Clean India campaign
-
అనవసర నియంత్రణలకు చెల్లు
బ్రిస్బేన్: అనవసరమైన చట్టాలు, నియంత్రణలను తొలగించడం ద్వారా పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరంగా చేయడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వ్యాపారాలకు అనుకూలంగా పారదర్శక విధానాలను అమల్లోకి తెస్తున్నామని, ఈ మేరకు భారత్‌లో మార్పును చూడొచ్చని ఆయన తెలిపారు. క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అల్పాహార విందు సమావేశంలో పాల్గొన్న సందర్భంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆస్ట్రేలియా ఇన్వెస్టర్లను మోదీ ఆహ్వానించారు. ‘గుడ్ గవర్నెన్స్ అన్నది మార్పునకు నాంది. సాధారణ పౌరుల విషయంలోనే కాదు.. వ్యాపారాలకు కూడా ఇది చాలా ముఖ్యం. అనుకూల పరిస్థితులు ఉంటే అవకాశాలను ఉభయతారకమైన భాగస్వామ్యాలుగా మల్చుకోవచ్చు. ఈ దిశగా మేం వ్యాపారాలకు అనుకూలమైన పారదర్శక విధానాలను అమల్లోకి తెచ్చాం. మరిన్ని తెస్తున్నాం’ అని ఆయన చెప్పారు. ఇంధనం, ఖనిజ సంపద, వ్యవసాయం, ఆహార భద్రత తదితర అంశాల్లో భారత్ పురోగమించడంలో క్వీన్స్‌ల్యాండ్ కీలక భాగస్వామి కాగలదన్నారు. వ్యవసాయోత్పత్తిని మెరుగుపర్చేందుకు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ఊతమిచ్చేందుకు అవసరమైన పరిశోధనలను ఇరు దేశాలు సంయుక్తంగా చేపట్టాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పారు. అలాగే ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీల విషయంలోనూ కలిసి పనిచేయాలని ఆయన తెలిపారు. పర్యాటక రంగంపరంగా కూడా ప్రత్యేకత ఉన్న క్వీన్స్‌ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు భారతీయ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో తయారీకి ఊతమిచ్చే విధంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మోదీ తెలిపారు. 100 స్మార్ట్ సిటీలు, 50 మెట్రో ప్రాజెక్టులు మొదలైన బృహత్తర ప్రాజెక్టులను తలపెట్టినట్లు వివరించారు. వీటిలో పాలుపంచుకోవాలని క్వీన్స్‌ల్యాండ్ ఇన్వెస్టర్లను మోదీ ఆహ్వానించారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థికంగా, భద్రతాపరంగా సమగ్రమైన బంధం ఉందని, అంతర్జాతీయ వేదికల్లో రెండు దేశాలూ పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆయన తెలిపారు. ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం నెలకొనడానికి ఇది చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. జీవీకే, అదానీ గ్రూప్‌లు చేపట్టిన భారీ మైనింగ్ ప్రాజెక్టులకు తోడ్పాటునిచ్చేలా రైలు రవాణాపరమైన మౌలిక సదుపాయాలు కల్పనపై దృష్టి పెట్టనున్నట్లు మోదీతో భేటీలో క్వీన్స్‌ల్యాండ్ ప్రీమియర్ క్యాంప్‌బెల్ న్యూమన్ హామీ ఇచ్చారు. ఆస్ట్రేలియాలోని గెలిలీ బేసిన్లో భారతీయ కంపెనీలు భారీ ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాయి. కార్మైఖేల్ గనిపై అదానీ గ్రూప్ 16.5 బిలియన్ డాలర్లు, అల్ఫా మైన్‌పై జీవీకే గ్రూప్ 6 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నాయి. అదానీ ఆస్ట్రేలియా బొగ్గు ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్... మెల్బోర్న్: భారత ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ ప్రతిపాదించిన 7 బిలియన్ డాలర్ల బొగ్గు మైనింగ్ ప్రాజెక్ట్‌కు ఆస్ట్రేలియాకు చెందిన క్వీన్స్లాండ్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు ఈ ప్రాజెక్ట్‌కు మద్దతుగా నిలిచే రైల్వే మౌలికసదుపాయాల పెట్టుబడులకు సైతం ఓకే చెప్పింది.గెలిలీ బేసిన్లో తలపెట్టిన కార్మైఖేల్ మైనింగ్ ప్రాజెక్ట్‌కు అనుమతి లభించడాన్ని స్వాగతిస్తున్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. ఈ అంశంపై అదానీ గ్రూప్ ఆస్ట్రేలియా కంట్రీ హెడ్ జయకుమార్ జనక్‌రాజ్ స్పందిస్తూ దీర్ఘకాలంగా కంపెనీ చేస్తున్న కృషికి ఇది తార్కాణమని వ్యాఖ్యానించారు. ప్రణాళికలో భాగంగా 2017కల్లా బొగ్గును వెలికితీయగలమన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గెలిలీ బేసిన్లో తలపెట్టిన మూడు ప్రాజెక్ట్‌ల ద్వారా 28,000 మందికి ఉపాధి లభించే అవకాశమున్నట్లు అంచనా. వీటిలో జీవీకే అల్ఫామైన్, క్లైవ్ పామర్ వారతా కోల్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇక్కడ 11 బిలియన్ టన్నుల థర్మల్ బొగ్గు నిల్వలున్నట్లు అంచానా. కాగా, కార్మైఖేల్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎస్బీఐతో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పం దాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. దీనిలోభాగంగా ఎస్బీఐ బిలియన్ డాలర్లవరకూ రుణాన్ని ఇవ్వనుంది. ఎస్బీఐతో ఎంవోయూ ఒక మెలురాయికాగా, క్వీన్స్‌లాండ్‌లో ఇది విలువైన పెట్టుబడని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. -
పవన్ కల్యాణ్‌తో పని అయిపోయిందా ?
అది దేశ సార్వత్రిక ఎన్నికల సమయం. అంతేకాదు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని శాసనసభకు కూడా ఎన్నికల సమయం. ఇదే తగిన సమయం అని ఆలోచించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యుద్ద విమానంలా జనసేన పార్టీతో దూసుకు వచ్చాడు. ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదు కానీ బీజేపీ, టీడీపీల మైత్రీ బంధానికే తన మద్దతు అన్నాడు. 'ఆ బంధాని'కి ఓట్లు వేసి గెలిపించాలంటూ బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్రమోడీ, టీడీపీ నాయకుడు చంద్రబాబుతో కలసి నాటి ఆంధ్రదేశమంతా కలియతిరిగాడు. ఎన్నికలు వచ్చాయి. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ బంధాన్ని మెచ్చిన ప్రజలు అధికారాన్ని కట్టబడితే.... కేంద్రంలో మోడీ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. పవన్ కల్యాణ్ 'పనితనాన్ని' సాక్షాత్తూ ప్రధాని మోడీ అచ్చెరువొందారు. అంతేకాదు మోడీ తొలిసారిగా పార్లమెంట్లో అడుగు పెట్టిన సమయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరుకావాలని పవన్ కల్యాణ్‌కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. ఆ కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్‌ను మోడీ అభినందించిన సంగతి ఆ రోజు టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో మనమంతా చూసిన సంగతి తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత మోడీ ఏనాడు పవన్ కల్యాణ్ ఊసే ఎత్తలేదు. అందుకు ఉదాహరణ.... అక్టోబర్ 2 గాంధీ జయంతి వేదికగా ప్రధాన నరేంద్ర మోడీ 'స్వచ్ఛ భారత్' పేరిట ఓ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు. రానున్న ఐదేళ్ల కాలంలో భారతదేశం 'క్లీన్ ఇండియా'గా మారాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్తంగా తొమ్మిది మంది ప్రముఖలను ఆహ్వానించారు. ఆ జాబితాలో వరుసగా క్రికెట్ దిగ్గజం భారతరత్న సచిన్ టెండూల్కర్, పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, నటులు కమల్‌హాసన్, సల్మాన్‌ఖాన్, ప్రియాంకా చోప్రా, గోవా గవర్నర్ మృదుల సిన్హా, తారక్ మెహతాతోపాటు ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఉన్నారు. ఆహ్వానం పంపిన వారంతా మోడీకి ఇప్పటికే కృతజ్ఞతలు తెలిపి... స్వేచ్ఛ భారత్‌కు మేము సైతం అంటూ కమల్, అనీల్ అంబానీ.... అంతా నడుం బిగించినట్లు ప్రకటించేశారు. కానీ ఆ జాబితాలో పవన్ కల్యాణ్ పేరు కనిపించలేదు. ఎన్నికలు అయ్యాయి. ఇక పవన్ కల్యాణ్ ఊసే మోడీ మరిచారో లేక ఈ తొమ్మిదికి మందికి ఉన్నంత సత్తా పవన్ కల్యాణ్‌కు లేదనుకున్నారో ఏమో. వచ్చే ఎన్నికల సమయం నాటికైనా మోడీకి పవన్ కల్యాణ్ గుర్తుకు వస్తాడేమో అని చూడాలి. -
