పవన్‌కు మోదీ ఝలక్ ఇచ్చారా?
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టేసారా? గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన పవన్‌పై పొగడ్తల వర్షం కురిపించిన మోదీ తన ప్రతిష్టాత్మక కార్యక్రమం స్వచ్ఛ్ భారత్ కు ఎందుకు ఆహ్వానించలేదు. స్వచ్ఛ భారత్ పట్ల స్ఫూర్తిని కొనసాగించాలంటూ సోమవారం ప్రధాని రాసిన లేఖల్లో పవర్‌స్టార్‌కు స్థానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ‘స్వచ్ఛత హి సేవా’ ఉద్యమ ప్రచారంలో వివిధ రంగాల ప్రముఖులతో పాటు, సినీ రంగ ప్రముఖులకు కూడా లేఖలు రాసిన మోదీ పవన్‌కళ్యాణ్‌కు ఎందుకు లేఖ రాయలేదు? ఇదే ఇపుడు ఇటు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది.
అక్టోబర్ 2న నిర్వహించనున్న ‘స్వచ్ఛత హి సేవా’ కార్యక్రమాలో పాలుపంచుకోవాలని ప్రధాని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులకు కూడా లేఖలు పంపారు. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు, ప్రిన్స్ మహేష్ బాబు, బాహుబలి ప్రభాస్ వీరిలో ఉన్నారు. వీరితోపాటు మోహన్ లాల్, అనిల్ కపూర్, అనుష్కశర్మలకు కూడా మోదీ లేఖలు రాయడం విశేషం.
కాగా ఇటీవల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు కూడా ఒక లేఖ రాశారు. స్వచ్ఛ్ భారత్, మిషన్ భగీరథ కార్యక్రమాలను ప్రశంసిస్తూ అభినందన లేఖ రాశారు. అక్టోబర్ 2న మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలు ‘స్వచ్ఛత హి సేవా’ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు స్వచ్ఛత హి సేవా ఉద్యమంలో పాల్గొనాలని, తన అనుభవాలను నరేంద్రమోదీ యాప్‌లో పంచుకోవాలని పలువుర్ని మోదీ కోరుతున్న సంగతి తెలిసిందే.