పవన్ కల్యాణ్తో పని అయిపోయిందా ?
అది దేశ సార్వత్రిక ఎన్నికల సమయం. అంతేకాదు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని శాసనసభకు కూడా ఎన్నికల సమయం. ఇదే తగిన సమయం అని ఆలోచించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యుద్ద విమానంలా జనసేన పార్టీతో దూసుకు వచ్చాడు. ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదు కానీ బీజేపీ, టీడీపీల మైత్రీ బంధానికే తన మద్దతు అన్నాడు. 'ఆ బంధాని'కి ఓట్లు వేసి గెలిపించాలంటూ బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్రమోడీ, టీడీపీ నాయకుడు చంద్రబాబుతో కలసి నాటి ఆంధ్రదేశమంతా కలియతిరిగాడు. ఎన్నికలు వచ్చాయి.
రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ బంధాన్ని మెచ్చిన ప్రజలు అధికారాన్ని కట్టబడితే.... కేంద్రంలో మోడీ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. పవన్ కల్యాణ్ 'పనితనాన్ని' సాక్షాత్తూ ప్రధాని మోడీ అచ్చెరువొందారు. అంతేకాదు మోడీ తొలిసారిగా పార్లమెంట్లో అడుగు పెట్టిన సమయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరుకావాలని పవన్ కల్యాణ్కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. ఆ కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ను మోడీ అభినందించిన సంగతి ఆ రోజు టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో మనమంతా చూసిన సంగతి తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉంది.
ఆ తర్వాత మోడీ ఏనాడు పవన్ కల్యాణ్ ఊసే ఎత్తలేదు. అందుకు ఉదాహరణ.... అక్టోబర్ 2 గాంధీ జయంతి వేదికగా ప్రధాన నరేంద్ర మోడీ 'స్వచ్ఛ భారత్' పేరిట ఓ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు. రానున్న ఐదేళ్ల కాలంలో భారతదేశం 'క్లీన్ ఇండియా'గా మారాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్తంగా తొమ్మిది మంది ప్రముఖలను ఆహ్వానించారు.
ఆ జాబితాలో వరుసగా క్రికెట్ దిగ్గజం భారతరత్న సచిన్ టెండూల్కర్, పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, నటులు కమల్‌హాసన్, సల్మాన్‌ఖాన్, ప్రియాంకా చోప్రా, గోవా గవర్నర్ మృదుల సిన్హా, తారక్ మెహతాతోపాటు ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఉన్నారు. ఆహ్వానం పంపిన వారంతా మోడీకి ఇప్పటికే కృతజ్ఞతలు తెలిపి... స్వేచ్ఛ భారత్కు మేము సైతం అంటూ కమల్, అనీల్ అంబానీ.... అంతా నడుం బిగించినట్లు ప్రకటించేశారు. కానీ ఆ జాబితాలో పవన్ కల్యాణ్ పేరు కనిపించలేదు. ఎన్నికలు అయ్యాయి. ఇక పవన్ కల్యాణ్ ఊసే మోడీ మరిచారో లేక ఈ తొమ్మిదికి మందికి ఉన్నంత సత్తా పవన్ కల్యాణ్కు లేదనుకున్నారో ఏమో. వచ్చే ఎన్నికల సమయం నాటికైనా మోడీకి పవన్ కల్యాణ్ గుర్తుకు వస్తాడేమో అని చూడాలి.