'నేను ఒకడిని కావడం గర్వంగా ఉంది'
మంబై: ప్రధాని నరేంద్ర మోడీ 'స్వచ్ఛ భారత్' కోసం తొమ్మిది మందిని ఆహ్వానించి వారిలో నేను ఒకరిని కావడం గర్వంగా ఉందని ప్రముఖ నటుడు, పద్మశ్రీ కమల్ హాసన్ తెలిపారు. తొమ్మిది మంది జాబితాలో తన పేరు ఉన్నందుకు ప్రధాని మోడీకి కమల్ ధన్యవాదాలు తెలిపారు. 'స్వచ్ఛ భారత్' కోసం మోడీ విసిరిన సవాల్ ప్రతిష్టాత్మక ఆహ్వానమని ఆయన అభివర్ణించారు. తనను పేరు ఆ జాబితాలో చేర్చడం మోడీ ఔదార్యానికి నిదర్శనమన్నారు. గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన న్యూఢిల్లీలో 'స్వచ్ఛ భారత్'ను ప్రధాని మోడీ ప్రారంభించారు. వచ్చే ఐదేళ్ల కాలంలో భారతదేశాన్నీ క్లీన్ ఇండియాగా మార్చాలని ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ప్రధాని మోడీ పరిశుభ్ర భారతావని ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలంటూ పలు రంగాల్లోని తొమ్మిది మంది ప్రముఖులకు ఆహ్వానం పలికారు. అలాగే ఆ ప్రముఖుల్లో ఒక్కొక్కరూ మరో తొమ్మిది మందిని ఈ ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కోరాలని సూచించారు. మోడీ ఎంపిక చేసిన తొమ్మిది మంది ప్రముఖుల్లో క్రికెట్ దిగ్గజం భారతరత్న సచిన్ టెండూల్కర్, పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, నటులు కమల్‌హాసన్, సల్మాన్‌ఖాన్, ప్రియాంకా చోప్రా, గోవా గవర్నర్ మృదుల సిన్హా, తారక్ మెహతాతోపాటు ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఉన్నారు. -
ప్రధాని ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రియాంక
ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఛాలెంజ్‌ని బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా స్వీకరించారు. బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసే 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ఏడాదికి వంద రోజులు పాల్గొన్నవలసిందిగా ప్రజలకు మోదీ పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సినిమా స్టార్లను కూడా ఆయన ఆహ్వానించారు. మోడీ ఆహ్వానించినవారిలో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ప్రియాంకా చోప్రాలతపోపాటు శశిథరూర్, సచిన్ టెండుల్కర్, తారక్ మెహతా, అనీల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ తదితరులు ఉన్నారు. ప్రధాని మోదీ పిలుపునకు ప్రియాంక ట్విట్టర్లో స్పందించారు. ప్రధాని చేపట్టిన కార్యక్రమానికి తన మద్దతు తెలిపారు. ప్రధాని ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇది చాలా మంచి ఆలోచనగా ప్రియాంక పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తమ సహాయసహకారాలు అందించవలసిందిగా తన అభిమానులను కూడా ఆమె ప్రోత్సహించారు. *** -
రోడ్డు ఊడ్చి చెత్త ఎత్తిన నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. గాంధీజీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మోడీ స్వయంగా చీపురు పట్టారు. ఢిల్లీలోని వాల్మీకి బస్తీలో ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్డు ఊడ్చి చెత్త ఎత్తారు. మోడీతో పాటు పలువురు మంత్రులు, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సుమారు అయిదు వేలమంది విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు ముందు మోడీ వాల్మీకి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు స్వచ్ఛభారత్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రులంతా చీపుర్లు పట్టిన విషయం తెలిసిందే.