* సాంకేతిక కారణాలతో పలు నామినేషన్లు తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాఖలైన పలు నామినేషన్లను పరిశీలన సమయంలో అధికారులు వివిధ సాంకేతిక కారణాలతో తిరస్కరించారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన గురువారం పూర్తయింది. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. కాగా, అసెంబ్లీ స్థానాలకు 3,415, పార్లమెంట్ స్థానాలకు 457 నామినేషన్లు దాఖలయ్యాయి. తిరస్కరణకు గురైన అభ్యర్థుల్లో స్వతంత్రులతోపాటు, పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు కూడా ఉన్నారు.
వారిలో పార్టీల రెబెల్ అభ్యర్థులు అధికంగా ఉన్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ బీజేపీ అభ్యర్థి దేవిశెట్టి శ్రీనివాసరావు, రంగారెడ్డి జల్లా మేడ్చెల్‌లో వైసీపీ అభ్యర్థి కుసుమకుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల వైసీపీ అభ్యర్థి అతికూర్ రెహవూన్, నల్లగొండ జిల్లా వైసీపీ అభ్యర్థులు ఇరుగు సునీల్‌కుమార్(నల్లగొండ), గూడూరు జైపాల్‌రెడ్డి(భువనగిరి)ల నామినేషన్లను తిరస్కరించారు. కాగా, మహబూబాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి సీతారాం నాయక్ కాకతీయ యుూనివర్సిటీలో ప్రాఫెసర్‌గా పనిచేస్తున్నారని, ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయితే, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని అధికారులు పేర్కొని, ఆయన నామినేషన్‌పై నిర్ణయం తీసుకోలేదు.
కాగా, శుక్రవారం సాయంత్రంలోగా దీనికి సబంధించిన లేఖ సమర్పించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆయనను ఆదేశించినట్టు సమాచారం. సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి దాఖలైనవాటిలో రాష్ట్రీయ అహింస మంచ్ అభ్యర్థి ప్రేమ్‌చంద్ మునాట్, ఆల్ ఇండియా మైనారిటీస్ ఫ్రంట్ అభ్యర్థి షేక్‌బాజి, సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి నాగలక్ష్మి, రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి పి.శోభాయాదవ్‌ల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.
జిల్లాల వారీగా అసెంబ్లీకి దాఖలైన నామినేషన్లు
ఆదిలాబాద్(254), నిజామాబాద్(205), కరీంనగర్(372), మెదక్(228), రంగారెడ్డి(548), హైదరాబాద్ (584), మహబూబ్‌నగర్(293), నల్లగొండ(406), వరంగల్(264), ఖమ్మం(261).
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తిరస్కరణకు గురైన నామినేషన్ల సంఖ్య
ఆదిలాబాద్-4, పెద్దపల్లి-2, కరీంనగర్-2, జహీరాబాద్-2, మెదక్-2, సికింద్రాబాద్-4, చేవెళ్ల-4, మహబూబ్‌నగర్-1, నాగర్ కర్నూల్-1, నల్లగొండ-2, భువనగిరి-1, వరంగల్-2, మహబూబాబాద్-3.
నామినేషన్ల పరిశీలన పూర్తి
Published Fri, Apr 11 2014 3:02 AM | Last Updated on Thu, Sep 6 2018 2:48 PM
Advertisement
Advertisement