సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దేశంలో నాలుగు రాష్ట్రాలతోపాటు తెలం గాణలో ఎన్నికల నగారా మోగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాంతోపాటే తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ ఎన్నికల షెడ్యూల్‌ను శనివారం విడుదల చేశారు. మొత్తం 119 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు వచ్చే నెల 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్ 19 కాగా, 20న ఆ నామినేషన్లను పరిశీలిస్తారు. అదేనెల 22 ఉప సంహరణకు చివరి తేదీ కాగా, డిసెంబర్ పోలింగ్, 11న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఎట్టకేలకు ‘ముందస్తు’ ఎన్నికల షెడ్యూల్..
అసెంబ్లీ రద్దయిన రాష్ట్రాలకు ఆరు నెలల్లోపు ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు పేర్కొనడం, తెలంగాణకు సంబంధించిన ఓటర్ల జాబితా అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో అప్పుడే ఎన్నికల షెడ్యూల్ రాకపోవచ్చని అందరూ భావించారు. దీంతో ఉమ్మడి కరీంనగర్‌లో 13 అసెంబ్లీ స్థానాలకు కూడా నెల రోజుల తేడాతో ఎన్నికలు జరుగుతాయని అనుకున్నారు. అయితే.. తెలంగాణలో ఈనెల 8న ఓటర్ల జాబితా అందాల్సి ఉందని, 12న ఓటర్ల జాబితాను ప్రకటించాలని నిర్ణయించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు షెడ్యూల్‌ను ప్రకటించింది.
గత నెల 6న తెలంగాణ అసెంబ్లీ రద్దుకావడంతో తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉందని, మిగతా రాష్ట్రాల్లో ఇప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి తెచ్చిన ఈసీ, డిసెంబర్ 15 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని ప్రకటించింది. దీంతో ఇప్పటికే 13 నియోజకవర్గాలకు 12 స్థానాల్లో టిక్కెట్లు పొందిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు మరింత దూకుడు పెంచనుండగా, కాంగ్రెస్, కూటమి, బీజేపీ, వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం తదితర పార్టీలు సైతం బరిలోకి దిగనున్నాయి. కాగా.. ముందస్తు ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో పాత కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి.
రెండు ఎన్నికల్లో నోటిఫకేషన్ తేదీల్లో తేడా.. ఆరు నెలల ముందు షెడ్యూల్..
2014 సార్వత్రిక ఎన్నికలతో 2018 ముందస్తు ఎన్నికల షెడ్యూల్‌ను పోలిస్తే సుమారు ఐదు నెలల ముందుగా విడుదలైంది. అయితే.. నామినేషన్ల దాఖలు, పోలింగ్, ఓట్ల లెక్కింపు కూడా ఐదు నెలల తేడాతో జరగనున్నాయి. 2014లో ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 5న విడుదల చేస్తే, ఈసారి ఐదు నెలల ముందుగా అక్టోబర్ 6న ప్రకటించారు. 2014లో నోటిఫికేషన్ ఏప్రిల్ 2న జారీ కాగా ఈసారి నవంబర్ 12న జారీ చేయనున్నారు.
ఇదే తరహాలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన తేదీల్లోనూ తేడా ఉండగా, గత ఎన్నికలకు ఏప్రిల్ 30న పోలింగ్ జరుగగా, ఈసారి డిసెంబర్ 7న నిర్వహించనున్నారు. అయితే.. 2014లో నామినేషన్ల ఉపసంహరణ నుంచి పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందు వరకు ప్రచారానికి 16 రోజుల గడువు ఉండగా, ఈసారి 13 రోజులు మాత్రమే ఇచ్చారు. అప్పుడు పోలింగ్ తేదీకి ఓట్ల లెక్కింపునకు 16 రోజులు గడువు కాగా, ఈసారి నాలుగు రోజులు మాత్రమే.
తక్షణమే ఎన్నికల నిబంధనల అమలు.. కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం...
ఎన్నికల నిబంధనలు తక్షణం అమల్లోకి వచ్చేలా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ శనివారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భవనాలపై ఉన్న కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు 24 గంటల్లోగా తొలగించాలని.. బహిరంగ ప్రదేశాల్లో 48 గంటల్లోగా తీసేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతీ జిల్లాలో ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని, అధికారిక వాహనాల వినియోగం తక్షణమే రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రకటనలు నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రచారం నిషేధమని.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఇందుకోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్, మొబైల్ టీమ్‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment