిన నామినేనష్లు తిరస్కరణకు గురి కాగా.. మరో పది మంది అభ్యర్థుల నామినేషన్లు అనుమతించారు. అనుమతించినవారిలో పుట్ట మధు(టీఆర్‌ఎస్‌), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(కాంగ్రెస్‌), ఇటుకల మహేశ్‌(బీఎస్పీ), రేండ్ల సనత్‌కుమార్‌(బీజేపీ), మేడి కుమారస్వామి(ఎన్‌సీపీ), పోలం రాజేందర్‌(బీఎల్‌ఫీ), తాటి నాగరాజు(ఎస్‌పీబీ), బూడిద తిరుపతి(టీపీఎస్‌), బొమ్మ బాపు(స్వతంత్ర), చల్లా లక్ష్మణ్‌(స్వతంత్ర) ఉన్నారు.
 
కోరుట్లలో ఒకటి
మెట్‌పల్లి(కోరుట్ల): కోరుట్ల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దాఖలైన ఒకరి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రిటర్నింగ్‌ అధికారి గౌతమ్‌ పాల్గొని అభ్యర్థుల నామినేషన్ల పత్రాలను పరిశీలించారు. ఎన్నికల్లో మొత్తం 16మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. వీరిలో తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సతీమణి సరోజ నామినేషన్‌ను తిరస్కరించారు. టీఆర్‌ఎస్‌ తరఫున నామినేషన్‌ వేసిన ఆమె బీ–ఫాం సమర్పించని కారణంగా దానిని తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. ఆమోదం పొందిన మిగి లిన 15మందిలో 8మంది స్వతంత్రులున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం వరకు గడువుండడంతో.. వీరిలో ఎంతమంది బరిలో ఉంటారన్నది చర్చనీయాంశమైంది. 

సిరిసిల్లలో ఒకటి..
సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. మంగళవారం నామినేషన్ల పరిశీలనలో ఒక నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి టి.శ్రీనివాస్‌రావు తెలిపారు. అర్వరాజు కృష్ణంరావు న్యూ ఇండియా పార్టీ నుం చి పోటీ చేశారని, నామినేషన్‌ పత్రాల్లో తప్పులు దొర్లడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేం దర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ఆవునూరి రమాకాంత్‌రా వు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కేటీఆర్‌ తరఫున సెస్‌ చైర్మ న్‌ దోర్నాల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

వేములవాడ నియోజకవర్గంలో ఏడు..
వేములవాడ: వేములవాడ అసెంబ్లీ స్థానానికి ఈనెల 19 వరకు 23 మంది నామినేషన్లను దాఖలు చేశారు. ఏడు నామినేషన్లను తిరస్కరించినట్లు రిటర్నింగ్‌ అధికారి ఖీమ్యానాయక్‌ తెలిపారు. ఆది వనజ(కాంగ్రెస్‌), ప్రతాప మార్తాండతేజ(బీజేపీ), చలిమెడ రాజేశ్వర్‌రావు(టీఆర్‌ఎస్‌), మ్యాకల ఉదయ్‌కుమార్‌(సమాజ్‌వాది పార్టీ), కొండ దినేష్‌(ఇండిపెండెంట్‌), గోగుల రమేశ్‌(సోషన్‌ జస్టిస్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), గంట ఇస్తారి(ఇండిపెండెంట్‌) పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. 

చొప్పదండి నియోజకవర్గంలో ఒకటి..
గంగాధర(చొప్పదండి): చొప్పదండి నియోజకవర్గ శాసనసభ స్థానానికి 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. మంగళవారం దరఖాస్తుల పరిశీలనలో ఒకటి తిరస్కరణకు గురయినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున నామినేషన్‌ వేసిన స్వామి ఫాం ఏ, బీ సకాలంలో సమర్పించకపోవడంతో తిరస్కరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

హుజూరాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో పత్రాలు పరిశీలిస్తున్న సర్ఫరాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement